Four years in jail for Hinduja brothers | 15 హిందూజా సోదరులకు నాలుగేళ్ల జైలు | Eeroju news

Four years in jail for Hinduja brothers

15 హిందూజా సోదరులకు నాలుగేళ్ల జైలు

న్యూఢిల్లీ,జూన్ 24, (న్యూస్ పల్స్)

Four years in jail for Hinduja brothers :

హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులకు స్విస్ క్రిమినల్ కోర్టు నాలుగు నుంచి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన మరింత తీవ్రమైన అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది.భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ప్రకాశ్ హిందూజా, ఆయన భార్య, కుమారుడు, కోడలు జెనీవాలోని విలాసవంతమైన లేక్ సైడ్ విల్లాలో పనిచేస్తున్న నిరక్షరాస్యులైన భారతీయులను అక్రమంగా రవాణా చేశారని ఆరోపణలు వచ్చాయి.కార్మికులను దోచుకోవడం, అనధికారిక ఉపాధి కల్పించడంలో నలుగురూ దోషులని కోర్టు పేర్కొంది. తాము ఏం చేస్తున్నామో సిబ్బందికి అర్థమైందనే కారణంతో అక్రమ రవాణా ఆరోపణలను తోసిపుచ్చారు.నలుగురు హిందుజా కుటుంబ సభ్యులు కార్మికుల పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నారని, వారికి వేతనాలు స్విస్ ఫ్రాంక్ లో కాకుండా రూపాయిలో చెల్లించారని, వారిని విల్లా నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని, స్విట్జర్లాండ్ లో తక్కువ ధరకు ఎక్కువ గంటలు పని చేయమని బలవంతం చేశారని ఆరోపణలు వచ్చాయి.

భారత్ మూలాలున్న ఈ కుటుంబం పిటిషనర్లతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు గత వారం క్రిమినల్ కోర్టులో వెల్లడైంది. దోపిడీ, మానవ అక్రమ రవాణా, స్విస్ కార్మిక చట్టాల ఉల్లంఘన వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో జెనీవా ప్రాసిక్యూటర్లు కేసు నమోదు చేశారు.దశాబ్దాల క్రితం నుంచి హిందూజా కుటుంబం స్విట్జర్లాండ్ లో నివాసం ఏర్పరుచుకొని జీవిస్తోంది. ప్రకాశ్ ఇప్పటికే 2007 లో ఇలాంటి ఆరోపణలపై దోషిగా ఉన్నాడు. అయినప్పటికీ ప్రాసిక్యూటర్లు అతను సరైన పత్రాలు లేకుండా ఇండియా నుంచి వ్యక్తులను తీసుకొని వచ్చి పనిలో పెట్టుకుంటున్నాడని పేర్కొన్నారు.

ఈ తీర్పుపై హిందుజా కుటుంబం స్పందిస్తూ.. ‘ఈ న్యాయస్థానంలో తీసుకున్న నిర్ణయాలతో దిగ్భ్రాంతికి గురయ్యాం, నిరాశ చెందాం, వాస్తవానికి మేము పైకోర్టుకు అప్పీల్ దాఖలు చేశాం, స్విస్ చట్టాల ప్రకారం అత్యున్నత న్యాయ నిర్ణేత తుది తీర్పును అమలు చేసే వరకు నిర్ధోషి అనే భావన చాలా ముఖ్యం’ అని బాధిత కుటుంబం మీడియాకు తెలిపింది.ఈ కేసులో పిటిషనర్లు తమ ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారని, తాము ఎలాంటి చర్యలకు పాల్పడలేదని కోర్టుకు చెప్పారని తెలిపింది. న్యాయ ప్రక్రియపై తమ కుటుంబానికి పూర్తి విశ్వాసం ఉందని, నిజా నిజాలు బయటపడతాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రకాశ్ హిందూజా, కమల్ హిందుజా, అజయ్ హిందూజా, నమ్రతా హిందుజా తరఫున న్యాయవాదులు యాయెల్ హయత్, రాబర్ట్ అస్సెల్, రొమైన్ జోర్డాన్ వాదనలు వినిపించారు.

