Nagam Janardhan Reddy | ఆగమాగం.. నాగం… | Eeroju news

Nagam Janardhan Reddy

ఆగమాగం.. నాగం…

మహబూబ్ నగర్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్)

Nagam Janardhan Reddy

నాగం జనార్దన్ రెడ్డి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం అంటే నాగం.. నాగం అంటే నాగర్ కర్నూల్ అన్న రేంజ్లో రాజకీయాల్లో చక్రం తిప్పారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హితులు సన్నిహితులు చెప్పిన మాటలు పెడ చెవిన పెట్టి రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అటు రాజకీయవర్గాల్లోనూ, నాగర్‌కర్నూల్ వాసుల్లోనూ చర్చ జరుగుతుంది.అసెంబ్లీ టైగర్‌గా పేరు ఉన్న నాగం జనార్దన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేశారు . పార్టీలో చంద్రబాబునాయుడు ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారు.

2009లో గెలిచిన నాగం తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్ లో దాడి తర్వాత సెంటిమెంట్ పేరుతో టిడిపి అధినేతతో విభేదించి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామా ఆమోదం కోసం అసెంబ్లీలో బైఠాయించిన మొండిఘటం నాగం జనార్దన్ రెడ్డి.ఆ తర్వాత తెలంగాణా నగారా అని సొంత పార్టీ స్థాపించి తెలంగాణా రాష్ట్రం కోసం బలిదానాలు వద్దు కోట్లాడి తెచ్చుకుందామంటూ భరోసా యాత్ర నిర్వహించారు. తిరిగి 2011 నాగర్ కర్నూల్ ఉప ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి బిజెపిలో చేరారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్‌పై ఒంటరి పోరాటం చేస్తూ.. గులాబీ పార్టీ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయని కోర్టులో కేసులు వేశారు.

బిజెపిలో కొనసాగుతున్నప్పుడు 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపిగా ఆయనకు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమారుడు డాక్టర్ శశిధర్ రెడ్డికి టికెట్టు ఇచ్చారు. అయితే తండ్రి కొడుకులు ఇద్దరు పరాజయం పాలయ్యారు. ఆ ఓటములు ఒకరకంగా ఆయన రాజకీయ జీవితాన్ని అదః పాతాళానికి తొక్కేశాయనే చెప్పాలి.నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అప్పటికే నాగం,కూచకుళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రాజకీయపోరు కొనసాగుతుంది. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఒకరిపై ఒకరు రాజకీయ వ్యూహాలు రచించుకున్నారు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్న మర్రి జనార్దన్ రెడ్డి ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు తీర్చినట్టు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఇద్దరిని ఓడించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్ధన్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిని ఎదుర్కొనేందుకు బద్ద శత్రువులైన నాగం, కూచకుళ్లలు కలిసికట్టుగా వ్యవహరించి మంచి ఫలితాలను సాదించారు. ఆ తర్వాత బిజెపిలో పొసగక రాజీనామా చేసిన నాగం ఎలాగైనా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొంది గౌరవ ప్రదమైన రిటైర్మెంట్ తీసుకుంటానని పలుసార్లు ప్రెస్‌మీట్లలో చెపుతూ వచ్చారు.

