తెలంగాణలోనూ..బుల్డోజర్ పాలిటిక్స్
హైదరాబాద్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్)
In Telangana too bulldozer politics
ఉత్తర ప్రదేశ్ లో అన్యాయాలకు పాల్పడిన వారిపై, అక్రమాలు చేసిన వారిపై, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి బుల్డోజర్ ప్రయోగించారు. బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి చెందారు. యోగి మార్క్ బుల్డోజర్ న్యాయం పై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. తీవ్రంగా దుయ్య బట్టింది. కానీ ఇప్పుడు అదే మార్క్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సి వస్తోంది. వెనుకటి రోజుల్లో అయితే ప్రభుత్వ భూములను ఆక్రమించాలంటే భయపడేవారు. ఎదుటివారి ఆస్తులను తమ పేరు మీద అక్రమంగా బదిలీ చేయించుకోవాలంటే వణికే వారు. చివరికి చెరువుల వైపు కన్నెత్తి చూసేవారు కాదు. నాలాల వైపు చూపు కూడా తిప్పే వారు కాదు. కానీ ఇప్పుడు అలా లేదు.. అక్రమాలు పెరిగిపోయాయి.
అన్యాయాలు సర్వసాధారణమయ్యాయి. ఆక్రమణలు నిత్య కృత్యమయ్యాయి. చెరువులు, కుంటలు, నాలాలు, పక్క వాడి స్థలాలు.. ఇలా అన్ని అన్యాక్రాంతమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ అక్రమాలు తారస్థాయికి చేరాయి. దీంతో వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. చెరువులు ఆక్రమణకు గురి కావడంతో వరద నీరు వెళ్లేదారి లేక హైదరాబాద్ నగరం మొత్తం చిన్నపాటి ద్వీపకల్పాన్ని తలపిస్తోంది.ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇప్పటివరకు హైదరాబాదులో హైడ్రా ఆధ్వర్యంలో దాదాపు 70 భవనాలను పూర్తిగా నేలమట్టం చేశారు.
శ్రీమంతులు ఎక్కువగా సంచరించే ఓ ఆర్ ఓ, ఎస్వోఎస్ స్పోర్ట్స్ విలేజ్ లోని 12కి పైగా కట్టడాలతో పాటు 50 భవనాలను నేలమట్టం చేశారు. అంతేకాదు ఎఫ్టీఎల్ పరిధిలో ఒక సంస్థ భారీ వెంచర్ వేస్తే.. అందులో ఫ్లాట్లను కొంతమంది కొనుగోలు చేశారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టారు. వాటిని కూడా హైడ్రా అధికారులు కూల్చేశారు.మొయినాబాద్ మండలం అప్పాజిగూడ, చిలుకూరు, గండిపేట మండలం ఖానాపూర్ గ్రామాల్లో అప్పటి భారత రాష్ట్ర సమితి సర్పంచ్ లు భూములు కేటాయిస్తూ అనుమతి పత్రాలు ఇచ్చారు. అయితే ఆ సర్పంచ్ లు 2009 నాటి తేదీలతో వాటిని జారీ చేశారు. అందులో కొంతమంది నిర్మాణాలు చేపట్టారు. అయితే ఆ సర్పంచ్ లు ఇచ్చిన పత్రాలు మొత్తం నకిలీవని తేల్చిన హైడ్రా అధికారులు.. ఆ నిర్మాణాలను పడగొట్టారు.
గండిపేట చెరువులో చేపట్టిన నిర్మాణాలను కూడా పడగొట్టారు. ఈ ప్రాంతంలో మాజీ మంత్రులకు, ఇతర రాజకీయ నాయకులకు భారీ భవనాలు ఉన్నాయని హైడ్రా అధికారులు గుర్తించారు. హిమాయత్ సాగర్ లోనూ ఇదే స్థాయిలో నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. వాటిని కూడా పడగొట్టే పనిలో ఉన్నారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఖానాపురం పోచమ్మ ఆలయం వద్ద చేపట్టిన హోటల్ నిర్మాణాన్ని కూల్చేశారు. ఖానాపూర్ చెరువు శివారులో ఐదు ఎకరాల ఓఆర్వో స్పోర్ట్స్ విలేజ్ లో చేపట్టిన నిర్మాణాలను పడగొట్టారు. అయితే ఈ నిర్మాణాలను సుమారు 12 సంవత్సరాల క్రితం చేపట్టారు. ఇందులో ఫంక్షన్ హాల్, పిల్లల గేమ్ జోన్ ఉన్నాయి.
70 భవనాలు కూల్చివేత
హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 70 భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. నిన్న గండిపేటలోని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించారు. ఒక్క గండిపేటలోనే 20కి పైగా భవనాలను కూల్చేశారు. చందానగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లిలోని ఎర్రకుంటలో 3, గాజులరామారంలో 42 భవనాలను నేలమట్టం చేశారు. చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు అధికారులు.