Hyderabad:కారు కదిలేది ఎన్నడూ:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రాకపోతే పార్టీ మరొకసారి అధికారంలోకి రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఫాం హౌస్ కు మాత్రమే పరిమితమవుతూ క్యాడర్ ను నిరాశలోనే ఉంచుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగి ఏడాదికిపైగానే అవుతున్నప్పటికీ ఇంకా ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కాకపోవడంతో ఆయనలో మార్పు ఇక వస్తుందని ఇటు క్యాడర్, అటు ప్రజలు నమ్మేందుకు అవకాశం లేదు.
కారు కదిలేది ఎన్నడూ..
హైదరాబాద్, మార్చి 4
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రాకపోతే పార్టీ మరొకసారి అధికారంలోకి రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఫాం హౌస్ కు మాత్రమే పరిమితమవుతూ క్యాడర్ ను నిరాశలోనే ఉంచుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగి ఏడాదికిపైగానే అవుతున్నప్పటికీ ఇంకా ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కాకపోవడంతో ఆయనలో మార్పు ఇక వస్తుందని ఇటు క్యాడర్, అటు ప్రజలు నమ్మేందుకు అవకాశం లేదు. ఏడాది నుంచి అప్పుడప్పుడు ఎన్నికలప్పుడు తప్పించి ఆయన జనంలోకి రాలేదు. గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పడు కేసీఆర్ చేసిన తప్పిదాలే పార్టీకి శాపంగా పరిణమించాయని చెబుతున్నారు.నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నా ఆయన మాత్రం జనంలోకి రావడానికి ఇష్టపడటం లేదు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమిని ఊహించలేదు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని బలంగా నమ్మారు. రాష్ట్ర ఖజానాకు భారంగా పరిణమించినా అనేక పథకాలను ఆయన తీసుకు వచ్చి ప్రజల మనసును గెలుచుకోవచ్చని భావించారు.
కానీ జనం ఆయనను నమ్మేలేదు. కేవలం సంక్షేమ పథకాలను చూసి మాత్రమే ఓట్లు వేయరన్న విషయం ఎన్నికల అనంతరం తెలిసి వచ్చింది. ఆయన వ్యవహార శైలి ఓటమికి ప్రధాన కారణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా బయటకు రాకపోవడంతో పాటు వారిని కలిసేందుకు ఇష్టపడక పోవడంతో జనం తమ ఓటుతో తీర్పు చెప్పారు.. అయినా నేటికీ ఆయనలో మార్పు రాలేదు. జనంలో ఉండి వారి సమస్యలను వింటేనే దగ్గరవుతారు. ఏడాది వరకూ వెయిట్ చేశారంటే ఓకే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతున్నా ఫాం హౌస్ గడప దాటకపోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. అదిగో వస్తారు.. ఇదిగో వస్తారంటూ గులాబీ పార్టీకి చెందిన పత్రికల్లో కథనాలు రావడం మినహా ఆయన మాత్రం బయటకు తొంగి చూడటం లేదు. దీంతో పాటు అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేసిన కుటుంబ సభ్యులే ఇప్పుడు కూడా పార్టీలో కీలకంగా మారడం కూడా కొన్ని సామాజికవర్గాల వారికి మింగుడు పడటం లేదు. ఇప్పటికైనా కేసీఆర్ తన వైఖరిని మార్చుకుని పార్టీలో కొంత మార్పులు తెచ్చి, తాను మారితే తప్ప గెలుపు గురించి ఆలోచించకూడదని ఆ పార్టీ నేతలు డిసైడ్ అయినట్లే కనపడుతుంది.
Read more:Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం