ప్రభుత్వ పథకాలకు మారనున్న పేర్లు…
విజయవాడ, జూలై 29 (న్యూస్ పల్స్)
Names of government schemes will change…
ఐదేళ్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్. రాజకీయాలకు అతీతంగా అమలు చేసి చూపించారు. దాంతోనే గెలుపు సాధ్యమని భావించారు. కానీ ప్రజలు అలా భావించలేదు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు. జగన్ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు తిరస్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయాలని సంకల్పించింది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పించింది. మరోవైపు పారిశ్రామిక రంగాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది.
అయితే కూటమి పాలనకు 50 రోజులు దాటుతున్నా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకపోవడంతో రకరకాల అనుమానాలు తావిచ్చాయి. అదే సమయంలో శాసనసభలో చంద్రబాబు ప్రకటన కూడా ఆలోచింపజేసింది. రాష్ట్రంలో దాదాపు పది లక్షల కోట్లు అప్పుచేసి వైసీపీ సర్కార్ దిగిపోయిందని.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే కష్టతరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయలేరని విమర్శలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కూటమి సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల పేర్లను.. సమూలంగా మార్పులు చేసింది.
అప్పట్లో ప్రతి పథకానికి వైయస్సార్ తో పాటు జగనన్న పేర్లు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పేర్లను మార్చింది. దేశ నాయకులు, మహనీయుల పేర్లతో పథకాలు కొనసాగించాలని నిర్ణయించింది.ముఖ్యంగా ప్రాథమిక విద్యలో అమలైన పథకాలకు ప్రస్తుతం గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టారు. జగనన్న అమ్మ ఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనంగా మార్పు చేశారు. నాడు నేడు పథకాన్ని మనబడి- మన భవిష్యత్తుగా, స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్షగా, జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేర్లు మార్చారు.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని పథకాల పేర్లు మార్పుపై ఉత్తర్వులు వచ్చాయి. ముఖ్యంగా జగన్ పేరుతో పెట్టుకున్న పథకాల పేర్లు మారాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గా మార్చారు. ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యా దీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి నిధిగా మార్పు చేశారు. వైయస్సార్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా, వైయస్సార్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును.. సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా మార్పు చేసింది కొత్త ప్రభుత్వం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం. అన్న క్యాంటీన్ల మాదిరిగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టాలని పవన్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పాఠశాల విద్యకు సంబంధించి అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అన్నపూర్ణ తో పోలుస్తారు. ఆమె పేరును మధ్యాహ్నం భోజన పథకానికి పెట్టడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ ట్విట్ చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున.. ఆ మహానీయుడు పేరును ఓ పథకానికి పెట్టడం సంతోషించదగ్గ విషయం అన్నారు.