MLC Kavitha | కవిత బెయిల్… | Eeroju news

MLC Kavitha

కవిత బెయిల్…

మూడు పార్టీల దాడులు..ఎదురుదాడులు

హైదరాబాద్, ఆగస్టు 29 (న్యూస్ పల్స్)

MLC Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టాయి. కవిత బెయిల్ రావడం వెనుక కారణం బీజేపీయే అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, బెయిల్ రావడానికి కాంగ్రెస్ సాయం చేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. గత ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీ- బీఆర్ఎస్ ల మధ్య లోపాయకారీ ఒప్పందాలున్నాయని ప్రచారం చేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు బీజేపీ, బీఆర్ఎస్ లు సంయుక్తంగా చేయించిన దాడులుగా కాంగ్రెస్ అభివర్ణించింది.

బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి బీజేపీ అధినాయకత్వం తప్పించిందని ప్రచారం చేసింది. బీజేపీతో బంధం ఉన్నందుకే కవిత అరెస్ట్ కావడం లేదన్న ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఈ తరుణంలో కూడా కవిత అరెస్ట్ కాకపోవడానికి బీజేపీతో ఉన్న బంధమే కారణమన్న విమర్శలు కాంగ్రెస్ నేతలు గుప్పించారు. మార్చి నెలలో కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాతి పరిణామాలు తెలిసిందే. గత కొద్ది రోజుల నుండి మాత్రం త్వరలోనే కవితకు బెయిల్ వస్తుందని ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవడానికే కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో మకాం వేశారని హస్తం నేతలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కానుందని ప్రచారం మొదలు పెట్టారు. దీన్ని ఇరువురు గులాబీ నేతలు ఖండించాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేతలు చెప్పినట్లే బెయిల్ రావడంతో బీజేపీతో ఒప్పందం కుదరడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని తాజాగా కాంగ్రెస్ ప్రచారం మొదలు పెట్టింది. 16 నెలలు జైల్లో ఉన్న మనీష్ సిసోడియాకు, ఇంకా జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు రాని బెయిల్ కవితకు ఎలా వచ్చిందని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రశ్నల ద్వారా బీజేపీతో మైత్రి కుదిరిందన్న వార్తలు వాస్తవం అన్న రీతిలో అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యానించడం గమనార్హం.

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరగడానికి బీఆర్ఎస్ త్యాగం చేసినందుకే కవిత బయటకు వచ్చిందని కవిత బెయిల్ వెనుక ఉన్న మతలబు ఇదేనంటూ రేవంత్ రెడ్డి సూత్రీకరించారు.కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న విమర్శలను బీజేపీ సైతం దీటుగా సమాధానం ఇస్తోంది. లిక్కర్ కేసులో సుధీర్ఘ కాలం జైల్లో కవితను పెట్టింది మేం అయితే ఆమెకు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ న్యాయవాదుల బృందమే అని కమలం నేతలు ఎదురుదాడికి దిగారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్ – కాంగ్రెస్ ల సంయుక్త విజయంగా అభివర్ణించారు. కవిత కేసు ను వాదించిన అడ్వకేట్ ను రాజ్యసభకు పంపడం అనే ఒప్పంద వల్లే కవితకు బెయిల్ సాకారమయిందని ఆరోపణ చేశారు. ఇలా కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై పరస్పర రాజకీయ యుద్ధానికి దిగడం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక రాజకీయపార్టీలుగా ఉన్నవి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు. అయితే ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే రీతిలో రెండు పార్టీలు పని చేశాయి. సైద్ధాంతికంగా కలవకపోయినా ఒకే లక్ష్యంతో పని చేశాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లు బీఆర్ఎస్ భుజం మీద తుపాకి పెట్టి ఒకరినొకరు దెబ్బకొట్టే రాజకీయాలు చేస్తున్నాయి. ఇందుకు కవిత బెయిల్ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందే రీతిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. రాజకీయాల్లో ఓట్లు,సీట్లే ఆ పార్టీ బలాబలాలను నిర్దేశిస్తాయి కాబట్టి అయితే ఈ వ్యూహాత్మక పోరాటంలో ఏ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందో తెలియాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

కవిత బెయిల్ విషయంలో రెండు పార్టీలు పరస్పర రాజకీయ విమర్శలు చేసుకుంటున్నా… మధ్యలో బీఆర్ఎస్ ను రాజకీయంగా డామేజ్ చేసే విషయంలో మాత్రం రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయనే చెప్పాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ తిరిగి పుంజుకోకుండా ఉండేలా వ్యూహాత్మకంగా దెబ్బ తీసేందుకు బీజేపీతో మైత్రీ ఉందని విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో కాలమే సమాధానం చెబుతుంది. ఈ ప్రచారం ద్వారా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ, బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి తమతో కలిసేలా చేయాలన్న ఆలోచన ఈ ప్రచారం వెనుక దాగి ఉందనడంలో సందేహం లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తే ఆ పార్టీ మరింత బలహీనపడి కనుమరుగు అవుతుందన్నఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు.

