Kurnool High Court | కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్ | Eeroju news

కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్

కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్

కర్నూలు, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్)

Kurnool High Court

 

కర్నూలులో హైకోర్టు పెడతామని దాన్నే న్యాయరాజధానిగా పిలుస్తామని ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రకటించారు. ఐదేళ్లలో కనీసం హైకోర్టు బెంచ్ కోసం కూడా సిఫారసు చేయలేదు. పైగా సుప్రీంకోర్టులో కర్నూలులో హైకోర్టు అనే విధానాన్ని విరమించుకున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కర్నూలు న్యాయవాదుల డిమాండ్ ను తీర్చాలని అనుకుంటోంది. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేయాలని మఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అమరావతికి అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసిన తర్వాత.. అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి జరిగిన ప్రచారంతో.. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది. అది టీడీపీ ఓటమికి కారణం అయింది.

వైసీపీ ఈ రాజకీయాన్ని అర్థం చేసుకుని మూడు రాజధానుల విధానాన్ని గెలిచిన తర్వాత తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా కర్నూలులో న్యాయరాజధానిని ప్రతిపాదించింది. అక్కడి జగన్నాథ గట్టులో హైకోర్టును నిర్మిస్తామని అప్పటి కర్నూలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. గత ఎన్నికల్లో వైసీపీ వాదనను ఎవరూ నమ్మలేదు. అన్ని సీట్లలో ఓడించారు. అయితే అక్కడి ప్రజల్లో ఉన్న కోరికను మాత్రం.. నెరవేర్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. హైకోర్టు బెంచ్ అనేది పూర్తిగా సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు మాత్రమే పెట్టగలదు. కానీ ప్రత్యేక బెంచ్ అవసరం ఉందని గట్టిగా సిఫారసు చేస్తే మాత్రం అనుమతి లభించవచ్చు.

చంద్రబాబునాయుడు ఈ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసి. తదుపరి కార్యాచరణను న్యాయశాఖకు అందించారు. రాజకీయంగా చంద్రబాబు ఈ సారి ఎలాంటి అపోహలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. భారతీయ జనతాపార్టీ, జనసేన కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ కు ఆమోదం తెలిపారు. అందరి సహకారంతో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. గట్టి ప్రయత్నాలు చేస్తే రెండేళ్లలోపే కర్నూలులో హైకోర్టు బెంచ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అమరావతిపై ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగని ఇతర ప్రాంతాలపై నిర్లక్ష్యం చేయలేదని.. అభివృద్ధి వికేంద్రీకరణ చేశామని.. పరిశ్రమల్ని రాయలసీమకు ఎక్కువగా వచ్చేలా చేశామని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు.

రాజ‌ధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల త‌ర‌హాలో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన అత్యుత్త‌మ ఇనిస్టిట్యూట్ ను అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని…ఆ మేరకు చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారలకు సూచించారు.

జూనియర్ న్యాయవాదులకు శిక్ష‌ణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలని సూచించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని…దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్దతులను అవలంభించాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ…అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్ ప్రభుత్వం నుంచి ఉండకూడదని సీఎం వ్యాఖ్యానించారు.

న్యాయ‌ శాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్నముఖ్య‌మంత్రి…మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు.కానీ ప్రజల్లో ఆ వాదన ఎక్కువగా నిలబడలేదని ఫలితాలు నిరూపించాయి. ఈ సారి అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్‌కు చాయిస్ ఇవ్వకుండా చేయాలని అనుకుంటున్నారు. ప్రజల్లో ఎక్కువగా ఉన్న ప్రాంతీయ డిమాండ్ లను నెరవేర్చాలనుకుంటున్నారు. అందుకే హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్

 

Review meeting with Court Duty Officers and Court Licensing Officers | కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం | Eeroju news

Related posts

Leave a Comment