Guntur:తిన్నోళ్లకు తిన్నంత చికెన్:తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ రేట్లు పడిపోయాయి.
తిన్నోళ్లకు తిన్నంత చికెన్
గుంటూరు, ఫిబ్రవరి 22,
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ రేట్లు పడిపోయాయి. కోడి గుడ్డు ధర సైతం భారీగా పతనమైంది. చికెన్, కోడిగుడ్ల రేట్లు పడిపోవటంతో కోళ్లఫారం యజమానులు, పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఫౌల్ట్రీ ఫెడరేషన్ నివారణ చర్యలకు దిగింది. ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు.ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన చికెన్ ఫుడ్ మేళాకు విశేషమైన స్పందన వచ్చింది. చికెన్ ఫుడ్ మేళాలో నిర్వాహకులు చికెన్ వంటకాలను ఉచితంగా అందజేశారు. ఉడికించిన చికెన్, కోడి గుడ్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదని వచ్చిన జనాలకు నిర్వాకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ సైతం పాల్గొన్నారు. మరోవైపు ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేస్తూ ఉండటంతో ఆహార ప్రియులు చికెన్ ఫుడ్ మేళాకు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్వాహకులు గేట్లకు తాళం వేయాల్సి వచ్చింది. అటు హైదరాబాద్లోని ఉప్పల్లో కూడా ఇలాగే ఫ్రీగా చికెన్ పంపిణీ చేశారు. ఉచితంగా చికెన్, కోడిగుడ్ల వంటకాలు పంపిణీ చేశారు. దీంతో ఈ చికెన్ మేళాకు భారీగా జనం క్యూ కట్టారు. సుమారుగా అర కిలోమీటర్ మేర బారులు తీరారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అదుపులో ఉందని ఏపీ పశుసంవర్ధక శాఖ తెలిపింది. బర్డ్ ఫ్లూ వైరస్ గురించి పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఇటీవల ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లాలోని వేల్పూరు, కృష్ణా జిల్లాలోని బాదంపూడి, కర్నూలు జిల్లాలోని ఎన్.ఆర్.పేట, ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెంలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలలో పశు సంవర్ధక శాఖ అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కోళ్లు చనిపోయిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతం నుంచి కోళ్లు, కోడిగుడ్ల రవాణాపై ఆంక్షలు విధించారు.
Read more:Kurnool:అర్థరూపాయికి టమోటా