MVV projects in trouble | చిక్కుల్లో ఎంవీవీ ప్రాజెక్టులు | Eeroju news

MVV projects in trouble

చిక్కుల్లో ఎంవీవీ ప్రాజెక్టులు

విశాఖపట్టణం, జూలై 19, (న్యూస్ పల్స్)

MVV projects in trouble

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అసలు సిసలు సినిమా చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. విశాఖలో ప్రముఖ రియల్టర్‌గా 30 ఏళ్లపాటు కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం మనుగడే ప్రశ్నార్థకం చేస్తూ ఉచ్చు బిగిస్తోంది ప్రభుత్వం. రియలర్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఎంవీవీ.. 2019లో అనూహ్యంగా విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లలోనే వైసీపీ తరఫున విశాఖ టికెట్‌ దక్కించుకున్న ఎంవీవీ… ప్రస్తుత విశాఖ ఎంపీ భరత్‌, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, మాజీ జేడీ లక్ష్మినారాయణ వంటి ఉద్దండులను ఓడించారు.

నమ్మకస్తుడైన రియలర్ట్‌గా ఆయనకున్న పేరు 2019 ఎన్నికల్లో ఎంవీవీకి బాగా పనికొచ్చిందని చెబుతుంటారు. అందుకే ఆ ఎన్నికల్లో నగరంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచినా, ఎంపీగా స్థానంలో ఎంవీవీ విజయం సాధించారు. ఇదంతా గతమైనా… ఆ గతంలో ఎంవీవీ వ్యవహరించిన తీరే ఇప్పుడు ఆయన వ్యాపారాలను ప్రమాదంలో పడేసిందని చెబుతున్నారు. రాష్ట్రంలోనే ఖరీదైన నగరం… పైగా అప్పటి ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా చేయాలనుకున్న ప్రాంతం కావడంతో విశాఖలో రియల్‌ వ్యాపారాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలనుకున్నారు.

ఎంవీవీ… చేతిలో అధికారం ఉండటంతో విలువైన ప్రభుత్వ భూములను… వివాదాల్లో ఉన్న ప్రైవేటు స్థలాలను దక్కించుకుని రియల్‌ వెంచర్లు, భారీ టౌన్‌షిప్పులు నిర్మించాలని ప్లాన్‌ చేశారు. ఇలా ఒక్క విశాఖ నగరంలో దాదాపు 20 ప్రాజెక్టులను స్టార్ట్‌ చేశారు ఎంవీవీ. ఐతే తన ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి మాజీ ఎంపీపై పలు వివాదాలు, ఆరోపణలు ఉన్నాయి. ఐతే గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆయనను ఎవరూ టచ్‌ చేయలేకపోయారు. ఎంపీగా ఎంవీవీ చెప్పిందే శాసనం అన్నట్లు పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు వ్యవహరించడంతో ఆయన ప్రాజెక్టులు చకచకా ముందుకు సాగిపోయాయి. ఐతే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టులన్నీ చిక్కుల్లో పడ్డాయి.

నగరంలోని ఓ పోలీసు ఉన్నతాధికారి స్థలాన్ని కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఎంవీవీ.. కూర్మన్నపాలెంలో 11 ఎకరాల్లో చేపట్టిన భారీ హౌసింగ్‌ ప్రాజెక్టుపైనా కొత్తగా వివాదం మొదలైంది. ఈ ప్రాజెక్టులో భూ యజమానులకు కామన్‌ ఏరియాతో కలిపి కేవలం 14 వేల 400 చదరపు అడుగుల ఫ్లాట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 500 కోట్ల రూపాయల ప్రాజెక్టులో యజమానులకు ఇచ్చిన వాటా కేవలం 0.96% మాత్రమేనని చెబుతున్నారు. అంటే మొత్తం ప్రాజెక్టు విలువలో 99 శాతం మాజీ ఎంపీ ఎంవీవీయే కొట్టేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై గతంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా ఆరోపణలు చేయడంతో చిక్కుల్లో పడ్డారు ఎంవీవీ…కూర్మన్నపాలెం ప్రాజెక్టే కాకుండా ఎంవీవీ, ఆయన వ్యాపార భాగస్వాములు చుట్టూ ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

తన ప్రాజెక్టు కోసం సిరిపురం రహదారిని మూసివేయ్యడం, హయగ్రీవ భూములను బలవంతంగా లాక్కోవడం, క్రిస్టియన్‌ సంస్థ సీబీసీఎన్‌సీ భూముల్లో అక్రమ నిర్మాణాలపైనా వివాదాలు ఎంవీవీ వ్యాపారాలకు ముప్పుగా మారాయి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే ఎంవీవీపై తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వం యాక్షన్‌ తీసుకోడానికి ముందే ప్రజలే స్వచ్ఛందంగా ఎంవీవీ అక్రమాలపై రోడ్డెక్కారు. ఫలితాలు విడుదలవుతున్న సమయంలోనే ఎంవీవీ మూసివేసిన రహదారిని ప్రజలే తెరిపించారు. ఈ క్రమంలోనే సిరిపురం వద్ద ఎంవీవీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ది పీక్ ప్రాజెక్ట్’ను నిలిపేయాలని స్టాప్‌ ఆర్డర్‌ జారీ చేసింది జీవీఎంసీ. ఇక ఆ భూముల్లో మైనింగ్‌కు సంబంధించి అక్రమంగా తవ్వకాలు, పేలుళ్లు చేపట్టారని మైనింగ్‌ శాఖ ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదులపై ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.మొత్తానికి ప్రస్తుతం ఎంవీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని ప్రాజెక్టుల భవిష్యత్‌ ప్రమాదంలో పడ్డాయంటున్నారు. చాలా వాటికి అనుమతులు లేకపోవడం, కొన్నిచోట్ల నిబంధనలు అతిక్రమించడంతో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేయడం కష్టమేనంటున్నారు. ఇదే జరిగితే 30 ఏళ్లుగా ఆయన నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోవడం ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది. దీన్ని గ్రహించిన మాజీ ఎంపీ ప్రభుత్వ పెద్దలను మంచి చేసేందుకు రాయబారాలు నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎంవీవీ కోసం ఎవరూ లాబీయింగ్‌ చేయొద్దని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పేయడంతో జిల్లా నేతలు కూడా చేతులెత్తేశారంటున్నారు. మొత్తానికి మాజీ ఎంవీవీ కష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

 

MVV projects in trouble

 

CMO asked about red mud dunes | ఎర్ర మట్టి దిబ్బలపై సీఎంవో ఆరా… | Eeroju news

Related posts

Leave a Comment