Nalgonda:నానో టెక్నాలజీతో విమాన రాజగోపురం:ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురంగా రికార్డు సృష్టించింది.యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు.
నానో టెక్నాలజీతో విమాన రాజగోపురం
నల్గోండ, ఫిబ్రవరి 23
ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురంగా రికార్డు సృష్టించింది.యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయాలని నిర్ణయించారు. ఆలయ హుండీ కానుకలు, భక్తుల దాతలతో వచ్చిన 68.84 కిలోల బంగారంతో ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించారు.యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆలయంలో జరిగిన దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మహా పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణకుంభ స్వాగతం పలికి రేవంత్ దంపతులకు వేదపండితులు ఆశ్వీరాదం ఇచ్చారు. ఐదు రోజులుగా స్వర్ణ విమానావిష్కరణ, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకాలను ఆలయ అర్చకులు వేద పండితులు వైభవంగా నిర్వహించారు.ఆలయ ఉత్తర తిరువీధిలో నారసింహ హోమం, మహా కుంభాభిషేకంతో పాటు పంచకుండాత్మక యాగం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
హోమ గుండాల మధ్యలో స్వామివారిని ఆవాహన చేసి ప్రతిష్టించి 108 మంది రుత్వికులు యజుర్వేదాలు ఆలపించారు. వానమామలై మధుర పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 60మంది రుత్వికులు లక్ష్మీ, నరసింహ, సుదర్శన, రామాయణం, భాగవతం, మూల మంత్ర హవనాలు, మూల మంత్ర జపాలతో పాటు ఉదయం సాయంత్రం విష్ణు, నరసింహ, రామాయణం, భాగవత పారాయణాలతో పాటు అభిషేకాలు నిర్వహించారు.ప్రధానాలయ పంచతల విమాన గోపురం ఎత్తు 47 అడుగులతో అతి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డు సృష్టించింది. స్వర్ణ గోపురానికి ఆరడుగుల ఎత్తుతో సుదర్శన చక్రాన్ని రూపొందించారు. 16 కర్ణకూటములు, 16 ముఖశాలలు, నాలుగు మహా నాసికాలు, 24 కేశమూర్తి, నాలుగు తార్క్ష్య,పక్ష్య,గరుడ, సుపర్ణ మూర్తులు, నాలుగు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ద మూర్తులు, ఐదు నరసింహ మూర్తులు, 8 సింగం మూర్తుల రూపాలు రూపొందించారు. విమానంపై ఉన్న నరసింహ అవతారాలు, కేశవ నారాయణ, లక్ష్మి, గరుడ మూర్తి ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి.మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను ఆలయ గోపురానికి ఏర్పాటు చేశారు. గత ఏడాది దసరా రోజున చేపట్టిన స్వర్ణ తాపడం పనులు ప్రారంభించారు. స్వర్ణ తాపడం పనుల కోసం స్వామి వారికి హుండీల ద్వారా 1300 కిలోల వెండి, నగల రూపంలో వచ్చిన బంగారాన్ని విమాన గోపురం తయారీకి వినియోగించింది. గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తు, 10,857 చదరపు అడుగుల మేర ఉన్న విమానానికి 68 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తి చేశారు. 50.5 అడుగులతో దేశంలోనే అత్యంత ఎత్తయిన పంచతల గోపురంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం లేదు. నానో టెక్నాలజీతో 24 క్యారెట్ల బంగారం తాపడంతో 50 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా పనులు చేశారు.
Read more:Nalgonda:మరింత ఆలస్యం కానున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు