Jagan is alone in Delhi | ఢిల్లీలో జగన్ ఒంటరి | Eeroju news

Jagan is alone in Delhi

ఢిల్లీలో జగన్ ఒంటరి

విజయవాడ, జూలై 22 (న్యూస్ పల్స్)

Jagan is alone in Delhi

ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరిగిపోతున్నాయని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎంపీలతో సమావేశం అయిన ఆయన కలసి వచ్చే పార్టీల మద్దతు కోసం ప్రయత్నించాలని కోరారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి ఢిల్లీలో మద్దతుగా వచ్చే పార్టీలు పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోనహన్ రెడ్డి ఇంత కాలం అనుసరిస్తున్న వ్యూహమే అనుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉన్నారు.

మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో నేరుగా ఒక్క సారి కూడా పొత్తులు పెట్టుకోలేదు. ఓ సారి వైసీపీ నేరుగా  బీజేపీకి పొత్తుల ఆఫర్ ఇచ్చినప్పటికీ వర్కవుట్ కాలేదన్న ప్రచారం ఉంది . అయితే బీజేపీని ఎప్పుడూ వైసీపీ దూరం చేసుకోలేదు. తమకు ఉన్న ఎంపీల బలం ఎప్పుడు బీజేపీకి అవసరమైతే అప్పుడు ఇస్తూ వచ్చారు. కానీ బీజేపీ టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది.  2014, 2024 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి విజయాలు అందుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఈ కూటమి పోటీ చేసినా.. సరే.. జగన్ బీజేపీని కాదనలేకపోతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయన అదే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ.. మోదీకి తనపై అభిమానముందని చెప్పుకోవడానికి ఆయన ప్రాధాన్యమిస్తున్నారు.

ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. జనసేన ఉంది. ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి మద్దతివ్వడం నైతికంగా కరెక్ట్ కాకపోయినా జగన్ అదే బాటలో ఉన్నారు. ఈ కారణంగా ఇండియా కూటమిలో పార్టీలతో ఆయనకు సాన్నిహిత్యం లేదు. కాంగ్రెస్ పార్టీపై ఆయన గతంలో తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి..  రాహుల్ గాంధీపై లేనిపోని ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లోనూ విమర్శలు చేశారు. ఈ కారణంగా జగన్ తో పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అంత ఆసక్తిగా లేదు. ఆయనకు మద్దతిచ్చే అవకాశం లేదు. ఇక ఇండీ కూటమిలో ఇతర పార్టీలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవు. ఈ కారణంగా ఆయనకు ఇండీ కూటమిలోని పార్టీలు కూడా మద్దతిచ్చే అవకాశాలు లేవు.

ఢిల్లీలో ధర్నా చేస్తున్న తమకు మద్దతివ్వాలని జగన్ ఇతర పార్టీలను అడిగే పరిస్థితి లేదు. ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నానని చెప్పి ఇండీ కూటమి నేతల్ని ఆహ్వానించవచ్చు. కానీ వారు వస్తానన్నా జగన్ ధైర్యం చేసే పరిస్థితి లేదు. వస్తానన్నా వద్దనే అంటారు. తాను ఇండీ కూటమికి దగ్గరవుతున్నానని అనిపిస్తే వచ్చి పడే ప్రమాదల గురించి జగన్ కు బాగా తెలుసు. అందుకే ఇండియా కూటమి పార్టీలను మద్దతివ్వాలని ఆయన కోరే అవకాశం లేదు. ఎవరైనా వస్తానన్నా వద్దనాల్సిన దుస్థితి ఆయనకు ఉంది. అలాగని ఎన్డీఏ పార్టీ నేతల్ని ఆహ్వానించినా  రారు. ఎందుకంటే.. ఆయన ధర్నా చేస్తోంది.. ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా.

ఏపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి.. కేంద్ర ప్రభుత్వలో టీడీపీ కూడా భాగస్వామి. అందుకే ఎన్డీఏ నుంచి సపోర్ట్ రాదు.. ఇండీ కూటమి నుంచి వచ్చినా తీసుకోలేరు. ఇక తటస్థ పార్టీలతో అసలు వైసీపీకి సంబంధాలు లేవు. ఆ మగిలిన తటస్థ పార్టీలు కూడా వైసీపీలాగే ఉంటాయి. ఒడిషాలో బిజూ జనతాదళ్ పార్టీ నేతలు ఎవరికీ మద్దతు తెలుపరు. బీఆర్ఎస్ పార్టీ నేతలు సంఘిభావం తెలిపే అవకాశం ఉంది. దాని వల్ల ప్రయోజనం కంటే రాజకీయంగా నష్టమే ఎక్కువ ఉంటుంది. చిన్నా చితకా పార్టీలు ఎమైనా మద్దతిచ్చినా ఎవరూ పట్టించుకోరు. జగన్ కు ఉన్న పరిమితుల వల్ల జాతీయ రాజకీయాల్లో.. ఢిల్లీలో తనకు మద్దతుగా ఎవరైనా ఉంటారని వైసీపీకి నమ్మకం లేకపోతోంది.

 

Jagan is alone in Delhi

 

Jagan’s plan to center Delhi | ఢిల్లీ కేంద్రంగా జగన్ ప్లాన్… | Eeroju news

Related posts

Leave a Comment