4 రోజుల పాటు 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్…
ఒంగోలు, ఆగస్టు 20, (న్యూస్ పల్స్)
Mock polling in 12 EVMs for 4 days
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు దాటినా ఇంకా రిజల్ట్స్‌పై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఇలాంటి స్టోరీలను షేర్ చేస్తుంటే… ఆ పార్టీని సపోర్ట్ చేసే మీడియాలో ఇలాంటి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్న వ్యవహారం మరో ఎత్తు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు స్థానం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన ఫలితాలపై అనుమానపడుతున్నారు. ఈవీఎంలలో ఏదో జరిగిందన్న ఆయన డౌట్స్ క్లియర్ చేయాలని ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు. ఆయన రిక్వస్ట్ మేరకు ఎన్నికల సంఘం కూడా స్పందించింది. డౌట్స్ క్లారిఫై చేసేందుకు మాక్ పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయింది.
ఒంగోలులో అనుమానాస్పదంగా ఉన్న 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. భాగ్యనగర్ గోదాములో ఉన్న ఈవీఎంలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు ఈ మాక్‌పోలింగ్ చేపడతారు. రోజులు మూడు ఈవీఎంలకు మాక్‌పోలింగ్ జరుపుతారు. బెల్ ఇంజినీర్ల సమక్షంలో ప్రక్రియ జరగనుంది అయితే బాలినేని మాత్రం రీ కౌంటింగ్ అడగడంతో కధంతా కోర్టు పరిధిలోకి మారింది. ఇప్పటికే ఖర్చును అంచనా వేసిన ఎన్నికల సంఘం ఆయన నుంచి నగదును డిపాజిట్ చేయించుకుంది. ఇలా ఎవరైనా ఈవీఎంలపై అనుమానం ఉన్న వాళ్లు నగదు చెల్లించి మాక్ పోలింగ్ నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు ఒంగోలు విషయంలో అదే జరుగుతోంది.
2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన 26 మంది అభ్యర్థులకి కూడా అధికారులు సమాచారం అందించారు. వాళ్ల సమక్షంలో లేదా వాళ్లు సూచించిన ఏజెంట్ సమక్షంలో మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు అధికారులు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీలక్ష్మి ఆధ్వర్యంలో ప్రక్రియ పూర్తి చేసి అధికారులకు రిపోర్ట్ అందజేస్తారు.మొన్న జరిగిన ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై కూటమిలో టీడీపీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్దన్ రావు విజయం సాధించారు. జనార్దన్‌కు 1,18,800 ఓట్లు వస్తే… బాలినేని శ్రీనివాస్ రెడ్డికి 84,774 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నాగలక్ష్మికి 2,067 ఓట్లు నోటాకు 1,310 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 26 మంది అభ్యర్థులు పోటీ చేసినా మిగతా వాళ్లెవరికీ ఐదు వందల కంటే ఎక్కువ ఓటు రాలేదు.