ఇసుక ఫ్రీ అయితే… కానీ కండిషన్స్ పై క్లారిటీ
విజయవాడ, జూలై 6, (న్యూస్ పల్స్)
If sand is free but clarity on conditions
ఏపీలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 8నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అందుబాటులోకి రానుంది. అయితే ఇసుకను ప్రజలు ఎలా పొందాలనే దానిపై మాత్రం ఇంకా స్ఫష్టత రాలేదు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ధరలు చుక్కలనంటుతున్నాయి. యూనిట్ లేదా టన్ను ధర గరిష్టంగా రూ.10వేలు పలుకుతోంది. ధర చెల్లించడానికి సిద్ధమైనా గత నెల రోజులుగా మార్కెట్లో ఇసుక దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలనే నిర్ణయం తీపికబురే అయినా దాని ఫలితాలు ప్రజలకు ఏ మేరకు అందుతాయనేదే ప్రశ్నార్థకం. రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉంది.
ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా నది పరివాహక ప్రాంతాల్లోని ఇసుకే రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఆధారంగా ఉంటోంది. గత ఐదేళ్లలో ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో లెక్కిస్తే ఇదంతా వేల కోట్ల కుంభకోణంగా మారింది. దశల వారీగా చేతులు మారుతూ వినియోగదారుడికి వచ్చేసరికి భారీగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం ఇసుక రెండు రకాలుగా ప్రజలకు చేరుతోంది. నదీ తీరాలు, డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తవ్వి రీచ్‌ల నుంచి నేరుగా స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి ప్రవాహం లేనపుడు నేరుగా తవ్వుకుని అమ్మేస్తున్నారు. గత ఐదేళ్లలో టన్నుకు రూ.475 చొప్పున ఇసుకను విక్రయించారు. ఇప్పుడు ఇసుక ఉచితం అంటున్నా దాని ప్రయోజనాలు ప్రజలకు ఏ మేరకు అందుతాయనే సందేహాలు ఉన్నాయి.
ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల నుంచి కస్టమర్‌కు చేరేలోపు దాని ధర విపరీతంగా పెంచేస్తున్నారు.
పట్టణాలు, కార్పొరేషన్లకు దూరంగా ఇసుక రీచ్‌లు ఉండటంతో ఇసుక విక్రేతలు చెప్పిన ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం విజయవాడలో టన్ను ధర రిటైల్ మార్కెట్లో రూ.9-10వేలు పలుకుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందించినా దాని ధర రూ.3-4వేలకు తగ్గించకూడదని సిండికేట్లు భావిస్తున్నాయి. రవాణా, డీజిల్, డ్రైవర్ జీతాలు, వాహనం తరుగుదల ఇలా రకరకాల లెక్కలు వేసి ఇసుక అమ్మకాల్లో కనీస లాభం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సామాన్య ప్రజలు, భవన నిర్మాణదారులు నేరుగా ఇసుకను తవ్వుకుని, నిర్మాణాలు జరిగే ప్రాంతానికి తరలించుకునే అవకాశం ఉండదు. దానికి మరొకరి మీద ఆధార పడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆన్లైన్లో ఇసుకను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామని చెబుతున్నాఅది ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనేది ప్రశ్నార్థకమే. ఇసుకను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినా ఏదో రూపంలో దాని మీద సంపాదించేందుకు ఇప్పటికే దళారుల ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇలా చేస్తే మేలు…
ప్రస్తుతం ఇసుక విక్రయాల్లో ఉన్న లోపాలను సవరించాలి. ఉచిత ఇసుక ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు నేరుగా ప్రజలకే అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్లైన్లో విక్రయించే ఇసుకను నేరుగా ఎవరైనా ఆంక్షలు లేకుండా బుక్ చేసుకునే సదుపాయం కల్పించాలి. రవాణా ఛార్జీలను ప్రభుత్వమే నిర్ణయించాలి. స్టాక్ పాయింట్ లేదా రీచ్ నుంచి ఎంత దూరానికి ఎంత చెల్లించాలనే ధరను పట్టణాలు, మునిసిపాలిటీలు, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల వారీగా ధరలను నిర్ణయించాలి. ఇసుక బుక్ చేసుకున్న తర్వాత గరిష్టంగా 24 గంటల్లోగా డెలివరీ జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇసుక తరలింపులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించాలి.
ఇసుకను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు విధించడంతో పాటు వాటిని సక్రమంగా పాటించాలి.
పట్టణాలు, కార్పొరేషన్లకు సమీపంలో ఉండే ప్రభుత్వ స్థలాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా రవాణా భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ఆన్లైన్లో ఇసుకను పొందే వ్యవస్థ మీద పక్కాగా నిఘా ఉంచాలి. ఎవరైనా స్వేచ్ఛగా ఇసుకను పొందే అవకాశం కల్పిస్తూనే దానిని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారనే నిబంధనను బుకింగ్ సమయంలోనే స్ఫష్టం చేయాలి. స్టాక్ పాయింట్లలో గుత్తాధిపత్యం లేకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నడిపే ప్రీపెయిడ్ ఆటో వ్యవస్థల తరహాలో టోకెన్ డెలివరీ మెకానిజం ఏర్పాటు చేయాలి. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను నిర్ణయించే అధికారం ప్రభుత్వమే తీసుకోవాలి.
ఇసుక రవాణా ద్వారా దళారులు లబ్ది పొందకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే మార్గంగా ఉపయోగిస్తే ఎక్కువ మందికి లబ్ది కలుగుతుంది. ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందని అధికారులను సిఎం ప్రశ్నించారు. ప్రస్తుతం 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో ఇసుక అందుబాటులో ఉంది. దీనిని పక్కదారి పట్టకుండా ప్రజలకు అందిస్తే ఏపీలో ఐదేళ్లుగా కుదేలైన నిర్మాణ రంగం గాడిన పడుతుంది.
Ministers are free for TDP | మంత్రులకు టీడీపీ ఫ్రీ హ్యాండ్ | Eeroju news