చింతూరు లో భారీ వర్షాలు
చింతూరు
Heavy rains in Chintoor
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్నవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు భారీగా అంతర్గత రహదారులపైకి చేరి ప్రవహిస్తుండడంతో ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 65 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కూనవరం మండలం, కొండ్రాజుపేట కాజ్ వే పైకి వరదనీరు చేరడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్ పురం మండలం, అన్నవరం వాగు వంతెన పై ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మండల కేంద్రం నుండి సుమారు 45 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామగిరి గ్రామంలో వర్షపు వరద నీరు నివాసాలలోకి వచ్చి చేరడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.
ఎటపాక మండలం, గౌరీదేవిపేట, నల్లకుంట గ్రామాల మధ్య వరదనీరు చేరడంతో సుమారు 5 గ్రామాలు బాహ్యప్రపంచానికి సంబంధాలు కోల్పోయాయి. ఒక వైపు ఎడతెరపి లేని భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది, మరోవైపు గోదావరి, శబరి నదులకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో విలీన మండలాల నిర్వాసితులు భయాందోళనకు గురవుతున్నారు.