ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ సమావేశం…
విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరవై మూడో తేదీన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని పవన్ సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్.. అనారోగ్యంతో ఇటీవలి కాలంలో అధికార కార్యక్రమాల్లో లేరు. ఆయన నాలుగు రోజుల పాటు పుణ్యక్షేత్రాల పర్యటనకు కేరళ, తమిళనాడు వెళ్లారు. అక్కడి పర్యటన పూర్తయిన తర్వాత స్పాండిలైటిస్ కు కేరళ వైద్యం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అక్కడి వైద్యం గురించి ఆరా తీశారు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పంథా కాస్త భిన్నంగా మారుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ కూటమిలో ఏకాభిప్రాయం రావడం లేదు. వైసీపీని బలహీనం చేసేందుకు నేతల్ని చేర్చుకున్నా.. వారిలో చాలా మంది కేసుల భయంతో వస్తారని.. కేసుల మాఫీ కోసం వస్తారన్న అభిప్రాయం ఉంది.
అదే సమయంలో కూటమి పార్టీ ల క్యాడర్ కూడా వైసీపీ హయాంలో హంగామా చేసిన వారిని చేర్చుకోవద్దని సోషల్ మీడియాలో బహిరంగంగా చెబుతున్నారు. చేరికల అంశంపైనా ఎమ్మెల్యేలు , ఎంపీలతో పవన్ మాట్లాడే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పక్షమే పోషించాల్సి ఉంది. కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తే విషయంలో మాత్రం ఏమరుపాటుగా ఉండాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పవన్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ సభను మూడు వారాలకుపైగా నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు జగన్తో పాటు ఎమ్మెల్యేలు రాకపోతే.. కనీసం లీవ్ లెటర్ పంపక పోతే అనర్హతా వేటు వేసే అంశాన్ని స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ పరిశీలించే అవకాశం ఉంది. దీనిపై పార్టీ స్టాండ్ కూడా పవన్ అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల పనితీరుపైనా పవన్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, నిధుల సమస్యలు, కూటమి పార్టీలతో సమన్వయం వంటి అంశాలపై విపులంగా పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.