రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘బోనస్’ గ్యారంటీతో ఈ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి, కొనుగోళ్ళు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో మొత్తం 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు నమోదు కాగా అందులో 61శాతం (40.55 లక్షల ఎకరాల్లో) సన్న రకానికి చెందిన పంట కాగా దొడ్డు రకం కేవలం 26.23 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో సన్నం రకం సాగైన విస్తీర్ణం కేవలం 38 (25.05 లక్షల ఎకరాలు) శాతమే. సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించటంతో ఈసారి సన్న రకాల వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది.
భారీగా పెరిగిన సన్నబియ్యం సాగు
నిజామాబాద్, డిసెంబర్ 27
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘బోనస్’ గ్యారంటీతో ఈ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి, కొనుగోళ్ళు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో మొత్తం 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు నమోదు కాగా అందులో 61శాతం (40.55 లక్షల ఎకరాల్లో) సన్న రకానికి చెందిన పంట కాగా దొడ్డు రకం కేవలం 26.23 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో సన్నం రకం సాగైన విస్తీర్ణం కేవలం 38 (25.05 లక్షల ఎకరాలు) శాతమే. సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించటంతో ఈసారి సన్న రకాల వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది.సన్న వడ్లకు బోనస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.939 కోట్లను చెల్లించింది. తెలంగాణ వ్యాప్తంగా 8,318 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన 47.01 లక్షల టన్నుల ధాన్యానికి దాదాపు 8.84 లక్షల మంది రైతులకు రూ.19,149 కోట్లను చెల్లించింది. సన్నాలకు బోనస్ పేమెంట్ దీనికి అదనం. సన్న వడ్లను సాగుచేసిన సుమారు 3.36 లక్షల మంది రైతులు బోనస్ రూపంలో రూ.939 కోట్లను అందుకోవాల్సి ఉండగా ఇప్పటికే రూ.591 కోట్లను అందుకున్నారు.గతేడాదితో పోలిస్తే దాదాపు 6 లక్షల టన్నుల వరకు ఈసారి అధికంగా దిగుబడి అయింది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం (దొడ్డు, సన్న రకాలు కలిపి) విలువ రూ.10,903 కోట్లు కాగా రూ.10,149 కోట్ల మేర చెల్లింపులు పూర్తయ్యాయి. ఈసారి పౌర సరఫరాల విభాగం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈదురు గాలులు, అకాల వర్షాలకు రైతులు కష్టపడి పండించిన పంటకు నష్టం వాటిల్లలేదు.కొనుగోలు కేంద్రాల ద్వారా జరిగిన ధాన్యం సేకరణలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో రైతులు ఆ సాగువైపే మొగ్గు చూపారు. ఈ కారణంగానే దొడ్డు రకంతో పోలిస్తే సన్నాల సాగు గణనీయంగా పెరిగింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే డిక్లరేషన్, మేనిఫెస్టోల ద్వారా వరి పంటకు రూ.500 బోనస్ (క్వింటాల్‌కు) కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది. దాన్ని విశ్వసించిన రైతులు సన్నాల సాగుపై ఆసక్తి చూపారు. దిగుబడి కూడా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని పకడ్బందీగా అమలు చేసింది.ఒకవైపు రైతులకు పంట రుణాల మాఫీ, మరోవైపు సంక్రాంతి నుంచి రైతు భరోసా సాయం విడుదల హామీ, ఇంకోవైపు సన్నాలకు ప్రత్యేకంగా (కనీస మద్దతు ధరకు అదనంగా) క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వడంతో గతేడాదితో పోలిస్తే దిగుబడి, ధాన్యం సేకరణ మెరుగుపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారానే సాగు విస్తీర్ణం పెరిగిందని, పంజాబ్ రాష్ట్రంతో పోటీపడేలా ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సృష్టించిందంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో గతేడాదితో పోలిస్తే దిగుబడి పెరిగింది.రాష్ట్రంలో పెరిగిన వరి సాగు విస్తీర్ణానికి, కాళేశ్వరం నీటికి సంబంధం లేదని ఈ దిగుబడులతో స్పష్టమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా గతేడాది కంటే ఈసారి పెరిగాయి. సన్నాల సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా పెరిగిన కారణంగా సంక్రాంతి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి మార్గం సుగమమైంది. హాస్టల్ విద్యార్థులకు కూడా సన్న బియ్యమే సరఫరా కానున్నది.