Kia company | కడపలో కియా తరహా కంపెనీ… | Eeroju news

కడపలో కియా తరహా కంపెనీ...

కడపలో కియా తరహా కంపెనీ…

కడప, జూలై 27, (న్యూస్ పల్స్)

Kia company

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అత్యధిక ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధి పరుగులుపెట్టేలా వరాల జల్లు కురిపించడంతో ఆ ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కడప జిల్లాకు బడ్జెట్లో స్థానం కేటాయించడంతో స్థానికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొప్పర్తి లోని ఇండస్ట్రియల్ కారిడార్‌కు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం హామీ ఇవ్వడంతో రానున్న రోజులలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు పండుగ చేసుకుంటున్నారు. కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న విశాఖ – చెన్నై కారిడార్‌లోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌కు మహర్దశ పట్టనుంది.

కొప్పర్తి కారిడార్‌కు నీళ్లు, విద్యుత్, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రత్యేకంగా ప్రకటించారు. 7250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొప్పర్తి పారిశ్రామిక వాడకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2007 సంవత్సరంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైంది. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం కాబట్టి అభివృద్ధి పనులు చేశామంటే చేశామనిపించారు.

రోడ్లపై ఆర్చీలు అధునాతనంగా ఏర్పాటు చేయించి  తన ఫొటోలు మాత్రం బానే వేసుకున్నారు. అయితే పరిశ్రమలను తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే గతంలో కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రం కొప్పర్తి కారిడార్‌కి నిధులు కేటాయించింది… రూ.350 కోట్లతోఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ఆ కారిడార్‌లో పైప్‌లైన్లు మరియు రోడ్లకు సంబంధించి మరోసారి రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించింది. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వాలు కొప్పర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామనడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లలో కొప్పర్తి కారిడార్‌ అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది.

కొత్తగా ఎలాంటి పరిశ్రమలు రాకపోవడం. మౌళిక వసతులు లేకపోవడంతో అక్కడ ఉన్న అరకొర పరిశ్రమల మనుగడ కూడా కష్టంగా తయారైంది. ఇప్పుడు కడప జిల్లా పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడవకుండానే కేంద్ర బడ్జెట్‌లో కొప్పర్తికి స్థానం కల్పించారు. కొప్పర్తి కారిడార్‌కు నీళ్లు, విద్యుత్, రోడ్లు వంటి సదుపాయాల ఏర్పాటు పూర్తైతే పరిశ్రమలు ఏర్పాటై దాదాపు లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

కడప నియోజకవర్గం కమలాపురం నియోజకవర్గం మధ్య ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు రెండు పెద్ద కంపెనీలు మాత్రమే ఉన్నాయి ఒకటి సీసీ కెమెరాలు తయారు చేసే అల్టిక్స్ అండ్ కంపెనీ ఒకటైతే.. టీవీ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ మరొకటి ప్రారంభ దశలో ఉంది. అంతేకాకుండా 30 మధ్య చిన్న తరహా పరిశ్రమలు అక్కడ ఉన్నాయి అందులో చిన్న చిన్న సిమెంటు తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. వీటన్నిటిలో నాలుగువేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు.

అఇండస్ట్రియల్ కారిడార్ లో మొత్తం అభివృద్ధి జరిగితే దాదాపు లక్ష పైచిలుకు మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చని స్థానికులు అంటున్నారు. కరువు ప్రాంతమైన కడప జిల్లాలో ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచన నిజంగా గొప్ప విషయమే  రాజకీయాలకు అతీతంగా దాని అభివృద్దికి చంద్రబాబు కేంద్ర నిధులు రాబడుతుండటంతో సమీపకాలంలోనే కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌కి మహర్ధశ పట్టనుంది. విమానయానం, రోడ్డు మార్గం, రైలు మార్గం అన్నీ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు అనుసంధానమై ఉండటంతో ఇండస్ట్రీలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కియా కార్లతో అనంతపురం జిల్లాకు కళ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. కొప్పర్తిని ఏ రేంజ్లో డెవలప్ చేస్తారో అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.

కడపలో కియా తరహా కంపెనీ...

 

YS Jagan sensational comments | వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. | Eeroju news

Related posts

Leave a Comment