19న కేసీఆర్ ఎంట్రీ
హైదరాబాద్, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్)
భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 19 వ తేదీన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.రామారావు కు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధినేత ఆదేశాల మేరకు…ఈనెల 19 వ తేదీన మధ్యాహ్నం 1 గంటనుండి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనున్నది.అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత మరియు మాజీ… ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు…పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో కూడిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 19 న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో, బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించారు.
రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలమీద ప్రధానంగా చర్చ జరగున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణ పై సమగ్ర చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాల పై ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటిఆర్ తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ హాజరుకావాలని కెటిఆర్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎప్పుడైనా పార్టీ నేతలు వస్తే వారితో సమావేశమై.. త్వరలోనే కార్యాచరణ అమలు చేస్తారమని.. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిద్దామని సూచించేవారు. ఇప్పుడు సమయం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ అనుకుంటున్నారు . ఆ తేదీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.