Gottipati on the ZP pedestal | జెడ్పీ పీఠంపై గొట్టిపాటి గురి | Eeroju news

Gottipati

జెడ్పీ పీఠంపై గొట్టిపాటి గురి

ఒంగోలు, జూలై 11, (న్యూస్ పల్స్)

Gottipati on the ZP pedestal

ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు మంచి జోరుమీద కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీడీపీ… జిల్లా పరిషత్‌లోనూ జెండా ఎగరేయాలని ప్లాన్‌ చేస్తోంది. జిల్లాలో 56 మండలాలు ఉంటే.. వైసీపీకి 55 మంది జడ్పీటీసీలు ఉన్నారు. మిగిలిన ఒక్కస్థానంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. అసలు ఒక్క సభ్యుడూ లేని జడ్పీని టీడీపీ కైవసం చేసుకుందామని ప్లాన్‌ చేయడమే రాజకీయంగా ఇంట్రస్టింగ్‌గా మారింది. ఒక్కరూ లేనిచోట టీడీపీ జెండా ఎలా ఎగురుతుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం బూచేపల్లి వెంకాయమ్మ వ్యవహరిస్తున్నారు. ఈమె దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తల్లి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడైన బూచేపల్లి 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో 2022లో జరిగిన ఎన్నికల్లో ఆయన తల్లికి జడ్పీ చైర్‌పర్సన్‌ కట్టబెట్టింది వైసీపీ. జడ్పీలో సంపూర్ణ బలం ఉండటంతో చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వెంకాయమ్మ. ఇక అసెంబ్లీ ఎన్నికల వరకూ జడ్పీలో చక్రం తిప్పిన బూచేపల్లికి… రాష్ట్రంలో అధికారం మారడంతో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్వల్ప ఓట్లతో గెలిచారు. అది కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సోదరుడి కుమార్తె డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీపై గెలిచారు. జిల్లాలో పది చోట్ల గెలిచిన టీడీపీ, దర్శిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారంగా జడ్పీలో వైసీపీని గద్దె దించాలని ప్లాన్‌ చేస్తోంది. దర్శిలో ఓడిన గొట్టిపాటి లక్ష్మిని జడ్పీ చైర్‌పర్సన్‌ చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే మంత్రి గొట్టిపాటి అనుకున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి నుంచి బూచేపల్లి వెంకాయమ్మను దింపడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి.

మంత్రి గొట్టిపాటి తలచుకుంటే అదేమీ పెద్ద పనికాదనే అభిప్రాయం జిల్లాలో వినిపిస్తోంది. 55 మంది సభ్యుల్లో 28 మందిని టీడీపీలో చేర్చుకుంటే జడ్పీ పీఠం టీడీపీ వశమవుతుందని లెక్కలు వేస్తోంది టీడీపీ. ఇందుకోసం ఆపరేషన్‌ స్టార్ట్‌ చేసింది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి నలుగురు జడ్పీటీసీలు టీడీపీలో చేరగా, మరికొందరు ప్రస్తుతం మంత్రి గొట్టిపాటితో టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకో 24 మంది సభ్యులు అవసరం కాగా, మంత్రితో టచ్‌లో ఉన్నవారు… పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నవారు లిస్టు చాలా ఎక్కువే ఉందంటున్నారు. దీంతో వైసీపీలో అలజడి మొదలైందని చెబుతున్నారు.

జడ్పీ పీఠం నుంచి చైర్‌పర్సన్‌ను దించేయాలంటే పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం నాలుగేళ్లు తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే ఇంకో రెండేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. పంచాయతీలు, గ్రామాల అభివృద్ధిలో జడ్పీ కీలకంగా ఉండటంతో జడ్పీ పీఠం తమ ఆధీనంలో ఉండాలని భావిస్తున్న టీడీపీ అవసరమైతే… పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించే విషయాన్ని పరిశీలిస్తోందంటున్నారు. మొత్తానికి ప్రకాశం జడ్పీని కైవసం చేసుకోవడమే టార్గెట్‌గా స్కెచ్‌ రెడీ చేస్తున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌. పార్టీపరంగా ఒక్క సభ్యుడు లేని టీడీపీ… ఏకంగా చైర్మన్‌ గిరీపై గురిపెట్టి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతుండగా, జడ్పీటీసీలను రక్షించుకోవడంపై టెన్షన్‌ పడుతోంది వైసీపీ… మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారకుండానే.. జడ్పీ రాజకీయం వేడిపుట్టిస్తోంది.

Gottipati

 

Lack of creativity on the struggle of MPTC ZPTCs | ఎంపిటిసి జడ్పిటిసి ల సమరం పై సృష్టత కరువు | Eeroju news

Related posts

Leave a Comment