Free Power schme in Andhra Pradesh ఏపీలో ఉచిత విద్యుత్ స్కీమ్..
విజయవాడ, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్)
ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్దమైంది. తాజాగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకాన్ని తొలగించినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం తెలిపింది. వెంటనే పలు మార్గదర్శకాలను పాటిస్తే, ఉచిత విద్యుత్ పథకంతో లబ్ది పొందవచ్చని విద్యుత్ శాఖ కూడా ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూర్చింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, పథకాన్ని రద్దు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, లబ్దిదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, 10547 మంది కొత్త లబ్దిదారులు అర్హత సాధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్నారట.గతంలో మాజీ సీఎం జగన్ ప్రయోగించిన ఆరు అంచెల కోత విధానం వల్ల రాష్ట్రంలో చాలా మంది పేదలు సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోయారని టీడీపీ విమర్శలు చేస్తోంది. వారిలో ఎస్సీ, ఎస్టీలు కూడా ఉన్నారని, అటువంటి వారిని గుర్తించి లబ్దిదారులుగా తమ ప్రభుత్వం గుర్తిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
అయితే ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా, పథకం వర్తించకపోతే పలు మార్గదర్శకాలు పాటించాలని విద్యుత్ శాఖ కోరుతోంది.మొదటగా అర్హులు తమ దగ్గరలోని మీ సేవ కేంద్రాలను గాని, విద్యుత్ కార్యాలయాల్లో గానీ కుల ధ్రువీకరణ పత్రం అందజేస్తే చాలు ఈ పథకం మీకు వర్తిస్తుంది. అనంతరం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను మీరు పొందగలుగుతారు. ఎప్పటిలాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందని, అర్హులు ఈ విషయాన్ని గమనించి వెంటనే విద్యుత్ కార్యాలయాలను సంప్రదించాలని వారు కోరారు. మరెందుకు ఆలస్యం.. వెంటనే మీ కుల ధృవీకరణ పత్రం తీసుకువెళ్లండి.. ఉచిత విద్యుత్ పొందండి.