అవనిగడ్డ
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విళయతాండవం చేస్తున్న తరుణంలో ఆర్ధికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేయడంతో అవనిగడ్డ రాజీవ్ గాంధీ చౌక్ లో డీఎస్సీ నిరుద్యోగులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఎప్పుడు డీఎస్సీ ప్రకటిస్తారా, తమ జీవితాలలో ఎప్పుడు వెలుగులు నింపుతారా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని అన్నారు. వారాహి యాత్రలో అవనిగడ్డ కు విచ్చేసిన పవన్ కళ్యాణ్, యువగళం పాదయాత్రలో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు లు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఇస్తామని వాగ్దానం చేసి నిలబెట్టుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కుదించబడిన పాఠశాలలను సైతం తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
భూములపై మనకున్న హక్కులను కాలరాసే విధంగా జగన్మోహనరెడ్డి ఏర్పాటుచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడం కోసం రెండవ సంతకం చేయడం పట్ల బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ లను సైతం జగన్ ప్రభుత్వం మూసివేయగా, మరలా వాటిని పునః ప్రారంభించేందుకు చర్యలు తోసుకోవడం శుభపరిణామం అని అన్నారు. రానున్న రోజులలో అవనిగడ్డ లోనూ, చల్లపల్లి లోనూ అన్నా క్యాంటీన్ లను ప్రారంభిస్తామని అన్నారు.
గతంలో టీడీపీ హయాంలో వృద్ధాప్య పెన్షన్లు 200 నుండి 2000 రూపాయలకు ఒకేసారి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు కు దక్కితే, 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు చేయడానికి జగన్మోహనరెడ్డి కి ఐదేళ్లు పట్టిందని అన్నారు. అటువంటి దానిని మరోసారి 3000 పెన్షన్ ని 4000 రూపాయలు చేయడానికి చంద్రబాబు నాయుడు పెట్టిన మూడవ సంతకం చారిత్రాత్మకం అని బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన పోగొట్టేందుకు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలికే విధంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు తీసుకున్న నిర్ణయాలు ఎంతో గొప్పవని, ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరుశాతం అమలు పరుస్తామని బుద్ధప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండలి వెంకట్రామ్, జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, చిలకలపూడి పాపారావు, ఎంపీటీసీ సభ్యులు మాలెంపాటి శ్రీనివాసరావు, బండే రాఘవ, మెగావతు గోపి, కురాకుల శివప్రసాద్, బాదర్ల లోలాక్షుడు, డీఎస్సీ నిరుద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.