ఊడిపోతున్న ఆర్టీసీ బస్సుల భాగాలు..
నిజామాబాద్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్)
Parts of RTC buses that are blowing away
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. బస్సు ఎక్కగానే మనకు పెద్ద పెద్ద అక్షరాలతో ఈ కొటేషన్ కనిపిస్తుంది. కానీ.. ఇటీవల జరుగుతున్న ఘటనలతో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా.. ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగానే బస్సు పార్టులు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టీజీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులకు సంబంధించి తరుచూ ఏదో ఒక ఘటన జరుగుతోంది. ఇటీవల బస్సు వెనక ఉండే రెండు చక్రాలు ఊడిపోయన ఘటన మరువకముందే.. మరో ఘటన జరిగింది. తాజాగా బస్సు రన్నింగ్లో ఉండగానే పార్టులు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
TS 31 Z 0054 బస్సు రన్నింగ్లో ఉండగా బస్సు పార్టులు ఊడిపోయి రోడ్డుపైన పడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో.. బస్సులో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన లో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కింద పడిపోయిన పార్టులను బస్ డ్రైవర్, కండక్టర్ తీసుకొని మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు. అయితే.. ఏ పార్ట్ ఊడిపోయింది.. బస్సుకు ఏమైందనే వివరాలను డ్రైవర్ గానీ.. కండక్టర్ గానీ చెప్పలేదు..ఇటీవల కూడా ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. నిర్మల్ డిపోకు చెందిన బస్.. జగిత్యాల నుంచి వెళుతుండగా మొరపెల్లి వద్ద ప్రమాదం జరిగింది. 50 మంది ఎక్కాల్సిన ఆ బస్సులో 170 మంది ఎక్కారు.
ఒవర్ లోడ్ కారణంగా బస్సు వెనకాల రెండు టైర్లు ఊడిపోయాయని చెబుతున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో ఎక్కువ మంది మహిళలు పిల్లలే ఉన్నారు. ఆ ఘటన మరువక ముందే ఉట్కూరు ఘటన జరిగింది. దీంతో ఆర్టీసీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణంపై నెటిజన్లు వ్యంగంగా స్పందిస్తున్నారు.ఇటీవల వరంగల్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు ఇద్దరిని బలి తీసుకుంది. కుమారుడి పెళ్లి కార్డులు పంచేందుకు అన్న కొడుకుతో కలిసి వెళ్లిన వరుడి తండ్రిని.. అతని సోదరిని కుమారుడిని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కోనాయిమాకుల వద్ద జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఆర్టీసీ బస్సుల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇలా వరుస ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రద్దీకి తగ్గట్టు బస్సులు ఏర్పాటు చేస్తే.. అంత మంది ఒకే బస్సులో ఎందుకు ఎక్కుతారని ప్రశ్నించారు.ఆర్టీసీ డ్రైవర్లపై ఒత్తిడి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఆర్టీసీ డ్రైవర్ 8 గంటలు డ్యూటీ చేయాలి. కానీ.. డ్రైవర్ల కొరత కారణంగా ఒక్కొక్కరు దాదాపు 14 గంటలు పనిచేస్తున్నామని డ్రైవర్లు వాపోతున్నారు. ఎక్కుల సమయం డ్యూటీ చేసినందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నా.. శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నామని చెబుతున్నారు. ఇటు ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదని యూనియన్ నాయకులు చెబుతున్నారు. దాదాపు 600 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. వీటిని భర్తీ చేస్తే.. డ్రైవర్లపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
Free bus scheme for women soon | త్వరలో స్త్రీలకు ఉచిత బస్సు పథకం | Eeroju news