ఐదేళ్ల పాటు అధికారంలో లేకుండా పార్టీని నడపడం సాధ్యం కాని పని అని ఈ విషయంలో కేసీఆర్ ను దెబ్బకొడితే ఆ పార్టీ పునాదులు కదులుతాయన్న వ్యూహంతో రేవంత్ రెడ్డి ఈ తరహా ప్రచారంతో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే ఎప్పటి నుండో దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉన్న కమలం నేతలకు తెలంగాణలో ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం మంచి అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీలో మరింత ఆశలు రేపాయనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్ కు మద్ధతిచ్చే వర్గాలను తమ వైపు తిప్పుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను దెబ్బకొట్టేందుకు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠం ఎక్కేందుకు మార్గం సుగమం అవుతుందన్న యోచనలో బీజేపీ వర్గాలు ఉన్నాయి.

ఈ కారణంతో బీఆర్ఎస్ ను ఎంత బలహీనం చేస్తే ఆ స్థానంలో కమలం పార్టీ తో భర్తీ చేద్దామన్న వ్యూహం వారిది.అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీల వ్యూహాలు తెలిసినా. పదేళ్ల పాటు ఒంటి చేత్తో తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు మౌనంగా ఉండటం తప్ప ఇప్పటికిప్పుడు చేసేదేం లేని పరిస్థితి నెలకొంది. తన కుమార్తె కవితకు బెయిల్ రావడం వ్యక్తిగతంగాను, రాజకీయంగాను కేసీఆర్ కు కొంత ఊరటనిచ్చే విషయం. పార్టీ పరంగా చూస్తే వచ్చే ఎన్నికల నాటి వరకు తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తన ముందు ఉన్న పెద్ద టాస్క్. ప్రస్తుతం తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఏం చేస్తారన్నది వేచి చూడాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై టెక్నికల్ గా అనర్హత వేటు పడేలా న్యాయస్థానాల ద్వారా విజయం సాధిస్తారా లేదా అన్నది చూడాలి.

ఇక మరో పెద్ద టాస్క్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు. ఇందు కోసం కేసీఆర్ ఏం చేస్తారు అన్నది మరో ప్రశ్న. పార్టీ పటిష్టతకు, పార్టీ కమిటీల నిర్మాణం, పార్టీ బాధ్యతల పంపిణీ వంటి అంశాలు ప్రాధాన్యమైనవే. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీని అంటిపెట్టుకునేలా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో అన్నది కూడా కేసీఆర్ ముందున్న సమస్యలే. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం అయ్యేలా ఎలాంటి రోడ్ మ్యాప్ తయారు చేస్తారు.అటు బీజేపీ- ఇటు కాంగ్రెస్ పార్టీల వ్యూహాలను ఎదుర్కొని రాష్ట్రంలో మరో దఫా చక్రం తిప్పుతారా లేదా అన్నది కూడా బీఆర్ఎస్ చీఫ్ ముందున్న ప్రశ్నలే.

అన్ని చక్కగా కుదిరినప్పుడు ఏ సమస్య అయినా సుళువుగానే పరిష్కారం అవుతుంది. రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా లేనప్పుడే పార్టీ అధినాయకుడు ఆ వాతవరణం తమకు ఏలా అనుకూలంగా మార్చుకుంటారు అన్నదే.. నాయకుడి సంబంధించిన నాయకత్వ లక్షణాలను బయపెడుతోంది. ఉద్యమ రాజకీయాలతో పాటు, అధికార పీఠంలో పదేళ్లు ఉన్న కేసీఆర్ కు ఇవేమి తెలియనవి కావు. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలతో కేసీఆర్ ముందుకు సాగుతారో చూడాల్సిందే.

MLC Kavitha

 

MLC Kavitha | కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? | Eeroju news

Related posts

Leave a Comment