Kakinada:ఎట్టకేలకు ప్రభల తీర్థానికి గుర్తింపు

prabala thirdham

Kakinada:ఎట్టకేలకు ప్రభల తీర్థానికి గుర్తింపు:నాలుగు శతాబ్ధాల నాటి ఉత్సవమది. ఎన్నో తరాల నుంచి సంప్రదాయంగా కొనసాగిస్తోన్న మహోత్సవం. నేటికీ ఏ మాత్రం తగ్గని భక్తిపారవశ్యం. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా జరిగే తీర్థమహోత్సవం. అదే జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం. లక్షల మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే ఈ ప్రభల తీర్ధమహోత్సవం ఎంతో ప్రత్యేకం. పచ్చని తీవాచీ పరిచినట్లుగా ఉండే కోనసీమ నేలపై జరిగే ఈ వేడుక చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలి వస్తారు.

ఎట్టకేలకు ప్రభల తీర్థానికి గుర్తింపు

కాకినాడ, ఫిబ్రవరి 20
నాలుగు శతాబ్ధాల నాటి ఉత్సవమది. ఎన్నో తరాల నుంచి సంప్రదాయంగా కొనసాగిస్తోన్న మహోత్సవం. నేటికీ ఏ మాత్రం తగ్గని భక్తిపారవశ్యం. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా జరిగే తీర్థమహోత్సవం. అదే జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం. లక్షల మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే ఈ ప్రభల తీర్ధమహోత్సవం ఎంతో ప్రత్యేకం. పచ్చని తీవాచీ పరిచినట్లుగా ఉండే కోనసీమ నేలపై జరిగే ఈ వేడుక చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలి వస్తారు. అద్భుత ఘట్టం కోసం ఎదురు చూస్తు ఉంటారు. ఇప్పుడు ఈ ఉత్సవం రాష్ట్ర పండుగగా మారబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్‌ ఛైర్మన్‌ పి.తేజస్వి ఈ మధ్య సమావేశమయ్యారు. జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలని ఓ నివేదిక అందించారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు ఆమె తెలిపారు. దీనిపై కోనసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంబాజీపేట మండల పరిధిలోకి వచ్చే జగ్గన్నతోట కేవలం ఖాళీ కొబ్బరి తోట మాత్రమే. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని కనుమ రోజున జరిగే ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఏకాశ రుద్రులుగా పిలిచే ప్రభలు అక్కడికి తరలిరాగా వారిని సమావేశపరిచి తిరిగి వెళ్లిపోవడమే ఈ తీర్ధమహోత్సవంలోని ప్రధాన ఘట్టం. కేవలం తీర్ధమహోత్సవం రోజునే అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు తరలి వస్తారు. ఇది నాలుగు శతాబ్ధాలుగా జరుగుతుండగా ఇక్కడికి తీసుకువచ్చే ప్రభలను భుజాలపై మోసుకురావడం, పంటచేలు, కౌశిక కాలువలను దాటించుకుంటూ రావడం మరో ప్రత్యేకం.. మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలంలో కనుమ నాడు కోనసీమలోని మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమం ప్రాచీనమైనది. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండదు. ఇది పూర్తిగా కొబ్బరితోట. ఈ ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశరుద్రుల కొలువు. హిందూధర్మశాస్త్రాల ప్రకారం.. ఏకాదశరుద్రులు ఒక్కచోటకొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా ఒక్కచోటే అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే అంటారు. లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్లు జగ్గన్నతోటలో సమావేశమై లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి. సుమారు 425 సంవత్సరాల క్రితం నుంచి ఈ సంప్రదాయం ఉందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17వ శతాబ్ధంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశమై లోక రక్షణ చేపట్టారని అంటారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతీ ఏటా కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీరాజావత్సవాయి జగన్నాధమహారాజుకు చెందిన ఈ తోట జగ్గన్నతోట అనే పేరుతో స్థిరపడింది.జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అరుదైన గుర్తింపు లభించింది. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఉత్సవ్’ విభాగంలో ఈవెంట్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో స్థానం దక్కింది. గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ ఏకాదశ రుద్రప్రభల తీర్థం విశిష్టతపై ప్రధాని నరేంద్ర మోదీ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్‌కు లేఖ రాయగా, కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, ఈ గుర్తింపునిచ్చింది. 2023 జనవరి 26న గణతంత్ర వేడుకల్లోనూ ఏకాదశ రుద్రప్రభల నమూనాను ఏపీ తరపున శకటంగా ప్రదర్శించారు.

Read more:Andhra Pradesh: ఏపీలో హాట్ పాలిటిక్స్

Related posts

Leave a Comment