జనసేనకు పెరిగిన గ్రాఫ్….
కాకినాడ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్)
Janasena
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయంగా డిమాండ్ పెరుగుతుంది. వైసీపీ నుంచి నేతలు పెద్దయెత్తునచేరేందుకు సిద్ధమయ్యారు. జనసేన గేట్లు తెరిస్తే చాలు.. ఇక పోలోమంటూ దూసుకు రావడానికి లీడర్లు సిద్ధంగా ఉన్నారు. ఎవరు ముందు చేరాలన్న తపన వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. అందుకే జనసేనకు డిమాండ్ పెరిగింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆచితూచి చేరికల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. చేరికల విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా, నేతల ట్రాక్ రికార్డును కూడా తెప్పించుకుని లోతుగా పరిశీలించిన తర్వాతనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలిసింది. చేరికల విషయంలో పవన్ కల్యాణ్ కొన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఆ నేత ఏదైనా పెద్దపదవులు నిర్వహించారా? నిర్వహించి ఉంటే ఆ శాఖలో ఏదైనా అవినీతికి పాల్పడ్డారా? అందులో నిజానిజాలు ఎంత? అన్నది కూడా నివేదికలు తెప్పించుకున్నారట. అవినీతి మాత్రమే కాదు.. క్యాడర్ తో పాటు ప్రజల్లో బలంగా ఉన్న నేతలను మాత్రమే తీసుకోవాలన్నది పవన్ కల్యాణ‌్ ఫైనల్ నిర్ణయంగా తెలుస్తుంది. ఆ నేత కారణంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలపడుతుందన్న నమ్మకం ఉంటే వెంటనే ఓకే చెబుతున్నారని, లేకుంటే నియోజకవర్గానికే పరిమితమైన నేత అయితే మాత్రం కొంత వెయిట్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు నేతలను చేర్చుకుంటే ఆ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు అంటే మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఇబ్బంది పడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది.
ప్రధానంగా కూటమి పార్టీల మధ్య నేతల చేరికతో ఇబ్బందులు తలెత్తదని భావిస్తేనే ఆయన ఓకే చెబుతున్నారు. అది కూడా సరైన నేత అయితేనే కండువా కప్పేందుకు అంగీకరిస్తున్నారు. లేకుంటే తర్వాత చూద్దామని దాటవేస్తున్నారు. తోట త్రిమూర్తులు చేరికపై కూడా నిర్ణయం తీసుకోకపోవడానికి ఆయనపై ఉన్న కేసులతో పాటు, ఆయన పట్ల టీడీపీ నేతలు స్థానికంగా వ్యతిరేకం వ్యక్తం చేయడంతోనే ఆయన జనసేనలో చేరిక నిలిచిపోయిందని చెబుతున్నారు. భారీ ప్రాజెక్టు మంజూరు ఇక్కడి నుంచే చేరికలు… జనసేనలో చేరేందుకు వైసీపీ నుంచి ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలు ఆసక్తిక కనపరుస్తున్నారు.
ఇటు రాయలసీమలోనూ కొందరు నేతలు పవన్ ఓకే అంటే రెడీ ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారట. అక్కడ బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి డిమాండ్ అధికంగా ఉందంటున్నారు. అయితే కండువా కప్పుతున్న ఏ నేతకు కూడా పార్టీ టిక్కెట్ ఇస్తానని మాత్రం పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడం లేదు. అదే సమయంలో పార్టీలో గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. అలాగే పార్టీ పరమైన పదవులు ఇచ్చేందుకు ఆయన సిద్ధపడుతున్నారు తప్పించి నియోజకవర్గంలో తలనొప్పులు తెచ్చే కార్యక్రమాలు చేపట్టవద్దని కూడా పవన్ ముందుగానే నేతలకు చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారట. మొత్తం మీద మరి కొద్ది రోజుల్లోనే సెకండ్ లిస్ట్ లో కొందరు వైసీపీ నేతలు జనసేనలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.