అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు…
విజయవాడ, ఆగస్టు 21 (న్యూస్ పల్స్)
Huge donations to canteens
పేదలకు ఆకలి తీర్చాలన్న మంచి ఉద్దేశంతో ఏపీలో మళ్లీ అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15న గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అక్కడే పేదలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. మరుసటి రోజు… రాష్ట్ర వ్యాప్తంగా మరో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. మొత్తం 200 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. తొలివిడతలో వంద వరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలినవి… త్వరలోనే ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి ఒక రోజు భోజనం ఖర్చు 96 రూపాయలు అవుతుందని ప్రభుత్వం తెలిపింది.
దీన్ని కేవలం 15 రూపాలయకే పేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తోంది. మిగిలిన డబ్బును ప్రభుత్వమే భరిస్తోంది. అందుకోసమే… దాతలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదలకు తక్కువ ఖర్చుకే భోజనం అందించే ఈ మంచి పనులో భాగస్వాములు కావాలని… అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించాలని కోరారు. చంద్రబాబు పిలుపుతో…. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కూడా తన స్థాయికి తగ్గట్టు విరాళాలు అందజేస్తున్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. చెక్‌ను… మంత్రి నారా లోకేష్‌కు స్వయంగా అందజేశారు. గోకరాజు గంగరాజు చేయూతకు, ఉదారతకు ధన్యవాదాలు తెలిపారు లోకేష్. మెరుగైన ఆంధ్రప్రదేశ్‌కు బాటలు వేసేందుకు కలిసి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
టీడీపీ నేత శిష్టా లోహిత్ అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. లోహిత్ కూడా కోటి రూపాయల చెక్‌ను నారా లోకేష్‌కు అందించారు. ఇప్పటికే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా కోటి రూపాయల విరాళం అందజేశారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు తన వంతుగా 25వేల రూపాయల విరాళం అందించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తన నియోజకవర్గంలోని రెండు అన్న క్యాంటీన్లలో భోజనం ఖర్చు భరిస్తానంటూ ముందుకొచ్చారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు తన జీతం నుంచి 30వేల రూపయాలను అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.
అన్న క్యాంటీన్లకు విరాళాలు అందజేసి మెరుగైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అందరూ సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలు కోరుతూ… ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించారు. ఎస్బీఐ అకౌంట్ నెంబర్ 37818165097, IFIC కోడ్: SBIN0020541కు అందించాలన్నారు. వెబ్సైట్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చని చెప్పారు. అయితే… అన్న క్యాంటీన్ల విరాళాల కోసం ఒకే బ్యాంకు ఖాతా ఉండాలని ప్రభుత్వం భావించింది. విరాళాలు ఇవ్వదలచిన వారు.. SBI బ్యాంక్ అకౌంట్‌కు తోచినంత ఆర్ధిక సాయం చేయొచ్చు. ప్రభుత్వానికి నేరుగా విరాళాలు అందించలేని వారు… ఆన్లైన్ ద్వారా… చెక్కుల రూపంలో జమ చేయొచ్చని చెప్పారు.
ఇక.. ప్రజాప్రతినిధులు అన్న క్యాంటీన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పేదలకు సక్రమంగా, నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని ఆరా తీస్తున్నారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంలోని బస్టాండ్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్‌ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత… పేదలతో కలిసి భో్జనం చేశారు. 20 రూపాయలకు కాఫీ, టీ కూడా రాని ఈ పరిస్థితుల్లో.. పేదలకు 5 రూపాయలకే మంచి భోజనం పెట్టడం మామూలు విషయం కాదన్నారు పెమ్మసాని. నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని పేదలకు అందిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారాయన.