గూగుల్ సెర్చ్ లో పాబ్లో ఎస్కో బార్
చంద్రబాబు ప్రకటన తర్వాత వెతుకులా
తిరుపతి, జూలై 28 (న్యూస్ పల్స్)
Pablo Escobar in Google Search
విక్రమ్ సినిమా చూశారా.. అందులో కమల్ హాసన్ మత్తు పదార్థాల ముఠాను మట్టు పెట్టేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందులో విజయ్ సేతుపతి మత్తు పదార్థాల డీలర్ గా పనిచేస్తుంటాడు. ఈ సినిమా చివర్లో ఈ మత్తు పదార్థాల రాకెట్ రన్ చేసే వ్యక్తిగా హీరో సూర్య కనిపిస్తాడు. ఈ పాత్ర కొలంబియా దేశంలో ఒకప్పుడు మత్తు పదార్థాల రవాణా సామ్రాజ్యాన్ని ఏలిన పాబ్లో ఎస్కో బార్ ను పోలి ఉంటుంది. ఆ పాత్రను ఎస్కో బార్ నిజజీవితం ఆధారంగానే రూపొందించినట్టు విక్రమ్ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ అప్పట్లో ఓ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొలంబియాలో ఒకప్పుడు మత్తు పదార్థాల వ్యాపారాన్ని ఎస్కోబార్ నిర్వహించేవాడు.
మత్తు పదార్థాల వ్యాపారం ద్వారా ప్రపంచంలో ధనవంతుల్లో ఒకడిగా పేరుపొందాడు. అతని ప్రస్తావనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకొచ్చారు. ఏపీలో వైసిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎస్కో బార్ తో చంద్రబాబు పోల్చారు. “మన సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొందరికి సమాజం మీద ప్రేమ ఉంటుంది. మరికొందరికి అపరిమితమైన అవసరాలు ఉంటాయి. కొందరికి గొంతెమ్మ కోరికలు ఉంటాయి. ఇంకొందరికి బయటికి కనిపించని పిచ్చి ఉంటుంది. అలాంటి పిచ్చి ఉన్న వాళ్ళు డబ్బు అంటే పడి చస్తారు. ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తారు. దండాలు కొనసాగిస్తారు. అలాంటి వాడే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతని లక్ష్యం టాటా, రిలయన్స్, అంబానీ కంటే ఎక్కువ సంపాదించాలని.. అందుకోసమే జగన్ అడ్డదారులు తొక్కాడని” చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ఆరోపించారు.
డబ్బు సంపాదన కోసం జగన్ ఆర్థిక అరాచక వాదిగా మారారని చంద్రబాబు ధ్వజమెత్తారు.”కొలంబియా దేశంలో ఎస్కో బార్ అనే వ్యక్తి ఒకప్పుడు మత్తు పదార్థాల రవాణా చేసేవాడు. ఆ తర్వాత రాజకీయ వేత్తగా రూపాంతరం చెందాడు. అయినప్పటికీ అతడు తన మత్తు పదార్థాల రవాణాను వదిలిపెట్టలేదు. బహిరంగంగానే ఆ దందా కొనసాగించాడు. 1976లో మొదటిసారి ఎస్కో బార్ పోలీసుల చేతిలో అరెస్టయ్యాడు. ఆ తర్వాత బయటకు వచ్చి 1980 నాటికి ప్రపంచంలోనే సంపన్నుల్లో ఒకడిగా ఆవిర్భవించాడు. 1980లో మత్తు పదార్థాల రవాణా ద్వారా ఎస్కోబార్ 2.50 లక్షల కోట్లు సంపాదించాడు. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం వాటి విలువ 7.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని” చంద్రబాబు అన్నారు.చంద్రబాబు చెప్పినట్టుగానే ఎస్కోబార్ ఒకప్పుడు కొలంబియా దేశాన్ని గడగడలాడించాడు.
కొలంబియా దేశంలోని మారుమూల అటవీ గ్రామాల్లో మత్తు పదార్థాలు తయారుచేసి అమెరికా, రష్యా, చిలీ, పోర్చుగల్, ఇంగ్లాండ్, స్వీడన్, డెన్మార్క్, భారత్, ఇంకా అనేక దేశాలకు ఓడలు, విమానాల ద్వారా రవాణా చేసేవాడు. మత్తు పదార్థాల వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన తర్వాత.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాల్లో కీలక పదవులు అధిరోహించినప్పటికీ తన మత్తు పదార్థాల తయారీ వ్యాపారాన్ని అస్సలు వదులుకోలేదు. పైగా ఆ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. తన అక్రమ దందాకు రాజకీయంతో కావడంతో అపరిమితమైన డబ్బును సంపాదించాడు.
వ్యవస్థలను మేనేజ్ చేశాడు. పోలీసులను గుప్పిటపట్టాడు. ప్రపంచ దేశాల అధినేతలతో ఆర్థిక సంబంధాలు నడపడం మొదలు పెట్టాడు. ఫలితంగా అతని మత్తు పదార్థాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. చివరికి 1993 డిసెంబర్ 2న కొలంబియాలోని మెడలిన్ ప్రాంతంలో మరణించాడు. మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నందుకు గాను ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఎస్కోబార్ 1976లో మారియా విక్టోరియాను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి సెబాస్టియన్ మారో క్వీన్, మనుయెలా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మత్తు పదార్థాలలో విపరీతమైన ప్రాచుర్యంలో ఉన్న కొ** ను తయారుచేసింది ఎస్కో బార్. ఆరోజుల్లో కొ** ద్వారా వందల కోట్ల డబ్బును సంపాదించాడు. ఆ డబ్బుతో విపరీతంగా జల్సాలు చేసేవాడు.