తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 26వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈలోపే అర్హులను గుర్తించే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది.
కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రంగం
హైదరాబాద్, జనవరి 18
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 26వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈలోపే అర్హులను గుర్తించే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా…. జిల్లాల వారీగా కొత్త కార్డులకు ఎవరు అర్హులుగా ఉన్నారనే దానిపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ప్రాథమిక వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిసింది.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో అనేక మంది దరఖాస్తులు ఇచ్చారు. నిర్ణీత ఫామ్ లో కాకుండా… తెల్ల కాగితంపైనే రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ఇచ్చారు. అయితే వీటి విషయంలో సర్కార్ నుంచి అధికారికంగా క్లారిటీ రాలేదు. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో మాత్రం….సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో సరికొత్త పద్ధతిలో కొత్త రేషన్ కార్జుల జారీ ప్రక్రియ షురూ కానుంది.గత కొద్ది రోజుల కిందటే రాష్ట్రవ్యాప్తంగానూ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు.
అయితే ఈ వివరాల ఆధారంగా… పౌరసరఫరాల శాఖ ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాదాపు 6 లక్షలకుపైగా కుటుంబాలు కొత్త కార్డులకు అర్హమైనవిగా గుర్తించింది. ఈ జాబితాలు ఇప్పటికే జిల్లాలకు చేరినట్లు తెలిసింది.పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసిన ప్రాథమిక జాబితాలను జిల్లా అధికారులు పరిశీలిస్తారు. గ్రామాలవారీగా లిస్టులను పంపుతారు. ఈ జాబితాలను గ్రామసభల ముందు ఉంచుతారు. పట్టణాల్లో అయితే బస్తీ సభల్లో ఉంచుతారు. ఇక్కడ లిస్ట్ ను చదివి వినిపించి…. ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. ఈ ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈ లిస్టులను జిల్లా కలెక్టర్లకు చేరుతాయి. కలెక్టర్లు పంపే లిస్ట్ ఆధారంగా పౌరసరఫరాల శాఖ… కొత్త కార్డులను మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ జనవరి 26న నుంచి ప్రారంభమవుతుంది.ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు మార్పు చేర్పుల దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పెళ్లి అనంతరం పుట్టింటి కార్డులో పేరు తొలిగించి, అత్తింటి కార్డుల్లో పేర్లు జోడించాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటి విషయంలో కూడా సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రేషన్ కార్డుల డిజైన్ సైతం మారనుంది. గతంలో ఎలక్ట్రానిక్ రూపంలో కార్డులు జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తెలుస్తోంది.