Pass book on CM Revanth Reddy’s farmer loan waiver Certificate | పాస్ బుక్… ప్రమాణికం… | Eeroju news

CM Revanth Reddy's farmer loan

పాస్ బుక్… ప్రమాణికం…

మహబూబ్ నగర్, జూన్ 29, (న్యూస్ పల్స్)

Pass book on CM Revanth Reddy’s farmer loan waiver Certificate

తెలంగాణలో రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. అలాగే రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. రైతుల పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. అయితే బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కావని సీఎం స్పష్టం చేశారు.

పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందన్నారు. రైతు రుణమాఫీ తర్వాత రైతుభరోసా ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు. తెలంగాణ బడ్జెట్ ను వాస్తవ అంచనాలకు అనుగుణంగా రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. మండలాలు రెవెన్యూ డివిజన్‌ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ ముందుకు తెస్తామన్నారు. అసెంబ్లీలో చర్చించి డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, కేవలం పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు పథకంతో రెవెన్యూ పెరిగిందన్నారు. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఉచిత బస్సు పథకం ద్వారా ఆక్యుపెన్సీ రేటు 30 శాతం నుంచి 80 శాతానికి పెరిగిందన్నారు. దీంతో ఆర్టీసీ నిర్వహణ నష్టాలు తగ్గాయన్నారు. గత అప్పులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందన్నారు. మహిళలకు ఉచిత రవాణా సదుపాయంతో టెంపుల్ టూరిజం పెరిగిందన్నారు. దీంతో జీఎస్టీ ద్వారా ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా కాంగ్రెస్ సర్కార్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీసీ కమిషన్ పదవీకాలం ముగుస్తుందని, కొత్త వారిని నియమించిన తరువాత కుల గణన చేస్తామన్నారు.

గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి నెల రూ. 7 వేల కోట్ల అప్పులు తీరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 నుంచి 11 శాతం వడ్డీతో అప్పులు తెచ్చిందన్నారు. రుణభారం తగ్గించేందుకు రుణాల వడ్డీని తగ్గించుకునే పనిలో ఉన్నామన్నారు. ఒక్కశాతం తగ్గినా రూ. 700 కోట్లు ఆదా అవుతాయన్నారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బడ్జెట్‌కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కేంద్రం దృష్టిలో ఉంచి అధిక నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

CM Revanth Reddy's farmer loan

 

Raithu Bharosa | మారుతున్న రైతు భరోసా రూల్స్… | Eeroju news

 

Related posts

Leave a Comment