ఇక కవిత 2.0
హైదరాబాద్, నవంబర్ 27, (న్యూస్ పల్స్)
MLC Kavitha
మన భారత రాజకీయాలను చూస్తే, జాతీయ పార్టీల్లోను, ప్రాంతీయ పార్టీల్లో జైలుకు వెళ్లిన రాజకీయ నేతలు సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అయినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎంతగా వచ్చినా జైలుకు వెళ్లి ఊచలు లెక్కపెట్టిన రాజకీయ నేతల లెక్క చూస్తే అతి స్వల్పం. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి మనకు తెలిసిందే. రాజకీయాల్లో అరెస్టులే ఉంటాయి తప్ప జైలుకెళ్లడాలు అరుదు. అలా వెళ్లారంటే పొలిటికల్ ఈక్వేషన్ కుదరనట్లే. జైలుకు పంపే సర్కార్‌కు, వెళ్లే వారికి మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఇంపార్టెంట్ అన్నది తెలిసిందే. అందుకే గత ప్రభుత్వాల హాయంలో జరిగిన కుంభకోణాలు, వాటి వెనుక ఉన్న పొలిటికల్ లీడర్స్ శాశ్వతంగా జైలుకు వెళ్లిన ఉదంతాలు తక్కువే. రాజకీయాలు పూల బాట మాత్రమే కాదు. ముళ్ల బాట కూడా. అధికారంలోకి రావాలంటే చెమటోడ్చాల్సిందే.
ఎత్తుకు పైఎత్తులు వేయాల్సిందే. వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నాలి. ఎదురు దెబ్బ తగిలితే సమయం కోసం వేచి చూడాలి. గెలుపు కోసం ఎత్తు పల్లాలు దాటాలి, కష్టనష్టాలు అనుభవించాలి. చదరంగంలో పావులు కోల్పోయినంత మాత్రాన ఓటమి కాదు. పావులు ఉన్నంత మాత్రాన గెలుపు కాదు. చివరి వరకు ఎవరు పోరాటం చేస్తారో వారే విజేత. అందుకే రాజకీయాన్ని చందరంగంతో పోల్చి చెప్తారు పొలిటికల్ ఎక్స్ పర్ట్. ఇప్పుడు అదే రీతిలో ఎమ్మెల్సీ కవిత కెరీర్ రెండో ఇన్సింగ్స్ మొదలుపెట్టారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుమార్తెగా కల్వకుంట్ల కవిత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తెలంగాణ జాగృతి అనే సంస్థ ప్రారంభించారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై తెలంగాణ ప్రజల్లో ఓ చైతన్యం తీసుకురావడం ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఉద్యమంలో బతుకమ్మ పండుగను ఓ ఆయుధంగా కవిత వాడారు. మహిళల్లో పండుగ సంప్రదాయాలతోపాటు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షపై నినదించేలా బతుకమ్మ పండుగను ఉపయోగించుకున్నారు. తద్వారా అప్పటి ఉద్యమ రాజకీయాల్లో తన ప్రత్యేకత చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కవిత. అప్పటి టీఆర్ఎస్, అదే రీతిలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో ముందున్నారు. అప్పటి ప్రభుత్వం పెట్టిన పలు ఉద్యమ కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. ఆ తర్వాత ఎంపీగా , ఎమ్మెల్సీగా పదవులు పొంది ప్రజా ప్రతినిధిగా పని చేశారు. కొన్ని కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షురాలిగా పని చేసిన అనుభవం ఉంది.
ఇలా తనదైన శైలిలో తెలంగాణ రాజకీయాల్లో కవిత చురుకుగా పాల్గొన్నారు. రాజకీయాల్లో గుర్తింపు రావాలంటే దాని వెనుకే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే రీతిలో కవితపైన విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్లో కవిత కారణంగానే మరే ఇతర మహిళా నేతలకు గుర్తింపు రాలేదని, రాజకీయంగా ఎదగలేదన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్లను కాదని ఎంపీగా, ఎమ్మెల్సీగా కుమార్తెకే కేసీఆర్ పదువులు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. టీఆర్ఎస్ లేదా నేటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా నేతలు, రాజకీయ విమర్శకులు చెబుతుంటారు. బీఆర్ఎస్ చీఫ్‌గా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు, కుమార్తె కవిత, కేసీఆర్ కుటుంబ మరో సభ్యుడైన జోగినపల్లి సంతోష్ రాజకీయ పదవులు పొందారన్న విమర్శలున్నాయి. అయినా ఉద్యమంలో వీరంతా కీలక పాత్ర పోషించడం, ప్రజలతో మమేకమవ్వడం, ఉద్యమ కేసుల్లోను ఉండటంతో ఈ విమర్శలను ప్రజలు పట్టించుకోలేదు.
కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ వరుసగా గెలిపిస్తూనే ఉన్నారు. సిద్దిపేట నుంచి హరీశ్ రావు గెలుపు పైన రికార్డులున్నాయి. కవిత ఎంపీగా రెండు సార్లు నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే ఓసారి ఓటమి పాలయ్యారు. ఇది కవితకు రాజకీయంగా ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా కవితకు పదవి కట్టబెట్టడం విమర్శలకు దారి తీసింది. ఇలా రాజకీయంగా అనేక విమర్శల నడుమే కవిత తనదైన రాజకీయం చేస్తూ వస్తూ ఉన్నారు.ఉద్యమ రాజకీయాల్లో, అధికార రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు సాఫీగా సాగిన రాజకీయాలు ఒక్కసారి వ్యతిరేకంగా మారాయి.
ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో మడుపులు చేతులు మారాయని, ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతోపాటు కవిత పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరిపాయి. కవిత ఇంట్లో సోదాలు చేసిన అనంతరం 15 మార్చి 2024లో కవితను ఈడీ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. ఆ తర్వాత ఇదే కేసులో 11 ఏప్రిల్ 2024లో కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ కవిత జైలు జీవితం గడిపారు. ఈ కేసుల్లో సుప్రింకోర్టు బైయిల్ ఇవ్వడంతో ఆగష్టు 27, 2024న విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన కవితకు పార్టీ నేతలు, కార్యకర్తలు అపూర్వ సాగతం పలికారు. ఈసందర్భంగా మాట్లాడిన కవిత తనను అన్యాయంగా జైలుకు పంపారని, అందుకు వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు. 18ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని ఎలాంటి ఆరోపణలు లేవని, తాను కేసీఆర్ బిడ్డగా తప్పు చేసే వ్యక్తి కానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పొలిటికల్‌గా సైలంట్ అయ్యారు. ప్రతీ బతుకమ్మ పండుగకు వార్తల్లో నిలిచే కవిత ఈ సారి బహిరంగంగా బతుకమ్మ వేడుకల్లో ఎక్కడా పాల్గొన లేదు. ఆనారోగ్యం కారణమన్న ప్రకటనను ఆమె కార్యాలయం విడుదల చేసింది. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో రెండో ఇన్సింగ్స్ మొదలుపెట్టారు. ఆ దిశగానే కవిత అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో మాస్ ఎంట్రీ ఇచ్చే దిశగా వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
జైలు జీవితం తర్వాత మౌనంగా ఉన్న కవిత ఎక్కడా ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. ఏ కార్యక్రమంలోను పాల్గొనలేదు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సమయం కోసం వేచి చూసిన కవిత అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అదానీపై అవినీతి ఆరోపణలు వార్తలు వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ కవిత తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఆడవారికో న్యాయం, అదానికో న్యాయమా అంటూ తన గళం విప్పారు. అవినీతి ఆరోపణల పేరుతో తనను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇప్పుడు అదానిపై అవే ఆరోపణలు వస్తున్నాయి. అతన్నీ జైలులో పెడతారా పెట్టరా అన్న ప్రశ్నలు ప్రజల్లో రేకెత్తించేందుకు కవిత ప్రయత్నించారు. రాజకీయంగా తమ పార్టీ, తాను వ్యతిరేకం కాబట్టే జైలుకు పంపారని, అదానీ బీజేపీ పెద్దలకు సన్నిహితుడు కాబట్టి అతన్ని జైలులో పెట్టే పరిస్థితి ఉండదన్న తీరును తన కామెంట్స్ ద్వారా బయటపెట్టారు కవిత.
