ఆలయాల సందర్శన వెనుక….
తిరువనంతపురం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆయన కేరళ చేరుకున్నారు. మూడు రోజులపాటు కేరళ తో పాటు కర్ణాటకలో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు పవన్. ఆయన వెంట కుమారుడు అకిరా నందన్ కూడా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొచ్చి విమానాశ్రయంలో దిగారు. అక్కడ నుంచి నేరుగా అగస్త్య మహర్షి ఆలయం, ఆశ్రమాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు పవన్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన ఉంటుంది. అయితే పవన్ ఆలయ సందర్శన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడిచింది. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తోనే ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం నడిచింది.అయితే దక్షిణాది రాష్ట్రాల్లోభారతీయ జనతా పార్టీకి పట్టు చిక్కడం లేదు. కర్ణాటకలో అధికారాన్ని చేజార్చుకుంది ఆ పార్టీ. తెలంగాణలో బలం పెంచుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేక ఆలోచనతో ముందుకెళ్తోంది. పొత్తుల ద్వారా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే కేరళ తో పాటు తమిళనాడులో అయితే కనీస ప్రభావం చూపలేకపోతోంది భారతీయ జనతా పార్టీ. అందుకే అక్కడ హిందుత్వ వాదాన్ని తెరపైకి తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో ఆలయాల సందర్శన పేరుతో వ్యూహం రూపొందించినట్లు ప్రచారం నడుస్తోంది. అరెస్టులను స్వాగతించిన పవన్ తిరుమలలో వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఒక బలమైన వ్యవస్థ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అటు తరువాత ఏపీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు వచ్చారు. వారు కూడా హిందూ మత పరిరక్షణ గురించి మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. పవన్ ఎలాంటి డిమాండ్లు చేశారో.. వారు కూడా అటువంటి డిమాండ్లు చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఆలయాల సందర్శనకు దిగడం వెనుక సైతం ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ ఆలయాల సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తన ఆలయాల సందర్శనతో పాటు తిరుమల లడ్డు వివాదంపై కూడా మాట్లాడారు. వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారని.. వారి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలన్నదే తన అభిమతం అన్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదు అన్నదే తన బలమైన ఆకాంక్షగా చెప్పుకొచ్చారు. లడ్డు కల్తీ కి సంబంధించి కేసులో అరెస్టులు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శన తన వ్యక్తిగత పర్యటనగా అభివర్ణించారు. రాజకీయాలకు దీంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. కేవలం మొక్కు చెల్లించుకునేందుకు మాత్రమే తాను ఆలయాల సందర్శనకు వచ్చినట్లు స్పష్టత ఇచ్చారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan : చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయని పవన్ కల్యాణ్?