KCR | జాతీయ పార్టీ కాడికి వదిలేసినట్టనా | Eeroju news

జాతీయ పార్టీ కాడికి వదిలేసినట్టనా

జాతీయ పార్టీ కాడికి వదిలేసినట్టనా

హైదరాబాద్, నవంబర్ 16, (న్యూస్ పల్స్)

KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత జనంలోకి రాలేదు. పార్టీ నేతలు ఆయనను కలవాలంటే ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ కు వెళ్లాల్సిందే. ఆయన కలవాలనుకుంటున్న నేతలకు మాత్రమే అదీ ఎంట్రీ ఉంటుంది. అయితే గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. భారత రాష్ట్రసమితిగా మార్చారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి హడావిడి చేశారు. ఇక అనేక రాష్ట్రాల్లో పార్టీ శాఖలను కూడా ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఆయన శాఖలను ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల కంటే ఆయన మహారాష్ట్రపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. తన సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ సరిహద్దు ప్రాంత ప్రజలు తమను తెలంగాణలో కలపమని అడుగుతున్నారని కూడా చెప్పారు. ఇక అనేక చోట్ల సభలను ఏర్పాటు చేశారు.

పెద్దయెత్తున జనసమీకరణ చేశారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నంతగా బిల్డప్ ఇచ్చారు. ఎన్నిసభలు.. ఎన్ని ర్యాలీలు..ఎంత హడావిడి.. దీనిని చూసి ఇక మనోడు జాతీయనేతగా అవతారమెత్తుతారని అందరూ కారు పార్టీ నేతలు భావించారు. మహారాష్ట్రపై ఆయన మక్కువ పెంచుకుని మరీ అక్కడ పాగా వేయాలని భావించారు. కొన్ని నియోజకవర్గాల్లోనైనా పోటీ చేసి విజయం సాధించి కీలక పార్టీగా మహారాష్ట్రగా ఎదగాలని బలంగా విశ్వసించారు. ఓటమి తర్వాత అన్ని రాష్ట్రాల్లో దాదాపు శాఖలన్నీ ఎత్తివేసినట్లే కనపడుతుంది. ముందు సొంత రాష్ట్రం తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఆ పనే మొదలు పెట్టలేదు. పెద్దాయన బయటకు రావడం లేదు.

పార్టీ వ్యవహారాలన్నింటినీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాత్రమే చూసుకుంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలకు హరీశ్ రావు ముందుంటున్నారు. అంతే తప్ప కేసీఆర్ జనంలోకి రాకుండానే కాలం నెట్టుకొస్తున్నారు. కాలమే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెంచుతుందన్న నమ్మకంతో ఉన్నట్లుంది. అందుకే ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. తన ఫామ్ హౌస్.. తన వ్యవసాయంపైనే ఫోకస్ పెట్టారు. ఎన్నికల సభలో చెప్పినట్లుగానే తనను ఓడిస్తే ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన కేసీఆర్ ఆయన చెప్పినట్లుగానే చేస్తున్నారు.

మహారాష్ట్ర ఎన్నికలు మరో వారంలో జరగనున్నాయి.అయితే మహారాష్ట్ర నేతలు ఎవరూ కేసీఆర్ వద్దకు రాలేదు. పోనీ ఈయన వారితో సంప్రదింపులు జరపడం లేదు. అంటే మహారాష్ట్ర ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండనుంది.. జాతీయ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా గులాబీ పార్టీ నేతలు ముందుకు రావడం లేదు. అంటే త్వరలోనే బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజల సెంటిమెంట్‌తో ఉండే పేరును తొలగించి పెద్ద తప్పు చేశామని గులాబీ పార్టీ నేతలే చెబుతుండటంతో త్వరలో మళ్లీ నామకరణానికి కేసీఆర్ రెడీ అవుతున్నారని తెలిసింది.

జాతీయ పార్టీ కాడికి వదిలేసినట్టనా

KCR survey results | కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ… | Eeroju news

Related posts

Leave a Comment