ఒక్క మాటలో చెప్పాలంటే తనపై మద్యం కుంభకోణం ఆరోపణలు రాజకీయపరమైనవే తప్ప అందులో వాస్తవాలు లేదని చెప్పారు. ఈ కామెంట్స్ ద్వారా ప్రజల్లో తనపైన సానుభూతి పెంచే వ్యూహాన్ని అమలు చేశారు. ఇలా తన తొలి ప్రశ్న బీజేపీ సర్కార్ పెద్దలకు వేస్తూ, సైలెన్స్ తర్వాత తన పొలిటికల్ రీ ఎంట్రీ స్టార్ట్ చేశారు.పొలిటికల్ మైలేజ్ రావాలంటే ప్రతీ రాజకీయ నేతకు ఓ వ్యూహం ఉండాలి. ఆ వ్యూహానికి తగ్గ ప్రజల డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్‌కు నాయకత్వం వహించాలి. తద్వారా పొలిటికల్ లీడర్ షిప్ చేయలనుకునే వారికి సులువైన జర్నీగా మారుతుంది. ఇప్పుడు తన రీ ఎంట్రీ అదే రీతిలో కవిత ప్లాన్ చేసుకున్నట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్లు అంతా రేవంత్ సర్కార్ పాలన తీరును, ఇచ్చిన హమీల నెరవేర్పు వంటి అంశాలపై నిలదీస్తుంటే అవేవి మాట్లాడకుంటా తెలంగాణలోని బీసీ వర్గానికి సంబంధించన కుల గణనపై మాట్లాడారు.
తన పొలిటికల్ రీ ఎంట్రీ అతి పెద్ద ఓటర్ వర్గం డిమాండ్లపై కవిత స్పందించారనే చెప్పాలి. బీసీ కులగణన జరుగుతున్న వేళలో కవిత, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ అనే సంఘంతో కలిసి 35 పేజీలతో కూడిన బీసీల డిమాండ్ల పత్రాన్ని బీసీ కమిషన్ అధ్యక్షుడిని కలిసి అందజేశారు. ఈ చర్య ద్వారా బీసీల అటెన్షన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. గతంలోను అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేయడం ద్వారా ఎస్సీ , ఎస్టీ వర్గాలను, మహిళా రిజర్వేషన్లపై కొన్ని కార్యక్రమాలు చేసి మహిళా వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాజాగా బీసీలను తన వైపు చూసేలా కవిత తన రీఎంట్రీ పొలిటికల్ జర్నీ స్టార్ చేశారనే చెప్పాలి. అయితే ఇది ఎంత వరకు తీసుకెళతారు. ఎలాంటి కార్యాచరణ ఉంటుంది. అన్నది చూడాల్సి ఉంది.
కాని జైలుకు వెళ్లి విడుదలైన వారు మాత్రం అత్యన్నత రాజకీయ స్థానాలను అలంకరించారనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రంలోనే చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం తర్వాతే సీఎం అయ్యారు. తెలంగాణలో జైలు జీవితం తర్వాతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దేశంలో సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు జైలు జీవితం అనుభవించాక సీఎం కుర్చీలో మరో దఫా కూర్చున్నారు. జార్ఖండ్‌లో హైమంత్ సోరేన్ కూడా జైలు జీవితం తర్వాత జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి సీఎం అవబోతున్నారు. ఇవన్నీ మన దేశ రాజకీయాల్లో మనం చూస్తోన్న ఉదంతాలు. ఇక ఐదున్నర నెలలు జైలులో గడిపిన కవిత తన రీఎంట్రీ పాలిటిక్స్‌ను ఎలా మలచుకోనున్నారు?, ఎలాంటి వ్యూహాంతో ముందుకు వెళతారు ? రాజకీయంగా ఏ స్థాయికి చేరుకుంటారు ? అన్నది ఇప్పుడు అందరిలోను ఉత్పన్నమయ్యే ఆసక్తి కరమైన ప్రశ్న.
Kalvakuntla Kavitha | యాక్టివ్ మోడ్ లోకి కల్వకుంట్ల కవిత | Eeroju news