స్విస్ ప్రాసిక్యూటర్ వైవ్స్ బెర్టోస్సా తెలిపిన వివరాల ప్రకారం.. హిందూజా కుటుంబం తమ పనిమనుషుల్లో ఒకరికి తమ పెంపుడు కుక్క కోసం చేసిన ఖర్చుకంటే తక్కువ డబ్బు చెల్లించింది. భారతీయ ఉద్యోగుల అక్రమ రవాణా, దోపిడీకి సంబంధించి విచారణ సందర్భంగా బెర్టోస్సా ఈ సమాచారాన్ని సమర్పించారు.హిందుజా కుటుంబ చర్యలను తీవ్రంగా విమర్శించిన ప్రాసిక్యూటర్ నిందితులకు ఐదున్నరేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని సిఫారసు చేశారు. సిబ్బంది, హిందూజాలు స్వయంగా అందించిన సాక్ష్యాలు, దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా బెర్టోస్సా వాదనలు వినిపించారు.వారు తమ సేవకుల కంటే కుక్క కోసం ఎక్కువ ఖర్చు చేశారు’ అని ఆయన చెప్పారు. వారం పాటు రోజుకు 18 గంటలు పనిచేసే మహిళకు ఒకానొక సమయంలో 7 స్విస్ ఫ్రాంక్ లు (7.84 డాలర్లు) మాత్రమే చెల్లించారు.

‘పెంపుడు జంతువులు’ అనే శీర్షికతో ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్ ను ఆయన బెంచ్ ముందు ఉంచారు. ఈ కుటుంబం తమ పెంపుడు కుక్క కోసం సంవత్సరానికి 8,584 స్విస్ ఫ్రాంక్ లను ఖర్చు చేసిందని బెర్టోస్సా అన్నారు.పనిలో పెట్టుకునే సందర్భంలో పని గంటలు, సెలవుల గురించి చెప్పలేదు. వారి పాస్ పోర్టులు దగ్గర ఉంచుకోవడం.. భారత్ కరెన్సీ రూపీల్లో వేతనాలు చెల్లిస్తున్నందున వారి వద్ద స్విస్ ఫ్రాంక్ లు లేవని, వారు బయట ఏం ఖర్చు పెట్టుకుంటారని, యజమాని అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటకు రాలేరని, వారికి స్వేచ్ఛ లేదని బెర్టోస్సా వాదించారు.చట్టపరమైన ఫీజులు, జరిమానాల కోసం వాటిని ఉపయోగించవచ్చని స్విస్ అధికారులు ఆ కుటుంబం నుంచి వజ్రాలు, రుబీలు, ప్లాటినం నెక్లెస్, ఇతర ఆభరణాలు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

రిసెప్షన్ల కోసం ఉద్యోగులు గంటల తరబడి పనిచేశారని, కొలోనీ పరిసరాల్లోని విల్లా బేస్మెంట్ లో నిద్రపోయేవారని, కొన్నిసార్లు నేలపై పడుకున్నారని ప్రాసిక్యూటర్లు కోర్టుకు వివరించారు. కమల్ హిందూజా సృష్టించిన భయానక వాతావరణాన్ని వారు అభివర్ణించారు. కొంత మంది ఉద్యోగులు హిందీ మాత్రమే మాట్లాడుతున్నారని, వారికి అందుబాటులో లేని బ్యాంకుల్లో భారతీయ రూపీలో వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. 2000 సంవత్సరంలో స్విస్ పౌరసత్వం పొందిన ప్రకాశ్ హిందూజాపై స్విస్ అధికారులు తెచ్చిన ప్రత్యేక పన్ను కేసు పెండింగ్ లో ఉంది.ముగ్గురు సోదరులతో కలిసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, విద్యుత్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో పారిశ్రామిక దిగ్గజానికి నేతృత్వం వహిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రస్తుతం హిందూజా కుటుంబం నికర విలువను 20 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.

Four years in jail for Hinduja brothers

 

For the reels… Madness… | రీల్స్ కోసం… పిచ్చిపనులు… | Eeroju news

 

 

Related posts

Leave a Comment