ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా…
హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్)
Hyderabad
కబ్జాలకు గురైన చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వివిధ ప్రభుత్వం సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లను పరిశీలించారు. అందులోని చెరువులు, నాలాల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై సమీక్షించారు.
గొలుసు కట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మహానగరంలో అసలు ఎన్ని చెరువులుండేవి?. ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే లెక్కలు తేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చెరువులను గుర్తించేందుకు సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో హైడ్రా అధికారులు సమీక్ష చేపట్టారు. సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం హైడ్రా అధికారుల బృందంతో వెళ్లారు కమిషనర్ రంగనాథ్.సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌లను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 1971-72 సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ? చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉండేవి ? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి? నాలాలు ఎలా.. ఎంత విస్తీర్ణంలో ఉండేవి ? ఇప్పుడు ఎంత మేర కబ్జా అయ్యాయి అనే అంశాలను మ్యాప్‌ల ద్వారా పరిశీలించారు. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లతో పాటు.. నేటి పరిస్థితిని సరిపోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా కమిషనర్‌కు వివరించారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు.
ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాతో.. సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని క్రోఢీకరించి చెరువులు, నాలాల పరిస్థితి, కనుమరుగైన చెరువులపై అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చెరువులను ఆక్రమించి కట్టిన మరిన్ని కట్టడాలను హైడ్రా కూల్చివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.