కాంగ్రెస్ కు దగ్గరవుతున్న జగన్
విజయవాడ, జూలై 24 (న్యూస్ పల్స్)
Jagan is getting closer to Congress
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకు అండగా నిలబడే ఓ పార్టీ కోసం చూసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఆయన సేఫ్ గేమ్ ఆడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ, జనసేనలతో కలిసిపోవడంతో తనను ఇబ్బంది పెడుతుందని తాను ఎంత లాయల్ గా ఉన్నా వదలబోరని అనుకుంటున్నట్లగా తెలుస్తోంది. అందుకే ప్రత్యేకహోదా అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ మాత్రం బహిరంగంగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడటం లేదు.
కానీ వచ్చే కొద్ది రోజుల్లో జగన్ పై కేసుల విచారణ ఊపందుకోవడం.. వివేకా హత్య కేసులోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే తనపై కొత్త విచారణలు జరిగే అవకాశం ఉందని కూడా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ అండ తనకు అవసరమని నమ్ముతున్నగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలకు ముందు రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ప్రత్యేకహోదా కావాలని అడిగిందని జైరాం రమేష్ ప్రచారం చేశారు.
హోదా కోసం వైసీపీ ప్రయత్నిస్తోందని చెప్పేందుకు ప్రయత్నించారు. వైసీపీకి ఆయన పబ్లిసిటీ చేసి పెట్టారు. మరో వైపు గతంలో రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ రాజ్యసభలో ప్రసంగించే విజయసాయిరెడ్డి ఇప్పుడు పల్లెత్తు మాట అనడం లేదు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు.. ఏపీలో షర్మిలను కాంగ్రెస్ తో కలపకుండా.. ఆమె చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఇక్కడే అసలు రాజకీయం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ ఢిల్లీ పర్యటనకు ఎంచుకున్న అంశం జాతీయ రాజకీయాలకు సంబంధం లేనిది కానీ మోదీని కలుస్తానని జగన్ చెబుతున్నారు. అపాయింట్మెంట్ అడిగారు. కానీ తమ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై కలుస్తానంటే మోదీ సమయం ఇవ్వడం కష్టమేనని భావిస్తున్నారు.
రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు ఇచ్చే అవకాశం ఉంది. జగన్ పై సీబీఐ కేసుల్లో విచారణలకు సమయం దగ్గర పడింది. వివేకా హత్య కేసులో సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తే.. ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. తాజాగా ఇసుక, మద్యం స్కాముల్లో ఈడీ, సీబీఐ విచారణలకు రంగం సిద్ధమయిందని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం అవినీతిని బయట పెట్టి సీబీఐ, ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కారణంగానే జగన్ తొందరపడుతున్నారని అంటున్నారు.
ఢిల్లీలో కలసి వచ్చే పార్టీలని కలుపుకోవాలని జగన్ తన పార్టీ ఎంపీలకు చెప్పారు. జగన్ కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతుంది. బీఆర్ఎస్ ను పక్కన పెడితే జాతీయ స్థాయిలో వైసీపీ దగ్గరకు వచ్చి మద్దతు పలికేవారు లేరు. జాతీయ రాజకీయాలకు జగన్ చాలా దూరంగా ఉంటూ వచ్చారు. ఈ కారణంగా ఆయనకు ఢిల్లీలో మిత్రులు లేరు. కానీ కలసి వచ్చే పార్టీల మద్దతు కోరుతామని అంటున్నారు. బహుశా అది ఇండియా కూటమిలోని పార్టీలే అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరైనా ప్రతినిధి వచ్చి జగన్ కు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ విషయం గుర్తించే షర్మిల ప్రెస్ మీట్ పెట్టి .. తీవ్రంగా విమర్శించారు. జగన్ కాంగ్రెస్ కు దగ్గర అయితే ఎక్కువగా నష్టపోయేది షర్మిలనే. అసలు ఏపీలో రాజకీయ హింస లేదని వారి పార్టీ నేతలే చంపుకున్నారని ఆమె తేల్చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో చేయబోయే ధర్నాకు ఇండియా కూటమిపార్టీలు వచ్చి మద్దతిస్తే రాజకీయం సమూలంగా మారినట్లే అనుకోవచ్చు. బీజేపీకి ఆయన ఎదురెళ్లాలని డిసైడయ్యారని భావించవచ్చు. ఆ తర్వతా ఆయన క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నా..తనకు సపోర్టుగా ఇతర పార్టీలు ఉంటాయని జగన్ ధైర్యంగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా జగన్ రాజకీయం ఇప్పుడు ఏదో వైపునకు మొగ్గాల్సిన పరిస్థితికి వచ్చిందని అనుకోవచ్చు.
Congress support for Jagan… Jairam Ramesh | జగన్ కు కాంగ్రెస్ మద్దతు… | Eeroju news