కరీంనగర్, జూన్ 14, (న్యూస్ పల్స్)
రామగుండం ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిద రవాణాకు సంబంధించి కాంగ్రెస్, బిఆర్ఎస్ బిజేపి నేతల మధ్య రోజురోజుకు మాటల యుద్ధం పెరుగుతోంది. బూడిద రవాణాలో ఆక్రమాలు చోటుచేసుకున్నాయని ఓ పార్టీ ఆరోపిస్తుండగా.. రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని మరో పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.అక్రమ రవాణాతో పాటు ప్రతి రోజూ రూ. లక్షల్లో అవినీతి జరుగుతోందని, అందులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని బిఆర్ఎస్ కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు ఉమ్మడి జిల్లాలో చర్చకు దారి తీశాయి. తాను స్వయంగా కొన్ని లారీలను పట్టించినప్పటికీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని, అధికారులు కేసులు నమోదు చేశారనే విషయాన్ని ఆధారాలతో చూపించారు. బూడిద తరలింపు వ్యవహారంలో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పడానికి తాను చర్చకు సిద్ధమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జీ వొడితెల ప్రణబ్ సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి చౌకబారు ఆరోపణలను ఆధారాలతో నిరూపించకపోతే కోర్టుకు ఈడుస్తామని మానకొండూరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. చిల్లర బుద్ధి మానుకుని హుజురాబాద్ ప్రజలకు సేవ చెయ్యాలని సూచించారు.
ఎన్టీపిసి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున దమ్ముంటే బీజేపీని ప్రశ్నించాలని సూచించారు. కమిషన్ల కోసమే అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. శవరాజకీయాలు చేసే కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక అక్రమ దందాతో అందినకాడికి దండుకుని అక్రమ సంపాదనకు రుచి మరిగిన కౌశిక్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేనందున ఫ్లై యాష్ బూడిద అక్రమ రవాణా చేస్తున్నారని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు.బూడిద రవాణా విషయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేశారు.
తాజాగా అదే అంశం చుట్టూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు సాగుతున్నాయి. ఆ రెండు పార్టీల మద్య ఆరోపణలు కేవలం బూడిద రవాణాలో కమీషన్ ల కోసమేనని బిజేపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. రాజకీయ పార్టీల నేతల మద్య ఆరోపణలు విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.రామగుండంలోని బొగ్గు ఆధారిత ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమ నుంచి వెలువడే తడి, పొడి బూడిదను పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లిలోని ప్రత్యేక చెరువులో నింపుతారు. 500 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో ప్రతి రోజూ టన్నుల కొద్దీ బూడిదను డంప్ చేస్తారు. ఇక్కడి బూడిదను రహదారుల నిర్మాణానికి, ఇటుకల తయారీకి వినియోగిస్తారు.ఎప్పటికప్పుడు తరలించేందుకు టెండర్లు పిలుస్తారు.
కాగా లారీలో గరిష్టంగా 40 టన్నుల బూడిదను తీసుకెళ్లాల్సి ఉండగా, పక్కలకు చెక్కలు కట్టి అదనంగా మరో 15 నుంచి 20 టన్నులు రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే రవాణా చేసే లారీకి తప్పనిసరిగా నంబరు ఉండాలి. కానీ నంబరు ప్లేటు లేని వాహనాల్లో యథేచ్చగా తరలిస్తూ కొందరు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా బూడిద రవాణా జరుగుతోందని, ఇందుకు లెక్కా పత్రం ఉండటంలేదనే విమర్శలున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని పలు ఇటుక బట్టీలకు, క్వారీల్లో గుంతలు పూడ్చేందుకు కూడా బూడిదను వినియోగిస్తున్న దాఖలాలున్నాయి.
అలాగే ఎక్కడ పడితే అక్కడ బూడిద నిల్వలు కనిపి స్తుండగా, ఇది చెరువు నుంచి అక్రమంగా తరలించినదేనంటూ పలువురు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి.ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే బూడిద తరలింపు వ్యవహారంపై రవాణా శాఖ అధికారులు పక్కాగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. తరలింపు కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు రోజూవారీగా ఎన్ని వాహనాలు వెళ్తున్నాయనే విషయమై వివరాలు పక్కాగా ఉంటేనే బూడిద రవాణా ప్రక్రియ పారదర్శకంగా సాగే వీలుంది. అంతేకాకుండా వాహనాలను మార్గమధ్యంలో తనిఖీలు చేయడం వల్ల ఆక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశముంది.మోతాదు కంటే అధిక పరిమాణంలో సరఫరా చేస్తుండటంతో లారీల వెనుక ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఆవస్థలు పడుతున్నారు.
రామగుండం నుంచి రాజీవ్ రహదారి సహా హుజూరాబాద్, వరంగల్ మార్గంలో నిత్యం వివిధ జిల్లాలకు పెద్ద ఎత్తున బూడిద రవాణా జరుగుతోంది. పగలు రాత్రి తేడాలేకుండా వందలాది వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. లారీలతో పలు చోట్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు అక్రమాలు, అవినీతికి తావు లేకుండా బూడిద రవాణా ప్రక్రియ నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ విషయమై పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు ఇటీవలి కాలంలో 70 వరకు అనుమతి లేని బూడిద లారీలను పట్టుకొని జరిమానా విధించామని తెలిపారు.
బూడిద తరలింపులో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఎన్టీపీసీతో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుపుతున్న నేషనల్ హైవే అథారిటీ విభాగాలు రెండూ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనివే కావడం గమనార్హం. రామగుండం సమీపంలోని ఈ బూడిద ప్లాంటు నుండి బూడిదను తరలించేందుకు ఆరు ఏజెన్సీలు అనుమతులు తీసుకున్నాయి. ఈ ఏజెన్సీలు ముందుగానే లోడ్ చేసే లారీల నంబర్లను ముందుగానే ఎన్టీపీసీ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో ఉన్న ఈ యాష్ ప్లాంటు నుండి వెల్లే ప్రతి లారీకి మెయిన్ ఎంట్రన్స్ వద్ద సర్టిఫై చేసిన కాపీ ఇస్తుంటారు. ఈ పేపర్ ద్వారా ఖమ్మం జిల్లాలో నిర్మాణం సాగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే వద్దకు చేరుకున్న లారీ అన్ లోడ్ చేసిన తరువాత రోడ్ కాంట్రాక్ట్ ఏజెన్సీ నుండి క్లియరెన్స్ ఇస్తారు. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఏంటంటే..? గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టు కంపెనీ తూకాన్ని బట్టి బూడిద తరలించే ఏజెన్సీలకు డబ్బులు చెల్లిస్తుంటుంది.