అతిగా వ్యవహరించి… చివరకు….
సీఎస్ నుంచి పొన్నవోలు దాకా
విజయవాడ, జూన్ 18 (న్యూస్ పల్స్)
Overdo it… and finally
జగన్ సర్కార్లో క్యాబినెట్ మంత్రులకు మించి ఒక పేరు బలంగా వినిపించేది. జాతీయస్థాయిలో సైతం ఆ పేరు మార్మోగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబుపై మోపిన అవినీతి కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు పొన్నవోలు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కిందిస్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలను పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్డుకున్నారు. చివరకు సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయర్లను సైతం అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి కంటే తానే గొప్ప న్యాయవాదిగా భావించుకున్నారు.అయితే ఆయన ఒక ప్రభుత్వ వకీలు మాత్రమే.ఇప్పుడు జగన్ అధికారానికి దూరం కావడంతో ఆయన ప్రభుత్వ మాజీ వకీలు అయ్యారు. టిడిపి శ్రేణులకు టార్గెట్ అవుతున్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తిన అధికారులు ఉన్నారు. ఇప్పుడు వారంతా బాధపడుతున్నారు. హలో లక్ష్మణా అంటూ కాపాడే వారి కోసం ఎదురుచూస్తున్నారు. మాజీ సిఎస్ జవహర్ రెడ్డి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి వరకూ అందరిదీ ఒకే దారి. సీనియర్ ఐపీఎస్ అధికారుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిగా వ్యవహరించి చట్టాన్ని తుంగలో తొక్కిన వారికి ఇప్పుడు కేసులు చుట్టుముట్టే అవకాశం ఉంది.
కనీసం ప్రస్తుతం పాలకులకు తమ బాధను చెప్పే ఛాన్స్ కూడా లేకుండా పోయింది.అయితే అందరిదీ ఒక బాధ అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ది మరో బాధ. గత ప్రభుత్వంలో జగన్ చెప్పింది చేశారు. కానీ తాను చేసిన దానికంటే అతిగా ప్రవర్తించారు. వ్యాఖ్యలు చేశారు. కేసును వాదించడం తప్పులేదు కానీ.. ఆ కేసు గురించి దేశవ్యాప్తంగా మాట్లాడి.. తనకు తాను ఒక హీరోగా చూసుకున్నారు పొన్నవోలు.మొన్నటికి మొన్న లండన్ వెళ్లిన ఆయన వైసీపీ ఎన్నారై లతో సమావేశం అయ్యారు.
జగన్ పరిస్థితిని తలుచుకుని ఏడ్చేశారు. ఎన్నికల ఫలితాల రాకమునుపే జగన్ కు ప్రమాదం ఉందని చెప్పడం ద్వారా ఓటమిని అంగీకరించారు. మనమంతా జగనన్నను కాపాడుకోవాలని కూడా రోదించారు. అయితే అదే పొన్నవోలు ఇప్పుడు డేంజర్ లో పడ్డారు. జగన్ కంటే ముందే టిడిపి బాధితుడిగా మారిపోయారు. ఆయనపై ఏకంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై టిడిపి నేత తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ పై పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. జగన్ ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్టు వ్యాఖ్యానించారని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్ముందు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి చిక్కులు తప్పవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.