-
ఏజెన్సీ ప్రాంతాలపై పవన్ ఫోకస్
విశాఖపట్టణం, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్)
పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించినప్పుడు ఈ పార్టీ ఉంటుందా.. ప్రజారాజ్యం పార్టీలో లాగా కాలగర్భంలో కలిసిపోతుందా? అనే అనుమానాలు చాలామందిలో తలెత్తాయి. కానీ జనసేనానిని రాజకీయాల్లో తన బలమేంటో చూపించుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు చవి చూశారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీ, బీజేపీ కూటమికి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చి పోటీ చేయకుండా ప్రభుత్వ ఏర్పాట్లులో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిని, ఒంటరిపోరుకు తన బలం సరిపోదని అర్థం చేసుకున్నారు.2024 ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటుకు తానే ముందుండి చొరవ తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్ చేయడమే కాదు 151 యొక్క సీట్లతో గెలిచామన్నా వైసీపీ గర్వాన్ని అణచివేశారు .. 2024 ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎం గా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు .. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి .. ఆదివాసీలను ప్రయాణ కష్టాల నుంచి బయట పడేయడానికి రోడ్లకు శంకుస్థాపన చేశారు. గిరిజనులకు డోలీల్లో ప్రయాణించే కష్టాలను తీరుస్తానని ప్రకటించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో జోరు వానలో సైతం పర్యటించడం, స్వయంగా నడుస్తూ బురదలో కొండలు ఎక్కడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతవరకు ఎన్నికల సమయంలో తప్ప గెలిచిన తరువాత ఏ ఒక్క నాయకుడు ఆ గిరి శిఖర గ్రామల వైపు కన్నెత్తి చూడలేదంటే అతిశయోక్తి కాదు. కానీ పవన్ కళ్యాణ్ దానికి బ్రేక్ చేశారు. తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో పవన్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. నిజానికి పవన్ పర్యటించిన ఆయా గ్రామాలు రాజకీయంగా అప్పుడు కాంగ్రెస్‌కు, ఇపుడు వైసీపీకి కంచుకోటలు.2024 ముందు ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేశాయి. అరకు, పాడేరు, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలలో 2014, 2019 ఫలితాలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది . ఆయా సెగ్మెంట్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంతెందుకు కూటమి ప్రభంజనంలో కూడా అరకు ఎంపి , అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లు కూడా వైసీపీనే గెలుచుకుంది. మిగిలిన నియోజకవర్గాలలో కూటమి గెలిచినప్పటికీ గిరిజనం మాత్రం వైసీపీనే విశ్వసిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నది చరిత్ర చెప్తున్న వాస్తవం. గబ్బర్ సింగ్ అభివృద్ది మంత్రంతో గిరిజన తండాల్లో అడుగుపెట్టాడు.. పవన్ కళ్యాణ్ సాదా సీదాగా పర్యటిస్తే ఏముంది.
ముందు మన లెక్క ఎంటో చూపిస్తే తరువాత ఓట్ల లెక్క తేల్చవచ్చు అనే ధోరణిలో ఉన్నారట జనసేనాని .. అందుకే ఏళ్ల కొద్ది పాతుకుపోయిన డోలీ మోతలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేశారట . అభివృద్ది మంత్రంతో గిరిజన మనసులను గెలవాలనే పట్టుదలతో ఉన్నారంట ఆయన.. రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు గిరిజన గ్రామాల్లో మకాం అంటూ చేసిన ప్రకటన కూడా వారితో మమేకమవ్వడానికేనంట. మన మనిషి అని వారి చేతే అనిపించుకునేలా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారట జనసేనాని. అల్లూరి సీతారామరాజుజిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం ప్రసంగిస్తుండగా అభిమానులు ఉత్సాహంతో ఉరకలేశారు. సీఎం సీఎం అంటూ పలుమార్లు నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులను వారించారు. అలా చేయవద్దని తానే ఇలా చేయిస్తున్నానని అనుకుని అవకాశం ఉందని, ఏపీకి ఎంతో అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆయనను మనమందరం గౌరవించాలంటూ తన రాజకీయ పరిణతి ప్రదర్శించారు. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి అడగ్గానే 40 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు.. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపడం విశేషం.ఏజన్సీ ప్రాంతాల్లో పవన్ పర్యటన, రెండు, మూడు నెలలకు ఒక సారి అక్కడకి వస్తానని ప్రకటించడం, పొత్తు ధర్మన్ని గౌరవిస్తూ మాట్లాడం వెనుక ఆయనకు స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి మన్యం, అల్లూరి జిల్లాలలో జనసేనను వైసీపీ ప్లేస్‌లో రీప్లేస్ చేయాలన్నదే జనసేనాని స్కెచ్ అంటున్నారు. ఎలాగో పదేళ్ళు కూటమే అధికారంలో ఉంటుందని పవన్ నమ్మకంతో ఉన్నారు. ఆ క్రమంలో గిరిజన ప్రాంతాలలో జనసేన ఎక్కువ సీట్లు అడగడానికి ఆస్కారం ఉంటుందనే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంట.పవన్ వ్యూహాలు పవన్‌కి ఉండవచ్చు.. మరి ఆయా ప్రాంతాల్లో ఆకట్టుకొనే నాయకూలెక్కడ? అంటే ప్రస్తుతానికి సమాధానం కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ నియోజకవర్గాలలో చెప్పుకోదగిన నాయకుడు కనిపించడం లేదు. తాజాగా మన్యం జిల్లాల్లో పవన్ పర్యటనలో అందరూ విజయనగరం నాయకులే దర్శనమిచ్చారు. తప్ప మన్యం జిల్లాకి చెందిన నాయకులు పెద్దగా కనిపించలేదు … చూడాలి మరి గిరిజనం మైండ్ సెట్ మార్చే పనిలో పడిన జనసేనాని.. దాంతో పాటు నాయకులను ఎలా తయారు చేస్తారో?
Read : Pawan Kalyan | జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? | Eeroju news