Mirchi fraud in Deputy CM Ilaka | డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి మోసం | Eeroju news

Mirchi fraud in Deputy CM Ilaka

డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి మోసం

ఖమ్మం, జూన్ 25, (న్యూస్ పల్స్)

Mirchi fraud in Deputy CM Ilaka

మీ మిర్చి పంటను మార్కెట్ కు తీసుకెళ్లే పని లేకుండా నేనే కొంటానని భరోసా ఇచ్చాడు.. పంట అప్పగించిన తరవాత 15 రోజుల గడువులోగా మీ డబ్బులను పువ్వుల్లో పెట్టి చేతికిస్తానని నమ్మకం కలిగించాడు. సుమారు వెయ్యి క్వింటాళ్ల మిర్చిని ఆ రైతుల నుంచి కొనుగోలు చేశాడు.గుంటూరు మిర్చి యార్డుకు తరలించి ఎంచక్కా సొమ్ము చేసుకున్నాడు. లక్షో, రెండు లక్షల్లో కాదండోయ్.! ఏకంగా రూ. 2.20 కోట్లను జేబులో వేసుకున్నాడు. 15 రోజుల గడువు తర్వాత రైతులు అడిగితే రేపు.. మాపు అంటూ మూడు నెలలుగా కాలం గడుపుతూ వస్తున్నాడు. వారి నుంచి ఒత్తిడి పెరిగే సరికి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా ఉడాయించాడు.ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదంతం ఇది. రూ. 2.20 కోట్ల విలువ చేసే పంటను ఆ మోసకారి చేతుల్లో పోసి చివరికి మోసపోయామని గ్రహించిన ఆ కౌలు రైతులు చివరికి పోలీసులను ఆశ్రయించారు.

ఆరుగాలం నెత్తురు చెమటగా మార్చి పండించిన తమ పంటకు రావాల్సిన సొమ్మును ఇప్పించి తమకు న్యాయం చేయాలని మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుట ఆ కౌలు రైతులు మూకుమ్మడిగా మొర పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.మొలుగుమాడు గ్రామానికి చెందిన ఖరీదు కృష్ణారావు అనే వ్యాపారి గడిచిన నాలుగేళ్లుగా మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. దీంతో అక్కడి కౌలు రైతులు తమ పంటను మార్కెట్ లో అమ్ముకోకుండా ఆ వ్యాపారికే అమ్మేవారు. ఎప్పటిలాగే ఈ ఏడాది పంటను కూడా అతనికే అమ్మారు. అయితే డబ్బులు చెల్లించేందుకు 15 రోజుల గడువు విధించిన ఆ వ్యాపారి మూడు నెలలు గడిచినా ఇవ్వలేదు. దీంతో తరచూ అతని ఇంటికి వెళ్లి అడుగుతున్న రైతులు ఆయన తండ్రి పుల్లారావు చేత మాటలు పడాల్సి వచ్చేది.

చివరికి “ఏం పీక్కుంటారో పీక్కోండి..” అంటూ దుర్భాషలు సైతం పలికారు. ఆ ఊరి పెద్ద మనుషులతో చెప్పించినా వారిపైన కూడా అమర్యాదగా, అసభ్యంగా విరుచుకుపడేవారు. తాజాగా ఒకరి తర్వాత ఒకరు ఇల్లు విడిచి కృష్ణా జిల్లాలోని తమ బంధువుల ఇంటికి చెక్కేసి ఇంటికి తాళం వేశారు.ఇంటికి తాళం వేసి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయిన రైతులు చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. ములుగుమాడుతో పాటు తక్కెళ్లపాడు, సకినవీడు గ్రామాల్లో మొత్తం 70 మంది రైతులను ముంచిన ఆ వ్యాపారి రూ.2.20 కోట్లతో ఉడాయించాడు.డెబ్భై మంది కౌలు రైతులను మోసం చేసి రూ.2.20 కోట్ల పెద్ద ఎత్తున సొమ్ముతో వ్యాపారి ఊరు వదిలి పారిపోయిన ఉదంతం పోలీసులకు సవాలుగా మారింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజక వర్గంలో ఈ భారీ మోసం చోటు చేసుకోవడం విస్తుగొలుపుతోంది. ఆరుగాలం శ్రమించి, రెక్కలు ముక్కలు చేసుకున్న కౌలు రైతులను మోసగించి భారీ మోసానికి పాల్పడి రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన వ్యాపారి కృష్ణారావును పోలీసులు రప్పించి రైతులకు న్యాయం చేస్తారా..? లేక తాత్సారం చేస్తారా..? అన్న అంశం ఇప్పుడు చర్చకు కారణమైంది.

 

Mirchi fraud in Deputy CM Ilaka

 

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి…? | Kiran Kumar Reddy as Governor of Telangana…? | Eeroju news

 

Related posts

Leave a Comment