Ketireddy | రగిలిపోతున్న కేతిరెడ్డి | Eeroju news

Ketireddy

రగిలిపోతున్న కేతిరెడ్డి

అనంతపురం, ఆగస్టు 3, (న్యూస్ పల్స్)

Ketireddy

 

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమి తర్వాత పార్టీకి ఇబ్బందికరంగా మారారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పైనే విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. అందులో జగన్ కూడా ఒకరు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అధినాయకత్వాన్ని తప్పుపట్టేందుకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు? ఆయన పార్టీని వీడే ఆలోచన ఉందా? పార్టీని వీడితే ఏ పార్టీలో చేరతారు? వైఎస్ జగన్ మనస్తత్వం తెలిసి కూడా ఆయన విమర్శలకు సిద్ధమవుతున్నారంటే కేతిరెడ్డి రాజకీయంగా తెగించినట్లే కనపడుతుంది. పార్టీ తనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలనే ఆయన ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ సొంత జిల్లా కడపలోనూ గత ఎన్నికల్లో దారుణ ఓటమి సంభవించింది. ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి.

అవి చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది. అయితే పార్టీ కష్ట సమయాల్లో అండగా ఉండాల్సిన కేతిరిెడ్డి వెంకట్రామిరెడ్డి నేరుగా జగన్ వైఖరిని తప్పుపట్టడాన్ని చూస్తుంటే ఆయన పక్క చూపులు చూస్తున్నట్లే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఒక ప్రయివేటు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ జగన్ వైఖరిని తప్పుపట్టారు. మద్యం విషయంలో తమ ప్రభుత్వం విఫలమయిందన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా తమకు అవకాశం లేదని చెప్పారు. సీఎంవోలో ధనుంజయ్ రెడ్డి వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. ఇక తాజాగా జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను కూడా తప్పుపట్టారు.

మనం మొత్తం అప్పులు చేసి ఒక్క ఏడాది టైం కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద పడితే ఎలా? అంటూ ప్రశ్నించారు. వాళ్ళకి సంపద సృష్టికి టైం ఇవ్వాలి కదా? అని అన్నారు. ఒక్క ఏడాది కూడా ఆగలేరా? ఇదేమి రాజకీయం అంటూ జగన్ పై కేతిరెడ్డి నేరుగా విమర్శలకు దిగారు. కేతిరెడ్డి అన్నదాంట్లో వాస్తవముండి ఉండవచ్చు. కొంత టైం ప్రస్తుత ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరమూ నిజమే. అదే సమయంలో కార్యకర్తలను కాపాడుకోవాలన్నా, నేతల్లో ధైర్యం నింపాలన్నా జగన్ ఆ మాత్రం విమర్శలు చేయాలన్నది కేతిరెడ్డికి తెలియనిదా? అంటే దానికి మాత్రం ఆయన వద్ద జవాబు లేదు.

 కేతిరెడ్డి ఒకసారి కాంగ్రెస్ నుంచి మరొక సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. రెండు సార్లు ఓటమి పాలయ్యారు. తాను ఎంత అభివృద్ధి చేసినా, ప్రజల్లోనే నిరంతరం ఉన్నప్పటికీ తన ఓటమికి కారణం తాను కాదని కేతిరెడ్డి గట్టిగా భావిస్తున్నట్లుంది. తన ఓటమికి పక్కా జగన్ మాత్రమే కారణమని ఆయన విశ్వసిస్తున్నారు. అయితే అదే సమయంలో జగన్ పై చేస్తున్న విమర్శలు ధర్మవరం నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇంతకూ కేతిరెడ్డి జగన్ పైనా, పార్టీ నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేయడం ఎందుకన్నది మాత్రం తెలియడం లేదు. ఆయన ఆలోచన ఎలా సాగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Ketireddy

 

20 thousand crores coming to Andhra | ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు | Eeroju news

Related posts

Leave a Comment