2018 అసెంబ్లీ ఎన్నికల వేళ నాగం కాంగ్రెస్ పార్టీ లో చేరి నాగర్ కర్నూల్ అసెంబ్లీ టిక్కెట్టు తెచ్చుకున్నారు . కాని టైం కలిసి రాలేదు. నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో కూచకుళ్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బేషరతుగా బిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి నాగంను ఓడించారు. ఓడిన నాగం కాంగ్రెస్ పార్టీలోనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతూ వచ్చారు. నాగం జనార్దన్ రెడ్డితో విభేదించి బీఆర్ఎస్లో చేరిన కూచుకుల్ల దామోదర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా కొనసాగారు. అయితే బీఆర్ఎస్‌లో తనకు సరైన గౌరవం దక్కడం లేదని 2023 ఎన్నికలకు ముందు తన తన కొడుకు రాజేష్ రెడ్డితో కలిసి బయటకు వచ్చారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తన కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టేందుకు కూచకుల్ల పావులు కదిపారు. అయితే అప్పటికే పార్టీలో ఉండి టికెట్ కోసం ఆశపడిన నాగం జనార్దన్ రెడ్డి కూచుకుల్లకు వ్యతిరేకంగా పావులు కదిపే ప్రయత్నం చేశారు. అయితే సర్వేల ఫలితాలు నాగం కుమారుడి కన్నా కూచకుళ్ల కుమారుడు రాజేష్ రెడ్డికి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ రాజేష్ రెడ్డికి టికెట్ కేటాయించి నాగం కు షాక్ ఇచ్చింది. ఇది ఇద్దరి మధ్యన గ్యాప్ ను మరింత పెంచినప్పటికీ నియోజకవర్గంలో పాతుకుపోయిన అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ఓడించాలంటే నాగం, కూచుకుల్ల ఒకటైతే సాధ్యమని కాంగ్రెస్ పెద్దలు భావించారు.

అందులో భాగంగా భవిష్యత్తులో నాగం జనార్దన్ రెడ్డికి గౌరవమైన స్థానం ఇస్తామని .. బరిలో ఉన్న కూచుకుళ్ళ కు సపోర్ట్ చేయాలని అధిష్టానం ఆదేశించింది. అయితే అధిష్టానం నిర్ణయాన్ని నాగం డోంట్ కేర్ అన్నారునాగర్ కర్నూల్ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్దన్ రెడ్డి ఆ అవకాశాన్ని మరోసారి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. నాగం, కూచకుళ్ల మధ్య ఉన్న వైరంతో రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి వారి మధ్య గ్యాప్‌ను వాడకుని మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని చూశారు. అయితే మర్రి జనార్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కూచకుళ్ళ రాజేష్ రెడ్డి విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్టు దక్కక పోయినా నాగం పార్టీలోనే ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. భవిష్యత్తులో గౌరవప్రదమైన పొజిషన్ కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఆ క్రమంలో కూచకుల్ల గెలుపు కోసం కృషి చేయాలని నాగం అనుచరగణం కూడా ఆయనపై వత్తిడి తెచ్చిందంట. అయితే నాగం ఎవరి మాట వినలేదు. దీర్ఘకాలంగా కేసీఆర్‌ను దూషిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలపై కోర్టులో కేసులు వేస్తూ వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి సడన్‌గా రూట్ మార్చి కేసీఆర్, మర్రిల చెంత చేరడంతో ఆయన క్యాడర్ అయోమయానికి గురి అయింది. దాంతో నాగం అనుచరులు కూచకుళ్ల వైపు చేరిపోయారు.ఇక ఎన్నికల్లో నాగం సపోర్ట్ చేసిన మర్రి జనార్ధనరెడ్డి ఓడిపోవడంతో ఆయన పొలిటికల్ కెరీర్ క్రాస్‌రోడ్స్‌లో పడింది.

రాజకీయాలలో గౌరవ ప్రదమైన రిటైర్‌మెంట్ తీసుకుందామనుకున్న నాగం కు నియోజకవర్గంలో కనీస సానుభూతి మిగల కుండా పోయింది. స్వయంకృతాపరాధంతో తన కెరీర్‌ను ఎటూ కాకుండా చేసుకున్న నాగం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్‌క మద్దతుగా వాయిస్ వినిపిస్తున్నారు. డిసెంబర్ 7న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో 3వ స్టేజి వద్ద నిరసన దీక్ష చేపడతానని ప్రకటిచారు. అదే ఆయన అనుచరులకు నచ్చడం లేదంట. బీఆర్ఎస్ ట్రాప్ లో పడకుండా గౌరవ ప్రధమైన రిటైర్‌మెంట్ తీసుకోవాలని వారితో పాటు నియోజకవర్గ వాసులు నాగంకు సూచిస్తున్నారు.

Nagam Janardhan Reddy

 

 Trying to subjugate BRS MLAs: Harish Rao | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు : హరీష్ రావు | Eeroju news

Related posts

Leave a Comment