మెగా కృష్ణారెడ్డి చుట్టూ రాజకీయం…
హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్)
Mega Krishna Reddy
మేఘా కృష్ణారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా బడా కాంట్రాక్టులు ఆయన కంపెనీలే చేస్తూంటాయి. తెలంగాణలో కాళేశ్వరం అయినా.. ఏపీలో పోలవరం అయినా మేఘా ఇంజినీరింగే కాంట్రాక్టర్. ఇవి అతి భారీ ప్రాజెక్టులు. కింది స్థాయి వరకూ కొన్ని వేల కాంట్రాక్టులు ఆయన సంస్థకు దక్కి ఉంటాయి. ఇలా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ ఒలెక్ట్రాకు చెందినవి. ఇది మేఘా గ్రూప్ కంపెనీనే. ఇంకా అనేక విభాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వారికి ప్రతీపాత్రుడు. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంది.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎన్నో కాంట్రాక్టులు చేపట్టింది. ఇంకా చెప్పాలంటే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పనులన్నీ మేఘా కంపెనీకే దక్కాయి. కాళేశ్వరం లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టు. ఇందులో సింహ భాగం మేఘా కంపెనీనే చేసింది. ఇతర ప్రాజెక్టులు కూడా ఆ సంస్థకే దక్కాయి. బాగా పని చేస్తున్నారని ఓ సారి కేసీఆర్ సన్మానం కూడా చేశారు. అందుకే విపక్ష నేతలు చాలా సార్లు మేఘా కంపెనీకి తెలంగాణను దోచి పెడుతున్నారని ఆంధ్రా కాంట్రాక్టర్ కు దాసోహం అయ్యారని ఆరోపించేవారు. మేఘాను ఈస్టిండియా కంపెనీగా పేర్కొనేవారు. మేఘా కంపెనీ బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లలో మేఘాతో పాటు అనుబంధ కంపెనీలు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన పార్టీల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బీజేపీ ఉంది.
బీజేపీ విషయం పక్కన పెడితే.. ఓ ప్రాంతీయ పార్టీకి.. భారీగా కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీ రూ. రెండు వందల కోట్ల వరకూ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇవ్వడం విమర్శలకు దారితీసేదే. అది బీఆర్ఎస్ పార్టీతో మేఘా ఇంజినీరింగ్ యజమానులకు ఉన్న సాన్నహిత్యం అనుకోవచ్చు. తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన కంపెనీపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటో స్పష్టంగా తెలియదు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లో చేపడుతున్న ఓ ప్రాజెక్టును మేఘా, రాఘవ సంస్థలు కలిసి చేజిక్కిచుకున్నాయి. ఈ రాఘవ సంస్థ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది.
తర్వాత హైదరాబాద్‌కు నీరందరించేలా చేపడుతున్న గోదావరి ఫేజ్ టు, మూసి ప్రాజెక్టులపై ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. అసలు టెండర్లే పిలవలేదు. అయినప్పటికీ ఆ సంస్థకే టెండర్లు ఇస్తారని తాము వచ్చాక సంతకాలు చేసిన అధికారుల్ని జైలుకు పంపుతామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేఘా కృష్ణారెడ్డి కూడా ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒక వేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన హవా కొనసాగేది. బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసేవారు కాదు. మొత్తంగా చూస్తే మేఘా కృష్ణారెడ్డి ఎవరు అధికారంలో ఉంటే వారికి సన్నిహితమయ్యే ట్రిక్స్ అన్ని బాగా వంటబట్టించుకున్నారన్న సెటైర్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి టెన్షన్ లో రేవంత్ ? | New CM for Telangana | Congress Leader