పవన్.. మోడీ సుదర్ఘీ భేటీ….
దేశ, రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చ
అమరావతి, నవంబర్ 28, (న్యూస్ పల్స్)
Pawan & Modi
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడిపారు. తొలిరోజు వరుసగా కేంద్ర మంత్రులతో, రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన మొదలుకుని ఇప్పటి వరకూ పెండింగ్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించి, కీలక ప్రతిపాదనలపై నిశితంగా చర్చించారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. ఇద్దరి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలు, రాష్ట్రానికి ఇంకా రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులు, జలజీవన్ మిషన్ అమలులో ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితితో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. అంతకు ముందు ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో కూడా భేటీ అయ్యారు.
ప్రధానితో కీలక భేటీ తర్వాత ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్ చేశారు. ‘ పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్నప్పటికీ నాకు సమయం కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. గాంధీనగర్‌లో తొలిసారి భేటీ నుంచి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారీ ఆయనపై అభిమానం మరింత పెరుగుతుంటుంది. మోదీకి పని పట్ల నిబద్ధత, భారతదేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం. థ్యాంక్యూ సర్’ అంటూ ఫొటోను కూడా షేర్ చేశారు. మరోవైపు మోదీతో భేటీలో జరిగిన చర్చ తాలుకు విషయాలన్నింటినీ జనసేన అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం గాలికొదిలేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ప్రధాని మోదీకి పవన్ తెలియజేశారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఏపీ విజన్‌ను గౌరవ ప్రధాని ఎదుట ఉంచారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లను కేటాయించింది. ఇందులో కేవలం రూ.2 వేల కోట్లను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసింది అనే వివరాలను మోదీకి తెలిపారు.ఖర్చు చేసిన నిధుల వల్ల పూర్తయిన పనులు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా, నాసిరకంగా చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వంలో పూర్తయిన పనుల్లో ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.
పనుల కోసం ఖర్చు చేసిన నిధులు కూడా జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు దూరంగా ఉన్నాయి. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం అందలేదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసిన పథకం పనులను తగిన విధంగా ఉపయోగించుకొని, జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనుల్ని మొదలుపెట్టేందుకు సంపూర్ణ డీపీఆర్‌ను తయారు చేసింది. పథకం ద్వారా గ్రామీణులందరికీ 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, ఎలా ముందుకు వెళ్లాలనే పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించాం. ఈ పథకం అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేయాలని పవన్ కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా చూడాలనేది మా ఆశయం’ అని మోదీకి పవన్ విజ్ఞప్తి చేసినట్లు జనసేన ఎక్స్ వేదికగా తెలిపిందినాన్స్టాప్గా భేటీల అనంతరం ఢిల్లీలో పవన్ మీడియాతో మాట్లాడుతూ రెండ్రోజుల పర్యటన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఆదానీ వ్యవహారంపై స్పందించారు. ముఖ్యంగాఅదానీ వ్యవహారంలో గత ప్రభుత్వానికి లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై, ఆ ఒప్పందాలను రద్దు చేస్తారా? అని మీడియా ప్రశ్నకు లాజిక్‌గా బదులిచ్చారు. ‘ గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడింది. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది? అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పవన్ స్పష్టం చేశారు.కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీలో భాగంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాలపై పవన్ చర్చించారు.
‘ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రతిపాదననను పరిశీలించలరు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది.తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుంది. ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. కేంద్రం నిబంధనలను సవరించి ఏపీ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్‌గా ఉండే మా రాష్ట్రానికే దక్కేలా చూడాలి. దీంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు.
అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో రాష్ట్ర ప్రభుత్వం కస్టోడియన్‌గా కొనసాగుతుంది’ అని పవన్ మీడియాకు వివరించారు.బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 25న ఢాకాలో సనాతన్ జాగరణ్ మంచా పేరుతో యువకులు ర్యాలీ చేశారు. ఇందులో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఉంచారు. తమ దేశ జెండాను అవమానపరిచారంటూ కృష్ణదాస్ సహా 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
‘ ఇలాంటి అంశాలపై మనమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను కలచివేస్తోంది. ఇలాంటి అఘాయిత్యాలు ఇక చాలు, బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ఆపాలి. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి’ అని పవన్ హితవు పలికారు.
మోడీలో మార్పు మంచిదేనా… | Is change in Modi good? | Eeroju news