తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా పేరు పడింది. పార్టీ పుట్టినప్పటి నుంచి 1999, 2019 మినహా ప్రతి ఎన్నికలోనూ టిడిపినే ఇక్కడ గెలిచింది. పార్టీ కష్టాల్లో ఉన్న 2004,2009లో సైతం కొవ్వూరులో తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. అలాంటి చరిత్ర ఉన్న కొవ్వూరులో టీడీపీని చేజేతులా పార్టీ అధిష్టానమే నాశనం చేసుకుంటుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
పార్టీలో నేతలు చెరో దారి
కాకినాడ, జనవరి 10
తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా పేరు పడింది. పార్టీ పుట్టినప్పటి నుంచి 1999, 2019 మినహా ప్రతి ఎన్నికలోనూ టిడిపినే ఇక్కడ గెలిచింది. పార్టీ కష్టాల్లో ఉన్న 2004,2009లో సైతం కొవ్వూరులో తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. అలాంటి చరిత్ర ఉన్న కొవ్వూరులో టీడీపీని చేజేతులా పార్టీ అధిష్టానమే నాశనం చేసుకుంటుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కారణం అక్కడ పార్టీలో పెరిగిపోయిన వర్గ పోరు.. కుమ్ములాటలు.కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైనా అక్కడ శాసనం మాత్రం దొమ్మేరు దివాణందే. దొమ్మేరు జమీందార్లుగా పేరున్న పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు), ఆయన సోదరుడు అచ్చిబాబు చెప్పిన మాటే వేదంగా అక్కడ చెల్లుబాటు అయ్యేది. కృష్ణ బాబు ఐదుసార్లు కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొవ్వూరు ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. అప్పటి నుంచి టీవీ రామారావు, KS జవహర్, తానేటి వనిత (వైసీపీ), ముప్పిడి వెంకటేశ్వర రావు కొవ్వూరు నుంచి గెలిచారు. వీరి గెలుపు వెనుక ఉన్నది పెండ్యాల కుటుంబమే అన్నది బహిరంగ రహస్యం. దాదాపు 23 ఏళ్ళు MLA గా పని చేసిన చరిత్ర ఉన్న కృష్ణ బాబు అనూహ్యంగా 2012లో వైసీపీలో చేరారు. దీంతో కంగారుపడిన టిడిపి శ్రేణులకు ఆయన సోదరుడు అచ్చిబాబు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత ఎన్నికల్లో KS జవహర్ టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2019లో జగన్ హవాలో తానేటి వనిత కొవ్వూరులో గెలిచి హోం మంత్రి అయ్యారు. ఆ గెలుపు వెనక ఉన్నది కృష్ణ బాబు అల్లుడు రాజీవ్ కృష్ణ అని ఆయన వర్గం ప్రచారం చేసుకుంది. ఆ టైంలో వైసిపిలో రాజీవ్ కృష్ణ ఒక వెలుగు వెలిగారు.
అయితే 2024లో సీన్ మారింది. కూటమి ప్రభంజనంలో టిడిపి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి గెలిచారు. ఆ గెలుపునకు అచ్చిబాబు మద్దతు తోడ్పడింది. ఈ తరుణంలో కృష్ణబాబు మృతి చెందడం, ఆయన అల్లుడు రాజీవ్ కృష్ణ టిడిపి గూటికి చేరడం జరిగిపోయాయి. అయితే ఈ చేరిక తనకు తెలియకుండానే జరిగిందని స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తనను కలిసిన కార్యకర్తలతో చెప్పినట్టు తెలుస్తోంది. అటు అచ్చిబాబు కూడా అధిష్టానం వైఖరితో అలకబూనారు. 2019-24 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి అండగా నిలబడింది స్థానిక తెలుగుదేశం నాయకులు. అయితే తమకు తెలియకుండా రాజీవ్ కృష్ణను అధిష్టానం పార్టీలో చేర్చుకోవడంపై వారు మనస్థాపం చెందినట్టు చెబుతున్నారు. ఎవరైతే తమని ఇబ్బందులు పెట్టారో వాళ్లకి పార్టీలో పెద్దపీట వేయడం ఏంటనేది వారి వాదన. మరోవైపు అన్ని సర్దుకుంటాయని పార్టీ హై కమాండ్ భావిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆలా కనిపించడం లేదు. మొదటి నుంచి మాజీ మంత్రి జవహర్ను కొవ్వూరు టీడీపీలోని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు రాజీవ్ కృష్ణ, జవహర్ ఏకం అయ్యారు అనేది వారి వెర్షన్. రాజీవ్ కృష్ణ, జవహర్ ఆశీస్సులతో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు వెలియడాన్ని సాక్ష్యంగా చెబుతున్నారు. నిజానికి 2024లో కొవ్వూరు సీటు తనకే అని జవహర్ భావించారు. 2019 ఓటమి తర్వాత టిడిపిలో బలంగా వాయిస్ వినిపించిన వాళ్లలో ఆయన ఒకరు. కానీ గోపాలపురం నుంచి వచ్చిన ముప్పిడి వెంకటేశ్వరరావుకు అధిష్టానం ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతో జవహర్ సైలెంట్ అయ్యారు. అంతా చల్లబడింది అనుకున్న సమయంలో కొవ్వూరులో కొత్త గ్రూపులు బయలుదేరడం నియోజకవర్గంలో కుమ్ములాట్లకు కారణమైంది. వైసీపీని ఇబ్బందులు పెట్టాలనుకునే ప్రయత్నంలో ఆ పార్టీ నాయకులను ఆకర్షించి సొంత పార్టీలో కుమ్ములాట్లకు కారణం అవుతోంది అద్దిష్టానం అనేది కొవ్వూరు పరిస్థితులను గమనిస్తున్న వారి విశ్లేషణ. టిడిపి హై కమాండ్ మేల్కొని కొవ్వూరు గ్రూపు తగాదాలకు వెంటనే పుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ కంచుకోటగా ఉన్న కొవ్వూరు చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు.