Funds | నిధులండి.. బాబు నిధులు | Eeroju news

Chandrababu & Narendra modi

నిధులండి…బాబు నిధులు…

విజయవాడ, జూలై 19, (న్యూస్ పల్స్)

Funds

పదవుల కంటే.. నిధులే ముఖ్యం. కేంద్రంలో మన రోల్ ఏంటన్నదాని కంటే.. కేంద్రప్రభుత్వం నుంచి మనం ఏం తెచ్చుకుంటున్నామనేదే కీలకం. నవ్యాంధ్ర దేశంలోనే టాప్‌లో ఉండాలి. విభజన తర్వాత దెబ్బతిన్న స్టేట్‌ను.. దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఇదే ఎజెండాతో పనిచేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు.. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దఎత్తున నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు రెండువారాల వ్యవధిలోనే రెండోసారి ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు.. గత పర్యటనలోనే ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తో భేటీ అయ్యి.. విజ్ఞప్తులు ఇచ్చారు.

ఈ నెల 4, 5న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు.. ఏపీకి ఏం అవసరం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి.. కేంద్రం అందించాల్సిన సాయం ఏంటనే దానిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడాని కంటే ముందు చంద్రబాబు వరుసపెట్టి ఢిల్లీలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే వైసీపీ పాలనలో ఏపీ అప్పుల పాలైందని గత ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 13లక్షల కోట్లకు పెరిగాయని చెబుతున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల దగ్గర ప్రస్తావించి మెరుగైన సాయం అందించాలని విజ్ఞప్తులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. స్పెషల్ స్టేటస్ కోసం ఎప్పటినుంచో అటు బీహార్, ఇటు ఏపీ డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జేడీయూ, టీడీపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో కీలకంగా ఉన్నాయి.

దీంతో ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో భారీగా ఆర్థిక లబ్ది చేకూరేలా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అటు నితీశ్‌కుమార్, ఇటు చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది.సీఎం చంద్రబాబు మెయిన్‌గా పోలవరం, అమరావతిపై ఫోకస్ పెట్టారు. పోలవరం పూర్తి చేస్తే తాగు, సాగు నీళ్లు అందించొచ్చు. అమరావతి అభివృద్దికి అడుగులు పడితే పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పోలవరం ప్రాజెక్టు పనుల్లో స్పీడు పెంచాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని మోదీని కలిసినప్పుడు కోరారు.

ఇక అమరావతి అభివృద్ది కోసం ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆర్థిక సాయం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బడ్జెట్‌లో ఏపీకి అదనపు కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.రోడ్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలు, తాగు, సాగు నీటిప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలనేది చంద్రబాబు రిక్వెస్ట్. అంతేకాదు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని ఏపీకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దుగరాజపట్నం పోర్ట్ అభివృద్ధికి సహకరించడంతో పాటు క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు అందజేశారు.

లేటెస్ట్ హస్తిన టూర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి.. విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ 9,10లోని అంశాలు పరిష్కారం అయితే..ఆ శాఖల పేరుతో బ్యాంకుల్లో ఉన్న నిధులను వాడుకోవచ్చని భావిస్తున్నారు చంద్రబాబు.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మొదటిసారి పెడుతున్న బడ్జెట్ ఇది. మరో వారం రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం.

ఈనేపథ్యంలో ఎన్డీయే సర్కార్‌లో కీలకంగా ఉన్న నితీశ్‌కుమార్, చంద్రబాబు ఇద్దరు నిధుల కోసం పట్టబడుతున్నారు. అయితే బీజేపీ కూడా ఈ ఇద్దరు నేతల ప్రతిపాదనలను, డిమాండ్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కోరినన్ని నిధులు ఇవ్వకపోయినా.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే బడ్జెట్ కేటాయింపులు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఈసారి కాకపోయిన రాబోయే నాలుగేళ్లలో అయినా దశలవారిగా కావాల్సిన నిధులను తెచ్చుకుని ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఫిక్స్ అయింది ఏపీ సర్కార్

Chandrababu & Narendra modi

 

Modi’s full-fledged visit is very important to them Russian President Vladimir Putin | మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనది | Eeroju news

Related posts

Leave a Comment