తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం
కరీంనగర్, జూన్ 29, (న్యూస్ పల్స్)
Padi Kaushik Reddy Black Book sensation in Telangana
హాట్ టాపిక్ గా బ్లాక్ బుక్ వార్నింగ్..
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బ్లాక్ బుక్ హెచ్చరిక హాట్‌టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్ నేతల అవినీతికి వంతపాడుతున్న అధికారులు, అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో మళ్లీ బ్లాక్ డేస్ తెస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలకు బ్లాక్ బుక్ రాస్తానని ప్రకటించారు కౌశిక్‌రెడ్డి. రామగుండం ఎన్టీపీసీ బూడిద తరలింపులో అక్రమాలపై మంత్రి పొన్నం 100కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపిస్తూ కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్‌రెడ్డి.
ఈ క్రమంలో పొన్నం తప్పు చేయలేదంటే వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే తాను బ్లాక్ బుక్ రాస్తున్నానని …. అందులో తొలి పేరు మంత్రి పొన్నందేనంటూ బుక్‌లో రాసి మీడియాకు ప్రదర్శించారు కూడా… అయితే ఇంతకీ ఈ బ్లాక్ బుక్ రాయాలనే ఆలోచన కౌశిక్‌రెడ్డి సొంతంగా తీసుకున్నదా? పార్టీ సూచనలు, ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది మాత్రం స్పష్టం కాలేదు. తాను రాసే బ్లాక్ బుక్‌లో పేర్లు ఉన్నవారిపై బీఆర్ఎస్ అధికారంలో రాగానే చర్యలు ఉంటాయని కౌశిక్‌రెడ్డి చెప్పడం… ఇటు బీఆర్ఎస్లోనూ.. అటు కాంగ్రెస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ అధికారంతో పార్టీ తరఫున కౌశిక్‌రెడ్డి ప్రకటన చేస్తారంటూ గులాబీ పార్టీ నేతలే గొణుక్కుంటున్నారు.
ఏపీలో టీడీపీ యువనేత లోకేశ్ రెడ్‌బుక్ నుంచి స్ఫూర్తి పొంది… కౌశిక్‌రెడ్డి అలాంటి ప్రకటన చేశారా? అంటూ కొందరు ఆరా తీస్తున్నారు. లోకేశ్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీలో నిర్ణయం తీసుకుని రెడ్‌బుక్ రాశారని…. కౌశిక్‌రెడ్డికి పార్టీలో ఏం అధికారం ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. నిన్న గాక మొన్న పార్టీలో చేరి… ఈటల రాజేందర్ పుణ్యమా అని ఎమ్మెల్సీ అయిపోయారని… కాలం కలిసివచ్చి ఎమ్మెల్యే అయినంత మాత్రాన తనదే పార్టీ అన్నట్లు బ్లాక్ బుక్ రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు మరికొందరు నేతలు.కేటీఆర్ లేదా కేసీఆర్ లు ఏమైనా కౌశిక్‌కు ప్రత్యేక అధికారాలిచ్చారా? అంటూ కొంతమంది బీఆర్ఎస్ నేతలే ప్రశ్నిస్తున్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై అణచివేతతోపాటు తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులను హెచ్చరించడానికి లోకేశ్ రెడ్‌బుక్ రాస్తున్నట్లు చెప్పారు. తన యువగళం పాదయాత్రలో కార్యకర్తల వేదనను చూసి ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ, తెలంగాణలో కౌశిక్‌రెడ్డి సొంత వ్యవహారంలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదారు నెలలకే బ్లాక్‌బుక్ అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సరికాదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బూడిద తరలింపులో జిల్లా మంత్రితో వచ్చిన గొడవను… పార్టీకి ఆపాదిస్తూ బ్లాక్ బుక్ రాయడానికి కౌశిక్ ఎవరనే చర్చ మొదలైంది. మరోవైపు కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనకు మద్దతుగా ఆ పార్టీలో ఏ నేత మాట్లాడటం లేదు. దీంతో కౌశిక్‌రెడ్డి బ్లాక్ బుక్ వ్యవహారంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే వాదన వినిపిస్తోంది.
బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు సైతం…. కౌశిక్‌రెడ్డి, మంత్రి పొన్నం మధ్య వివాదాన్ని ఓ జిల్లా ఇష్యూగానే పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు కౌశిక్‌రెడ్డి బ్లాక్‌బుక్‌కు ఏ మాత్రం సీరియస్‌నెస్ ఉండదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇలాంటి రాతలు, ప్రకటన వల్ల పార్టీ ఇమేజ్ మరింత డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.లోకేశ్‌తో తనను తాను పోల్చుకోవడం కౌశిక్‌రెడ్డికి అడ్వాంటేజ్ ఏమో గాని… బ్లాక్‌బుక్ వంటి ప్రకటనతో సీరియస్ అంశాన్ని నీరుగార్చే అవకాశం ఉంటుందని కొందరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి కౌశిక్‌రెడ్డి బ్లాక్‌బుక్ నిర్ణయం ఆవేశంగా తీసుకున్నదా? లేక పార్టీ పెద్దలతో నిర్ణయించిన తర్వాతే అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందా? అన్నది తేలాల్సి వుంది. పార్టీ పరంగా విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అగ్ర నేతలో… పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్న నేతలో ఇలాంటి ప్రకటన చేస్తే బాగుండేదని బీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కౌశిక్‌రెడ్డి బ్లాక్ బుక్ లో ఇంకా ఎవరెవరి పేర్లు రాస్తారు… ఈ బ్లాక్ బుక్ లో ఎక్కిన నేతలు, అధికారులపై ఎవరు చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి గులాబీ పెద్దలు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాల్సివుంది.
New criminal justice laws from July 1 | జులై 1 నుంచే కొత్త నేర న్యాయ చట్టాలు | Eeroju news