బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్.. ప్రవీణ్..?
హైదరాబాద్, జూన్ 17, (న్యూస్ పల్స్)
Harish.. Praveen as president of BRS..?
భారత రాష్ట్ర సమితి ఉనికి సమస్యల్లో పడింది. అసెంబ్లీ ఎన్నికల వరకూ బలంగా ఉన్న పార్టీ తర్వాత ఒక్క సారిగా వెనుకబడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం.. తర్వాత ఐదు నెలలకే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం భారత రాష్ట్ర సమితి నేతల్ని ఒక్క సారిగా నిరాశకు గురి చేసింది. పార్టీ భవిష్యత్ పై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలు అంతా పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పార్టని కాపాడుకునేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో మేథోమథనం జరుపుతున్నారు. తాను గౌరవాధ్యక్షుడిగా ఉండి… ఇతరులకు బాధ్యతలివ్వాలని ఆలోచిస్తున్నారని ఈ మేరకు పార్టీ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు పూర్తి చేశారని చెబుతున్నారు.
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా హరీష్ రావును నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ గౌరవాధ్యక్షుడిగా తాను ఉండి నడిపిస్తానని ప్రత్యక్షంగా పార్టీ ఫేస్‌గా హరీష్ రావు ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ మేరకు మాజీ సీఎం తనకు అత్యంత సన్నిహితులు, సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించిన హరీశ్‌కు బీఆర్ఎస్లో ‘మాస్ పల్స్’ తెలిసిన నాయకుడిగా పేరుంది. కేటీఆర్ కాకుండా హరీషే ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే కేటీఆర్ కన్నా హరీష్ రావే ప్రస్తుతం మంచి చాయిస్ అనుకుంటున్నారు.
గతంలో హరీష్ రావును నిర్లక్ష్యం చేశారన్న ప్రచారం జరిగింది. అందుకే తరచూ ఆయన పార్టీ మారబోతున్నారన్న పుకార్లు వస్తున్నాయి. అయితే హరష్ రావు మాత్రం ఎప్పుడూ అలాంటి పుకార్లకు బలం ఇచ్చేలా వ్యవహరించలేదు. కేసీఆర్ చెప్పింది చేస్తూ వెళ్లారు. పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన కన్నా.. ప్రస్తుత పరిస్థితుల్ని హరీష్ రావే చక్కదిద్దగలరని కేసీఆర్ గట్టి నమ్మకంగా ఉన్నారని చెబుతున్నారు. ఒక వేళ హరీష్ రావును అధ్యక్షుడిగా చేయలేకపోతే కేసీఆర్ మరో ఆలోచన చేస్తున్నారు. అదే దళిత అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఆ మాటను నిలబెట్టుకోలేదు. దీనిపై ఇప్పటికీ ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తూంటారు. ఈ కారణంగా బీఆర్ఎస్కు దళిత ఓటు బ్యాంక్ పెద్దగా లేదన్న అభిప్రాయం ఉంది. ఈ మైనస్‌ను చెరుపుకోవడంతో పాటు దళిత ఓటు బ్యాంక్‌ను సాధించేందుకు ప్రవీణ్ కుమార్‌నే అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ‘ఉభయ తారకం’గా ఉంటుందన్న కోణంలోనూ కేసీఆర్ సమీకరణాలు లెక్కపై చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఇలా ముందుకెళితే గతంలో ఉన్న మచ్చను పోగొట్టుకోవచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. ప్రవీణ్ కుమార్ కు దళిత వర్గాల్లో ఆదరణ ఉంది. స్వేరో పేరుతో ఆయన ఓ దళిత యువత తో కూడిన సైన్యాన్ని కూడా నడిపిస్తున్నారు.
హరీష్ రావు లేకపోతే ప్రవీణ్ కుమార్‌లను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి తాను గౌరవ అధ్యక్షుడిగా రాజకీయాలను నడిపే అవకాశాలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బలంగా ఉండేది. ఆ బలం అధికారంలో ఉండటం వల్ల వచ్చి చేరిన నేతల వల్ల వచ్చింది. బీఆర్ఎస్ అసలుబలం.. తెలంగాణ ఉద్యమం.. తెలంగాణ సెంటిమెంట్. కానీ రాజకీయంగా బలపడే ప్రయత్నంలో కేసీఆర్ ఇలాంటి ఉద్యమకారుల్ని చాలా మందిని దూరం చేసుకున్నారు.
హరీష్ రావు లేదా ప్రవీణ్ కుమార్‌లకు బాధ్యతలు ఇస్తే వారిలో చాలా మంది వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా తగ్గిపోయిన సమయంలో ఉద్యమ నేతలు ఎందుకు వెనక్కి వస్తారని.. ఏ పార్టీలో కంఫర్ట్ గా ఉంటే అక్కడే ఉంటారని.. రాజకీయ భవిష్యత్ ఉందనిపిస్తేనే ఎవరైనా వస్తారని.. అలాంటి అవకాశం ఉందని ఆశలు కల్పించాల్సి ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని హరీష్ రావు లేదా ప్రవీణ్ కుమార్‌లకు ఇస్తారంటే… కేసీఆర్ మార్క్ రాజకీయాలను దగ్గరగా చూసిన వారు నమ్మడం లేదు. గతంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడల్లా కేసీఆర్ తాను రాజీనామా చేస్తానని ప్రకటించేవారు. ఆయనే ఉండాలని పార్టీ క్యాడర్ ఉద్యమం చేసేది. చివరికి క్యాడర్ కోరిక మేరకు తానే అధ్యక్షుడిగా ఉంటున్నానని ఆయన ప్రకటించేవారు.
ఈ సారి కూడా అలాంటిదేదో జరుగుతోందని కొంత మంది నమ్ముతున్నారు. ఆయన వైదొలగాలంటే ఇంత చర్చ పెట్టేవారు కాదని చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమ సహచరులతోపాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో లోతైన చర్చలు కొనసాగిస్తున్నారు. తన ఆలోచన బయటకు తెలియాలని.. తననే కొనసాగాలని పార్టీ క్యాడర్ నుంచి ఒత్తిడి రావాలన్న వ్యూహంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని .. తాను చర్చిస్తున్న వారి ద్వారా బయటకు తెలియాలనే వ్యూహమని అనుమానాలు కూడా ఉన్నాయి. త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ సమావేశంలో పార్టీ పూర్వ వైభవం కోసం తాను తీసుకోబోతున్న చర్యలేమిటో వివరించే అవకాశం ఉంది. అందులోనే కేసీఆర్ వైదొలుగుతారా లేకపోతే.. ఆయనే కొనసుగుతారా అన్నదానిపై స్పష్టత వస్తుంది.
KCR Rythu Yatra | త్వరలో కేసీఆర్ రైతు యాత్ర..? | Eeroju news