వాటాలు ఇవ్వాల్సిందే జేసీ ప్రభాకరరెడ్డి హూకుం
అనంతపురం, అక్టోబరు 15, (న్యూస్ పల్స్)
JC Prabhakara Reddy
టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేకాట క్లబ్‌లు, ఇసుక వ్యాపారం చేసేవారు వారి సంపాదనలో 15 శాతం కమిషన్ ఇవ్వాలని హెచ్చరించారు. ఇదంతా నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించాలన్నారు. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి తాను 20 శాతం డబ్బులు ఖర్చు చేస్తానని, తనకు ఒక్క రూపాయి కూడా వద్దన్నారు. దశాబ్దాల నుంచి తాము రాజకీయాల్లో ఉన్నామని, ప్రజలు తమకు అండగా ఉన్నారని.. నియోజకవర్గ అభివృద్ధి ఇలాంటివి తప్పదన్నారు. వారితో పాటు మద్యం షాపు నిర్వాహకులు తనకు 35 శాతం కమిషన్ ఇవ్వాలని హుకూం జారీ చేయడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో తాడిపత్రి రాజకీయాలు వేరయా అంటున్నారు.ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడ్రిపత్రిలోకి రాలేకపోతున్నారు. మరోవైపు జేసీ వర్గీయులు నియోజకవర్గంలో కొత్త రూల్స్ పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు తాడిపత్రిలో లేకుండా ఉండాలంటూ గతంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అభివృద్ధి పేరుతో కమీషన్లు ఇవ్వాలని నేరుగా అడగడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అవుతోంది. కమిషన్లుగా తీసుకున్న డబ్బును తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయడం ఏంటని స్థానికులతో పాటు వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తాడిపత్రి నియోజకవర్గం కాస్త వెరైటీ అని చెప్పవచ్చు.
అక్కడ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. టీడీపీకి చెందిన నాయకులు, తన అనుచరులే ఇసుక దోచుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. పైగా ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కావడంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి. గడిచిన అయిదేళ్లుగా తనకు అండగా నిలిచిన నాయకులు, ఇప్పుడు తాడిపత్రిలో ఇసుకను అక్రమంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ తాను గ్రీన్ ట్రైబ్యునల్, హైకోర్టులు, అధికారుల చుట్టూ తిరిగి పోరాటం చేస్తే.. ఇప్పుడు తన అనుచరులే ఇసుక దందా చేస్తున్నారని వీడియో రిలీజ్ చేశారు.
తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు 2.5 లక్షల మంది ఉంటే, కేవలం 25 మంది ఇసుక దందా చేసి దోచుకుంటున్నారని జేసీ ప్రభాకకర్ రెడ్డి ఆరోపించారు. మీ దందా, ఇసుక అక్రమరవాణా మరెక్కడైనా చేసుకోండి, కానీ నా నియోజకవర్గంలో కనుక కనిపిస్తే మీ టిప్పర్ బండ్లు ఇక బయటకు కూడా రావని టిప్పర్ ఓనర్లను సైతం హచ్చరించారు. తాడిపత్రిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లపై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేశారు.
అయితే తమకు విషయం వదిలేస్తే, చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని, ఎప్పుడేం చేయాలేం మీరు చెబుతారా అని సీఐ అడగటంతో వివాదం మొదలైంది. అది చివరికి సీఐ వర్సెస్ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిగా మారింది. సీఐకి మద్దతు తెలిపాల్సిన పోలీసు ఉన్నతాధికారులు సైతం అందుకు భిన్నంగా సీఐతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి క్షమాపణలు సైతం చెప్పించారు. దాంతో రాష్ట్రంలో ఇది సపరేట్ నియోజకవర్గం అని తాడిపత్రిపై మరోసారి చర్చ జరుగుతోంది.