కేసీఆర్ నయా ప్లాన్
హైదరాబాద్, జూలై 30, (న్యూస్ పల్స్)
KCR’s new plan
బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. వరస ఓటములతో కుదేలయిపోయిన ఆ పార్టీ ఇక సంచలన నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తుంది. లేకుంటే పార్టీ మనుగడ కష్టసాధ్యమని అగ్రనాయకత్వం గుర్తించినట్లుంది. అందుకోసమే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దీనిపై కసరత్తులు ప్రారంభించారని తెలిసింది. ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అప్పుడే ప్రజలు కొంత పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తే ప్రజల్లో వ్యతిరేకత ఉండదని, దీంతో పాటు న్యూ ఫేస్ లు జనం ముందుకు తేవడం వల్ల కొంత పాజిటివ్ వే లో వెళ్లవచ్చన్న వ్యూహంలో ఉన్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.
తాము ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజల్లో ఎక్కడో అసంతృప్తి, అసహనం ఫలితాల ద్వారా వెల్లడయింది. స్థానిక నాయకత్వంపై అసంతృప్తి పార్టీ పరాజయానికి ఒక కారణంగా గుర్తించారు. వారు జనంలోకి పెద్దగా వెళ్లకపోవడంతో పాటు తమ అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ముఖ్యమైన అనుచరులు గ్రామాల్లో చేసిన వీరంగం కూడా పార్టీ ఘోర పరాజయానికి కారణంగా భావిస్తున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఒక్క స్థానం కూడా ప్రజలు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేదుకేసీఆర్ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం వల్ల రాజకీయంగా ఇబ్బందులు తప్పవని పార్టీ నాయకత్వం భావిస్తున్నారు.
అందుకోసమే నియోజకవర్గాల వారీగా కొత్త నేతలను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వారికి ఇన్‌ఛార్జి బాధ్యతలను ఇప్పటి నుంచే అప్పగించాలని యోచిస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేతలతో పాటు సామాజికపరంగా కూడా పేరున్న నేతలను ఇన్‌ఛార్జులను నియమించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా తయారవుతుందని తెలిసింది. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది. Aసేవా భావం ఎక్కువగా ఉన్నవారితో పాటు ఎన్‌ఆర్ఐలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించేవారిని నేతలుగా ఎంపిక చేయాలని చూస్తున్నారు.
పాత నేతలపై ఉన్న పేరు ఇప్పట్లో తొలగిపోయేలా లేదని గులాబీ బాస్ కూడా తనకు అందిన నివేదికల ద్వారా తెలుసుకుని ఆయన ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కువ నియోజకవర్గాల్లో అంటే దాదాపు ఎనభైకి పైగా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చి కొత్త వారిని నియమించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అంతా ఒకే అయితే జిల్లాల వారీగా పాతనేతలను పిలిపించి వారితో మాట్లాడిన తర్వాత గులాబీ బాస్ ఈ పేర్లను ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వారికి పదవులు ఇస్తామని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయాలన్న నిర్ణయానికి కూడా కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. మరి కేసీఆర్ నయా ప్లాన్ ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.