తెలంగాణలో రుణ మాఫీపై
ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..!
హైదరాబాద్
PM Modi
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని చెప్పారు.
దిక్కుతోచని స్ధితిలో తెలంగాణ రైతాంగం రుణ మాఫీ కోసం తిరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ రైతులను నిండా ముంచిందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలోని వార్ధాలో శుక్రవారం ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలోలా లేదని అన్నారు. ఇవాళ కాంగ్రెస్ లో దేశభక్తి స్ఫూర్తి లోపించిందని అన్నారు.
విదేశీ గడ్డపై కాంగ్రెస్ నేతలు వాడుతున్న భాషను చూస్తే బాధేస్తోందని చెప్పారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానపరచడం వంటి దేశ వ్యతిరేక అజెండాతో ముందుకెళుతున్నారని ఆరోపించారు. తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ వంటి వారితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని అన్నారు. ఇవాళ దేశంలో అత్యంత అవినీతి, నిజాయితీ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజ కుటుంబమేనని ప్రధాని మోడీ ఆరోపించారు. అవినీతి, కుంభకోణాల్లో కాంగ్రెస్ పార్టీని మించిన వారెవరూ లేరని ప్రధాని ఎద్దేవా చేశారు.