పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ 2025, మార్చి 28న భారీస్థాయిలో విడుదల
Pawan kalyan
– విజయవాడలో ప్రారంభమైన ‘హరి హర వీర మల్లు’ కొత్త షెడ్యూల్
– చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
– హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ
– 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల
సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయ రంగంలోనూ అదే స్థాయిలో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. దీంతో సినిమాలకు ఆయన సమయం కేటాయించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ను మళ్ళీ వెండితెరపై చూసుకొని, థియేటర్లలో అసలుసిసలైన పండగ వాతావరణాన్ని తీసుకురావాలని.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి.
వారి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ, ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ 2025, మార్చి 28వ తేదీన భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
‘హరి హర వీర మల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత, ఈ సినిమా యొక్క మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఆయన విలువైన సమయాన్ని వృథా చేయకుండా పక్కా ప్రణాళికతో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. విరామం తరువాత కూడా యోధుడి పాత్రకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ తన రూపాన్ని మలచుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన రూపం, ఆహార్యం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. పవన్ కళ్యాణ్ రాకతో చిత్ర బృందం రెట్టింపు ఉత్సాహంతో భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణను ప్రారంభించింది.
‘హరి హర వీర మల్లు’ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 23న విజయవాడలో ప్రారంభమైంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో చిత్ర బృందం భారీ సెట్‌ను నిర్మించింది. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను.. 400 మంది ఫైటర్లతో పాటు, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరిస్తున్నారు.
సీనియర్ నటులు నాజర్, రఘుబాబు, అయ్యప్ప పి. శర్మ లతో పాటు, సునీల్, నర్రా శ్రీను, నిహార్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రీకరణలో భాగం కానున్నారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను మునుపెన్నడూ చూడని స్థాయిలో అత్యద్భుతంగా తెరకెక్కించడానికి ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్‌లతో కలిసి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి ప్రణాళికలతో సిద్ధమయ్యారు.
ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయడానికి, అలాగే భారీ తారాగణం మరియు సాంకేంతిక సిబ్బందిని ఈ చిత్రంలో భాగం చేయడంలో యువ దర్శకుడు జ్యోతి కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు, విడుదల తేదీ ప్రకటనతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నింపారు. విడుదల తేదీని తెలుపుతూ వదిలిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో మునుపెన్నడూ చూడని విధంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సరికొత్తగా చూడబోతున్నామని పోస్టర్ తోనే హామీ ఇచ్చారు.
బాలీవుడ్ సంచలనం, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్, దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందాల నటి నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
దిగ్గజ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.