Guntur:భయపెడుతున్న జీబీఎస్:ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్‌తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది.
భయపెడుతున్న జీబీఎస్.
గుంటూరు, ఫిబ్రవరి 18
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్‌తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జీబీఎస్ లక్షణాలతో శ్రీకాకుళం జిల్లా గోదాయవలసకు చెందిన యువంత్ అనే బాలుడు.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి..అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జీబీఎస్ అంటు వ్యాధి కాదని..ఇన్ఫెక్షన్ల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.అరుదుగా లక్షమందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఈ నెల 11న ఒక్కరోజే ఏడు కేసులు వచ్చాయి. వారిలో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా జీబీఎస్ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. జీబీఎస్ కేసులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్‌గా ఉండాలని సూచించారు.ఏపీ వ్యాప్తంగా గత ఏడాది 301 జీబీఎస్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ 43 కేసులను గుర్తించినట్టు చెప్పారు..మంత్రి సత్యకుమార్. ప్రస్తుతం 17 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని వివరించారు. 85 శాతం మందికి చికిత్స అవసరం లేకుండానే ఈ వ్యాధి తగ్గుతుందని..కేవలం 15 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుందని చెప్పారు..సత్యకుమార్. ఈ వ్యాధికి అవసరమైన చికిత్స సదుపాయాలతో పాటు వ్యాక్సిన్లు కూడా సరిపడా ఉన్నాయని..ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రభుత్వం ఖర్చు గురించి ఎక్కడా ఆలోచించకుండా.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తగినన్ని ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతోందని స్పష్టం చేశారు. కరోనాలో జీబీఎస్ అంటు వ్యాధి కాదని.. జెనెటికల్ కూడా కాదని స్పష్టం చేశారు..ఏపీ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు. వ్యాధికి కచ్చితమైన కారకాలపై ఎలాంటి నిర్ధారణ లేదని..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జీబీఎస్ ఉందన్నారు. లక్షల్లో ఒకరికి మాత్రమే జీబీఎస్ వ్యాధి సోకే అవకాశం ఉంటుందని..వచ్చిన వారిలో కూడా 5 నుంచి 7 శాతం మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఒక్కసారిగా కాళ్లు చచ్చుబడినట్టు అనిపిస్తే..వెంటనే వైద్యులను సంప్రదించాలి..వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని వివరించారు.గులియన్ బారే సిండ్రోమ్ అంటువ్యాధి కాకపోయినా.. అప్రమత్తంగా ఉండాల్సిదే. అయితే గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి.. ఇప్పుడు పిల్లలు, శిశువులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. నూటికి 95 శాతం మంది వ్యాధిగ్రస్తుల్లో ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా..సకాలంలో చికిత్స అందించకపోతే ప్రమాదం. ఇది ఒకరకంగా పక్షవాతం లాంటిదే. చాలావరకు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారికే మొదలవుతుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయవచ్చు. వేళ్లు, మడమలు, మణికట్టు వంటి చోట్ల సూదులతో పొడుస్తున్నట్లు అనిపించడం.. కాళ్లలో మొదలైన బలహీనత పైకి విస్తరించడం, కాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది అవుతుంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి ఉంటుంది. నర్వ్ కండక్షన్, ఎలక్ట్రోమయోగ్రఫీ, సీఎన్‌ఎఫ్, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలతో.. వ్యాధిని నిర్ధారిస్తారు. వ్యాధి సోకిన తొలి దశలోనే ఆస్పత్రిలో చేరితే.. 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే..కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. అత్యధిక శాతం మందిలో ఇన్‌ఫెక్షన్ మొదలైన ఒకట్రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చినా, కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం..కాచి, వడబోసిన నీళ్లను తాగడం..ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం వంటి చర్యలతో వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.
20 వేల వరకు ఇంజెక్షన్
ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర రూ.20 వేల వరకూ ఉంటుందన్న మంత్రి.. జీబీఎస్ రోగులకు రోజుకు ఐదు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలా ఐదురోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. మరోవైపు జీబీఎస్ కారణంగా ఏపీలో తొలి మరణం ఆదివారం సంభవించింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ జీబీఎస్ వ్యాధితో బాధఫడుతూ గుంటూరు ఆస్పత్రిలో ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. అయితే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే కోలుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. కాళ్ల తిమ్మిర్లు, పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Read more:Andhra Pradesh:హామీల అమలు కోసం క్యాలెండర్