గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ చర్యలు
హైదరాబాద్, అక్టోబరు 16, (న్యూస్ పల్స్)
Minister Ponnam Prabhakar
గురుకుల పాఠశాల గెట్లకు తాళాలు వేసిన వారి పై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దసరా సెలవుల అనంతరం విద్యాశాఖకు సంబంధించి గురుకులాలు, కాలేజీలు , పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇది ఈ 10 నెలల్లో పెట్టిన బకాయిలు కాదు.. ఈ విషయాన్ని యజమానులు గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో వివరాలు తెప్పించుకుని సమావేశాలు కూడా నిర్వహించాం.
నేడో రేపో నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ సమయంలో ఎవరి మాటలో పట్టుకుని కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాను. ఇది మంచిది కాదు. ప్రభుత్వం బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది. గురుకుల మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. గురుకులాలకు పెట్టిన బ్యానర్లను వెంటనే తొలగించాలి. విద్యార్థులకు సక్రమంగా తరగతులు నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయి.
పాత బకాయిలు ఇప్పించే బాధ్యత మాది. నేను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్ని గురుకులాలపై సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. గురుకుల భవన యజమానులకు విజ్ఞప్తి వెంటనే బ్యానర్లు తొలగించాలి. విద్యార్థులకు స్వాగతం పలకండి. వారి విద్యా బోధనకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయో మీకు తెలుసు. మీకు బకాయిని చెల్లించే బాధ్యత మాది.. లేదంటే నన్ను గానీ, ముఖ్యమంత్రి గారిని గానీ లేదా అధికారులను కలవండి.
పాత బకాయిలతో సహా మెస్ ఛార్జీలు మూడు రోజుల క్రితమే చెల్లించాం. గురుకులాలు తాళం వేసి తలుపులు వేస్తే కఠిన చర్యలు ఉంటాయి. గురుకుల ప్రిన్సిపల్, అర్సీవోలు ఎక్కడైనా యజమానులు ఇబ్బందులు పెడితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయండి. క్రిమినల్ చర్యలు తీసుకోండి. కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం.. ప్రత్యామ్నాయంగా అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే భవనాలు చూడండి. బకాయిలు చెల్లించే బాధ్యత మాది’ అంటూ మంత్రి పేర్కొన్నారు.